తుర్కయాంజాల్, నవంబర్ 18 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డివి అన్నీ తుగ్లక్ పనులని, ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టగానే హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో రాత్రి 10 గంటలకే దుకాణాలు బంద్ అని, గచ్చిబౌలి-ఎయిర్పోర్ట్ మెట్రో రైలు రద్దు అని, ఫార్మాసిటీ రద్దు అని జోకులు చేస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. అవగాహన లేని మాటలు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నాడని విమర్శించారు. రం గారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ జేబీ క్రికెట్ గ్రౌండ్లో తెలంగాణ అమరవీరుల స్మారక క్రికెట్ టోర్నీ (తెలంగాణ చాంపియన్స్ ట్రోఫీ) బహుమతుల ప్రదానోత్సవాన్ని సోమవారం నిర్వహించగా హరీశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ అమరవీరుల గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని, వారి కుటుంబాలకు ప్రభు త్వ ఉద్యోగంతోపాటు రూ.10 లక్షల చొప్పున అందజేసి గౌరవించామని గుర్తుచేశారు. అమరుల త్యాగఫలితం, విద్యార్థుల పోరాటం, కేసీఆర్ కృషితోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని పునరుద్ఘాటించారు. గడిచిన పదేండ్లలో రాష్ర్టాన్ని కేసీఆర్ అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపితే రేవంత్‌రెడ్డి 11 నెలల్లోనే పదేండ్లు వెనక్కి తీసుకెళ్లాడని విమర్శించారు.
రాజకీయాలకు, క్రికెట్‌కు దగ్గరి సంబం ధం ఉన్నదని.. రాజకీయాల్లో హత్యలుండవని.. క్రికెట్లో హిట్ వికెట్ మాదిరిగా రాజకీయ ఆత్మహత్యలు ఉంటాయని హరీశ్ పేర్కొన్నారు. పేదల ఇండ్లు కూలగొట్టడమంటేనే రేవంత్‌రెడ్డి హిట్‌వికెట్ అయినట్టని, పేదల ఇండ్ల జోలికెళ్లి రేవంత్ డకౌట్ అయ్యాడని ఎద్దేవాచేశారు. రూ.3800 కోట్లతో మూసీ అభివృద్ధిని ప్రారంభించింది కేసీఆర్ అని గుర్తుచేశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మూసీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉండి పేదల ఇండ్ల జోలికి పోకుండా మురుగునీరు మూసీలోకి రాకుండా రూ.3800 కోట్లతో 31 ఎస్టీపీల నిర్మాణం చేపట్టినట్టు వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రూ.1100 కోట్లతో గోదావరి నీళ్లను మూసీలోకి తీసుకొచ్చి పారించాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తే.. రేవంత్‌రెడ్డి గోదావరి నీళ్లు తెచ్చుడు, ఎస్టీపీలను బంద్‌పెట్టి పేదల ఇండ్లను కూలగొడుతున్నాడని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ము ఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 11 నెలలు గడుస్తున్నా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు చేయలేదని హరీశ్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలను చదువుకు దూరం చేసే కుట్రతోనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బిల్లులు మంజూరు కావాలంటే 8 శాతం కమీషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నదని హరీశ్ చెప్పారు. కేసీఆర్ హైదరాబాద్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చారని, ఎన్నో ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించారని గుర్తుచేశారు. రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. అనంతరం టోర్నీలో విజేతలకు బహుమతులు అందజేశారు. నిర్వాహకులు మాధవరం నరసింహారావును ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్, హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు, నాయకులు విప్లవ్, రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.