Harish Rao : తాను ఎక్కడ ఉన్నా ప్రజల కష్టాలు, రైతుల ఇబ్బందుల మీదనే తన ధ్యాస ఉంటుందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మరోసారి చాటి చెప్పారు. అమెరికాలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలోని రైతులు ధాన్యం అమ్ముకునేందుకు పడుతున్న కష్టాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్లకు ఫోన్ చేసి కొనుగోళ్లలో వేగం పెంచాలని హరీశ్ రావు కోరారు.
తన కుమారుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ పట్టా అందుకున్న సందర్భంగా ఇటీవల హరీష్ రావు అమెరికా వెళ్లారు. వ్యక్తిగత పర్యటనలో ఉన్న ఆయన.. సిద్దిపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో ఆలస్యం కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపేందుకు చొరవ చూపారు. ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో సమస్య ఎక్కువగా ఉందని తన దృష్టికి రావడంతో హరీష్ రావు తక్షణమే స్పందించారు.
అమెరికాలో ఉన్న అన్నం పెట్టె అన్నదాతలు ఆందోళనలో ఉన్నారని తెలిసి అటు ప్రభుత్వం మంత్రులతో.. ఇటు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కోనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న అవస్థలు.. ఇబ్బందులు వారి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఒక వైపు వడ్లు.. మరో వైపు పొద్దు తిరుగుడు ధాన్యం కొనకపోడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం తో రైతు లు రోడ్ల మీదకు వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు హరీష్ రావు అమెరికా నుండి ఫోన్ చేశారు. ధాన్యం, పొద్దుతిరుగుడు కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని వారిని కోరారు. గత 40 రోజులకు పైగా పొద్దు తిరుగుడు రైతులు కేంద్రాల వద్దనే పడిగాపులు పడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్ రావు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా కొనుగోలు చేయకుంటే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా జొన్నల కొనుగోలు సైతం వెంటనే చేపట్టాలని, కొనుగోళ్ల కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిద్దిపేట కలెక్టర్ హైమావతితో సైతం మాట్లాడిన హరీష్ రావు ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు. లారీలు, హమాలీల సమస్యలు పరిష్కరించడంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు గోడౌన్లను పూర్తిస్థాయిలో వినియోగించాలని కోరారు. ఇప్పటికే రోజుల తరబడిగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నారని, మండుతున్న ఎండల్లో అస్వస్థతకు గురవుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మళ్లీ వర్షాలు మొదలైతే కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్ద అవుతుందని, అప్పుడు రైతులు మరింత నష్టపోతారని చెబుతూ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులను, మిల్లర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్‌ను హరీశ్ రావు కోరారు. తూకం విషయంలో కూడా రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన సూచించారు.