Harish Rao | రేవంత్ రెడ్డి పాలనలో రైతు సంక్షేమానికి రాహు కాలం.. వ్యవసాయానికి గ్రహణం పట్టిందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ పేరుతో బీఆర్ఎస్ ఛార్జిషీట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రేవంత్ పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతు సంక్షేమం నీరుగారిపోతున్నదని అన్నారు.
అధికారంలోకి రాంగనే మొదటి సంతకం రుణమాఫీ మీదనే పెడుతానని రేవంత్ రెడ్డి అన్నారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిండు కానీ.. రైతులకు చేసిన ప్రమాణం మాత్రం నిలుపుకోలేదని తెలిపారు. రుణమాఫీపై సవాలు చేస్తే ఆగస్టు 15వ తేదీ అని కొత్త గడువు పెట్టిండని అన్నారు. కనిపించిన దేవడి మీదల్లా ఒట్లు పెట్టి.. నాలుగు కోట్ల ప్రజలనే కాదు.. మూడు కోట్ల దేవతలను కూడా మోసం చేసిండని మండిపడ్డారు. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 50 శాతం రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పారు. 31 రకాల సాకులు సృష్టించి, సగం మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిన దగాకోరు ప్రభుత్వమని రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు. రుణమాఫీపై నిజాలు బయటపెడుతున్నందుకే తనపై ముఖ్యమంత్రికి ఎక్కడ లేని కోపం వస్తుందని హరీశ్‌రావు అన్నారు. వాస్తవాన్ని ఎదుర్కొనే సత్తా లేక, వాదనలో గెలిచే దమ్ము లేక తిట్లకెత్తుకుంటున్నాడని విమర్శించారు. వి కెన్ అండర్ స్టాండ్ హిస్ ఫ్రస్టేషన్.. బట్ వి కాంట్ ఎక్స్ క్యూజ్ హిజ్ వల్గారిటీ అని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం తెలంగాణ వ్యవసాయాన్ని నిలబెట్టిందని హరీశ్‌రావు తెలిపారు. రెండేళ్లు వరుసగా కరోనా వచ్చినా సరే కేసీఆర్ రైతు బంధు సాయం ఆపలేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 11 విడతల్లో 72,817 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. రైతుల ఖాతాల్లో నేరుగా 72వేల కోట్లు జమచేసిన రాష్ట్రం ఏదైనా ఉందా? ముఖ్యమంత్రి ఎవరన్న ఉన్నరా? ఒకే ఒక్క కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. ఏదన్నా రాష్ట్రం గానీ, ముఖ్యమంత్రిగానీ ఉంటే చూపించాలని రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రాం రాం అంటదని.. కేసీఆర్ ముందే చెప్పిండని హరీశ్‌రావు తెలిపారు. వానాకాలం పంటకు రైతుబంధు ఎగ్గొట్టారని.. యాసంగిపై ఇప్పటికీ స్పష్టత లేదని అన్నారు. పంట పెట్టుబడి 15 వేలకు పెంచింది లేదు, రైతులకు పంచింది లేదని విమర్శించారు.
రాష్ట్రంలో పండిన పంటనంతా కొనే పద్ధతిని బీఆర్ఎస్ ప్రభుత్వమే మొదలు పెట్టిందని హరీశ్‌రావు తెలిపారు. వారం రోజుల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిందని గుర్తుచేశారు. రేవంత్ సర్కారు రాగానే పరిస్థితి తారుమారైందని విమర్శించారు. కల్లాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నరని.. మద్దతు ధరకన్నా తక్కువకు ధాన్యం అమ్ముకునే దుస్థితిని పట్టించింది రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు. వరంగల్ డిక్లరేషన్ లో అన్ని పంటలకూ బోనస్ అన్నారని.. కానీ తర్వాత వడ్లకే అని, చివరకు సన్నాలకే పరిమితం చేసి సన్నాయి నొక్కులు నొక్కారని విమర్శించారు. రైతు భరోసా కౌలు రైతుకు ఇస్తం, భూమి యజమానికిస్తం,. ఒకళ్ల పేరు చెప్పి ఇంకొకళ్లకు ఎగ్గొట్టం అని రేవంత్ పొంకనాలు కొట్టిండు అని అన్నారు. ఇప్పుడేమో ఎవరికి ఇయ్నాల్నో వాళ్లే తేల్చుకోవాలని వ్యవసాయ మంత్రి తుమ్మల చావు కబురు చల్లగ చెప్పిండని మండిపడ్డారు. ఉపాధి హామీ కూలీలకు యాడాదికి రూ.12 వేలు ఇస్తామని, బడ్జెట్లో రూ.1600 కోట్లు కేటాయించామని జబ్బలు చరుచుకున్నారని అన్నారు. ఏడాది గడిచిపోతున్నా ఏకానా ఇచ్చింది లేదు. ఇవ్వాలని చూసిందీ లేదని అన్నారు.