హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆదివాసీ ఎరుకలను ఆదుకున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ క్యాలెండర్-2025ను గురువారం హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరుకల సామాజిక వర్గానికి ఏకలవ్య ఎరుకల ఆత్మగౌరవ భవనం నిర్మించామని, పందుల పెంపకందారుల కోసం ప్రత్యేకంగా ఎరుకల ఎంపవర్మెంట్ పథకం ప్రవేశపెట్టి రూ.60 కోట్ల నిధులు కేటాయించినట్టు చెప్పారు.
ఎరుకల కులదేవత పిలాయిపల్లి ఎరుకల నాంచారమ్మ జాతరకు ఏటా రూ.5 లక్షలు నిధులు కేటాయించినట్టు గుర్తుచేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున తమ కులస్థులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుతాడి రవికుమార్, వరింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ, కోశాధికారి వనం రమేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేమ్మసరం నాగులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మొగులయ్య, ఎల్బీనగర్ అధ్యక్షుడు ఉండ్రాతి రవి, మహబూబాద్ జిల్లా కన్వీనర్ మాదగాని నరేశ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.