సంగారెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి పాలన చేతకాక సంక్షేమ పథకాలన్నీ బంద్ చేశాడని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో(Isnapur Municipality) మాజీ మంత్రి, హరీష్ రావు(Harish rao) విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు కాంగ్రెస్ పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను హరీశ్ రావు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..ఈ రాష్ట్రంలో పదేండ్ల కేసీఆర్ పాలన చూశారు. ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. ఈ మధ్య కొంతమంది పంచాయతీ సెక్రటరీలు, ఉద్యోగులు నా దగ్గరకు వచ్చి వాళ్ల బాధలు చెప్పుకున్నారు.వాళ్లతో నేను ఒక్కటే మాట అన్నా.. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్, పర్మినెంట్ చేసింది కేసీఆర్, జీతాలు పెంచింది కేసీఆర్. కానీ ఆయన్ను ఓడగొట్టి కాంగ్రెస్ ను గెలిపించింది మీరే కదా అన్నాను. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయామని ఇప్పుడు వాళ్లు బాధపడుతున్నారని తెలిపారు.
కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు గ్రహిస్తున్నారు.
మళ్లీ కరెంట్ కోతలు మొదలయ్యాయి..
ఉన్న కేసీఆర్ కిట్ బంద్ పెట్టాడు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తానని ఆశపెట్టి.. కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయల చెక్కును కూడా నెలల తరబడి ఆపుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ రాకముందు ఇస్నాపూర్‌లో పవర్ హాలిడేస్ ఉండేవి. కేసీఆర్ వచ్చాక 24 గంటల కరెంట్ ఇవ్వడంతో.. ఇక్కడ పరిశ్రమల్లో ఓటీలు దొరికి నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు. ఇప్పుడు మళ్లీ కరెంట్ కోతలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన మహనీయుడు. అలాంటి పెద్దమనిషిని పట్టుకుని రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇదా..
అసెంబ్లీలో పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్ అని అడిగితే.. నీ లాగుల తొండలు తీస్తా అంటాడు. మహిళలకు 2500 అడిగితే పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటాడు. తులం బంగారం ఏది అని అడిగితే గుడ్లు పీకి గోటీలు ఆడుతా అంటాడు. ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష? బతుకమ్మ చీరలు బంద్, క్రిస్టియన్-ముస్లింలకు ఇచ్చే కానుకలు బంద్, రైతుబంధు బంద్, దళిత బంధు బంద్, గొర్రెల పంపిణీ బంద్.. ఇలా కేసీఆర్ ఇచ్చినవన్నీ బంద్ పెట్టిన బంద్‌ల బాబు రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.
ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. మీకు అందుబాటులో ఉండే వాళ్లకు, మీ భవిష్యత్తును బాగా చూసుకునే వాళ్లకు ఓటెయ్యాలి. మనకు అన్నం పెట్టిన కేసీఆర్‌ని గుర్తు చేసుకోవాలి. ఇస్నాపూర్ అభివృద్ధి కొనసాగాలన్నా, పేదల సంక్షేమ పథకాలు మళ్లీ రావాలన్నా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని, మనల్ని మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి అని పిలుపునిచ్చారు.