హైదరాబాద్, జూన్ 30(నమస్తే తెలంగాణ): రాష్ట్ర రైతాంగానికి ఎవరేం చేశారో నిరూపించేందుకు అసెంబ్లీ సహా ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ చేశారు. రేవంత్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను ఎలా గాలికి వదిలేసిందో, ఎలా వంచించిందో నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. రైతుభరోసా పేరుతో కేవలం పబ్లిసిటీ స్టంట్లు చేయడం తప్ప, రైతాంగ సమస్యలను పరిషరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలులో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రైతుల పేరుతో సరికొత్త డ్రామాలకు తెరలేపారని మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఒకే వేదికపై నుంచి ప్రభుత్వంలోని ఇద్దరు కీలక నేతలు పరస్పర విరుద్ధమైన గణాంకాలు చెప్పడం వారి అబద్ధాలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. రైతుల కోసం రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేశామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార చెబితే, అదే సభలో సీఎం రేవంత్‌రెడ్డి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పడాన్ని ఆయన ఉదహరించారు. ‘అసలు ఇద్దరిలో ఎవరి లెకలు నిజం? క్షేత్రస్థాయిలో ఏమీ చేయలేదు కాబట్టే.. చెరో అబద్ధం చెప్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు’ అని విమర్శించారు. 2027 మార్చి 31వరకు వ్యవసాయరంగానికి చేసిన మొత్తం బడ్జెట్ కేటాయింపులే సుమారు రూ.82వేల కోట్లు అయితే, జూన్ 2026 నాటికే రూ.1.56 లక్షల కోట్లు, రూ.1.75 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేశారో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో లేని డబ్బును తెచ్చి ఖర్చు చేశారా? లేక రైతులను నమ్మించడానికి కల్పిత లెకలు సృష్టిస్తున్నారా? అని ప్రశ్నించారు. అబద్ధాన్ని పదిసార్లు చెబితే నిజం కాదని, లేనివి ఉన్నట్టు చెప్తే నమ్మడానికి రైతులు అమాయకులు కారని హితవు పలికారు.
రుణమాఫీపై కాంగ్రెస్ మోసం
ఎన్నికల సమయంలో ప్రతి రైతుకూ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. కేవలం స్వల్పకాలిక రుణాలకే మాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం రైతాంగాన్ని నిలువునా ముంచడమేనని మండిపడ్డారు. స్వల్పకాలిక రుణాలకే రుణమాఫీని పరిమితం చేస్తామని ఎన్నికల ముందే చెప్పి ఉంటే.. రైతులు కాంగ్రెస్‌ను నమ్మేవారా? అని ప్రశ్నించారు. మ్యానిఫెస్టోలో ఒక మాట చెప్పి, గద్దెనెకిన తర్వాత మరోమాట చెప్పడం కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ఫేక్ ప్రచారాలు, తప్పుడు ప్రకటనలు ఆపి రైతులకు ఇచ్చిన ప్రతి హామీనీ తక్షణమే అమలుచేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. లేకపోతే అన్నదాతలే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.