హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి.. అవినీతి, అక్రమాలు, అడ్డగోలు వసూళ్లతో భూమేత అయ్యిందా? భూహారతిగా మారిందా? అధికార పార్టీ నేతలకు, రియల్ఎస్టేట్ బ్రోకర్లకు మంగళహారతి అయ్యిందా?’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రశ్నలు సంధించారు. ‘మీ ప్రభుత్వం తీరు.. మీరు తెచ్చిన చెత్త రెవెన్యూ సంస్కరణలు.. పేరు గొప్ప.. ఊరు దిబ్బ చంద’మంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. మొన్న భూమి రిజిస్ట్రేషన్ చేయడంలేదని మంచిర్యాల జిల్లా నెన్నెల మండల తహసీల్ ఆఫీసు ఎదుట పురుగుమందు డబ్బాలతో అన్నదమ్ములు ఆందోళన కు దిగారని, నిన్న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద ఓ రైతు పురుగుల మందు తాగారని పేర్కొన్నారు.
‘భూ సమస్యలతో ఒక్క రైతూ ఆత్మహత్య చేసుకోవద్దు.. 100% రైతుల భూ హక్కులు కాపాడతామంటూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి.. అన్నదాతల ఆత్మహత్యాయత్నాలకు ఏం సమాధానం చెబుతారు? తహసీల్, మీ ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసుల వద్ద చోటుచేసుకున్న ఘటనలు కనిపించడంలేదా? మూడు నెలల్లో భూ సమస్యలు పరిష్కరిస్తానని మీరి ఇచ్చిన హామీ ఏమైంది? నెలలు గడస్తున్నా సాదాబైనామా అర్జీలు ఎందుకు క్లియర్ చేయడంలేదు? కొత్త దరఖాస్తులకు వెసులుబాటు కల్పించడంలేదెందు కు?’ అని ప్రశ్నించారు.
ధరణిపై అడ్డగోలుగా మాట్లాడిన మీరు గొప్పగా తెచ్చిన భూ భారతి భూ సమస్యల పరిష్కారంలో ఎందుకు విఫలమైందని నిలదీశారు. నాడు గొప్పలకుపోయి ఇప్పుడు కుంటిసాకులు చెప్తూ రిజిస్ట్రేషన్లు చేయకుండా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డా రు. సొంత భూములపై రైతులకే హక్కులేకుం డా చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ఆపదకో, అవసరానికో, బిడ్డల పెండ్లిళ్లకో భూములు అమ్ముకోలేక.. అధిక వడ్డీకి అప్పులు చేసి అన్నదాతలు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు నెలల తరబడి కలెక్టర్, ఆర్టీవో, తహసీల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కాంగ్రెస్ సర్కార్ కనికరించడంలేదని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు, దళారులకు 30 నుంచి 40% లంచమిస్తే తప్ప పనులు కావడంలేదని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా తహసీల్, ఆర్డీవో, కలెక్టర్ ఆఫీసుల్లో లక్షలాది పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో 700 మందికిపైగా రైతన్నలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. రుణమాఫీ కాక, రైతుబంధు, రైతుబీమా అందక రైతులు ఆత్మైస్థెర్యం కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు తెరిచి రైతుల భూ సమస్యలు పరిష్కరించి ఆత్మహత్యలు నివారించాలని హితవు పలికారు.
సిద్దిపేట, నవంబర్ 21 : సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలోని బీసీ హాస్టల్ విద్యార్థులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు బెడ్లు పంపిణీ చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. రూ.6 లక్షల సొంత నిధులతో సమకూర్చిన బెడ్లను సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపాల్‌కు అందజేశారు. ఇటీవల హరీశ్‌రావు తడకపల్లి బీసీ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచాలు లేవని విద్యార్థులు ఆయన దృష్టికి తెచ్చారు. బెడ్స్ అందిస్తానని ఇచ్చిన మాట ప్రకారం వాటిని అందజేశారు. ఈ సందర్భంగా వార్డెన్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.