Arekapudi Gandhi | హైదరాబాద్, సెప్టెంబర్ 22 ( నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అంతర్గత సమావేశం సాక్షిగా ఆ పార్టీ నేతలు చెప్తున్నవన్నీ శుద్ధపూస మాటలని,ఆడుతున్నవన్నీ నాటకాలేనని తేలిపోయింది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహా ప్రకాశ్‌గౌడ్, దానం నాగేందర్, కడియం శీహరి కప్పుకొన్న ముసుగు తొలగిపోయింది. న్యాయ స్థానాల నుంచి, శాసనసభ నిబంధనల నుంచి తప్పించుకునేందుకే వీళ్లు నాటకాలాడుతున్నారని స్పష్టమైంది. ఆదివారం సీఎల్పీ (కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ) సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అయితే సీఎల్పీ సమావేశానికి ఎలా హాజరయ్యారన్న ప్రశ్న తలెత్తుతున్నది. కారు గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలకు సీఎల్పీ సమావేశంలో చోటు కల్పించడంపై రాజకీయ ప్రముఖు లే ముక్కున వేలేసుకుంటున్నారు. శేరిలింగంపల్లి నుంచి కారు గుర్తుపై గెలిచిన అరికెపూడి గాంధీ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరటం, ఆయనను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్ సర్కార్ నియమించడం తెలిసిందే. ఇది దుష్ట సంప్రదాయమని, ఆనవాయితీ ప్రకారం పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష సభ్యుడికే ఇవ్వాలని బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నది.
గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తన ఇంటికి వస్తే భోజనం పెట్టి కేసీఆర్ వద్దకు తీసుకెళ్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చెప్పటం, అనంతరం గాంధీ రౌడీ మూకను వెంటేసుకొని కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనపై హత్యాయత్నం చేయటం తెలిసిందే. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన పీఏసీ తొలి సమావేశంలోనూ బీఆర్ఎస్ సభ్యులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. శాసనసభ సంప్రదాయాలకు, నిబంధనలకు విరుద్ధం గా చైర్మన్ ఎంపికతో పాటు, కమిటీ కూర్పు కూడా అభ్యంతరకరంగా ఉన్నదని నిలదీశారు. అప్పుడు కూడా మంత్రి దుద్దిళ్ల శీధర్‌బాబు స్పీకర్ నిర్ణయాన్ని వెనకేసుకొచ్చారు. అరికెపూడి గాంధీ ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారని, ఆయనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధంలేదని శీధర్‌బాబు మరోమారు చెప్పుకొచ్చారు.
గాంధీ సీఎల్పీ సమావేశాలకు హాజరు కావటం బట్టి చూస్తే.. ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నాడని మరోసారి రుజువైందని, అధికార పార్టీ కండువా కప్పుకొన్న వ్యక్తి, ప్రతిపక్ష సభ్యుడినని చెప్పుకొని పీఏసీ చైర్మన్ పదవి తీసుకోవటం గౌరవ శాసన సభను మోసం చేయటమేనని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కలిసి శాసనసభకు తప్పుడు సమాచారం ఇచ్చి, స్పీకర్‌ను తప్పుదోవ పట్టించారని స్పష్టంచేస్తున్నారు. స్పీకర్‌కు, ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారమిచ్చిన వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అరికేపూడి గాంధీ సీఎల్పీ సమావేశానికి హాజరైన వీడియోను మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా పోస్ట్ చేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సీఎల్సీ మీటింగ్ జరిగిన హోటల్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే ఉన్నదని, సీఎంను మర్యాదపూర్వకంగా కలిసేందు కు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వచ్చారని, సీఎల్పీ మీటింగ్‌కు రాలేదని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గానికి సీఎం వచ్చినప్పుడు శాసనభ్యుడు కలిస్తే తప్పా? అని ప్రశ్నించారు. అనంతరం మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలపైనా శ్రీధర్‌బాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘సిద్దిపేటకు ముఖ్యమంత్రి వస్తే హరీశ్‌రావు వెళ్లే ప్రయత్నం చేయరా? అని ప్రశ్నించారు.
‘పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగిన ట్టుగా మంత్రి శ్రీధర్‌బాబు వైఖరి ఉన్నది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. సీఎల్పీ సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల హాజరుపై కాంగ్రెస్ బుకాయించడం తగదని ఆదివారం ఎక్స్ వేదికగా హితవుపలికారు. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పి దేవుడి కండువా అని బుకాయిస్తారు. సీఎల్పీ సమావేశానికి హాజరైతే మర్యాదపూర్వక కలయిక అంటారు. ఎమ్మెల్యేలు కడియం నుంచి అరికెపూడి దాకా కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్‌కు హాజరైతే అది మర్యాద కాదు.. పరమ అమర్యాద అవుతుంది శ్రీధర్‌బాబు గారు.. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయారు మీరు. నా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వస్తే కలుస్తానేమో.. కానీ ఎల్పీ మీటింగ్‌కు వస్తే కలవను కదా? కలవకూడదు కదా? ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ ఎల్పీ సమావేశానికి ఎట్లా హాజరవుతాడు?’ అని నిలదీశారు.