Harish Rao | సిగాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేక తన అసమర్థతను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చాటుకున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. నాడు కోటి రూపాయల సాయం అంటూ సిగాచి బాధితులను నమ్మబలికి అందులో సగం కూడా వారికి చేర్చని రేవంత్ రెడ్డి నయవంచనలో తనను మించినవారు లేరని నిరూపించుకున్నారని అన్నారు. ఆ పూటకు మాటలు చెప్పడం.. ఆ తర్వాత తాను చెప్పిన మాటలకే విలువ ఇవ్వకపోవడం రేవంత్ రెడ్డికే చెల్లిందని విమర్శించారు.
సిగాచి పరిశ్రమ అగ్నిప్రమాదంలో 54 మంది అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతే, ఆ బాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యాయని హరీశ్‌రావు అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహ.. మృతదేహాల సాక్షిగా ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారని తెలిపారు. కానీ ఇదంతా కంటితుడుపు చర్యే అని, బాధితులకు జరిగిన న్యాయం శూన్యమని ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంతో తేటతెల్లమైందని పేర్కొన్నారు. మాట ఇచ్చి తప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందనడానికి ఈ ఘటనే నిదర్శమని వ్యాఖ్యానించారు.
యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కై పరిహారం లెక్కల్లో చేస్తున్న మోసం అంతా ఇంతా కాదని హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించిన అధికారిక లెక్కల ప్రకారం, 54 మంది బాధితులకు కలిపి ఇప్పటివరకు చెల్లించిన రూ. 24.51 కోట్లను విభజించి చూస్తే, ఒక్కో కార్మికుడి కుటుంబానికి సగటున అందిన పరిహారం కేవలం రూ. 45.40 లక్షలు మాత్రమే అని తెలిపారు. అంటే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన కోటి రూపాయల పరిహారంలో ఇంకా ఒక్కో కుటుంబానికి దాదాపు రూ. 54.60 లక్షల చొప్పున, మొత్తంగా రూ. 29.48 కోట్ల బకాయిని ఈ ప్రభుత్వం ఎగ్గొట్టి బాధితులను నట్టేట ముంచిందని మండిపడ్డారు. కోట్లు ఇస్తామని గొప్పలు చెప్పి, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు మాత్రమే చెల్లించడం అత్యంత శోచనీయమని అన్నారు.
మరి ముఖ్యమంత్రి, మంత్రులు హామీ ఇచ్చిన కోటి రూపాయల పరిహారం ఎవరు ఇస్తారు అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆ డబ్బు ఎగ్గొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం జారుకోవాలని చూస్తోందని అన్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పేద బాధిత కుటుంబాలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఇక్కడ మరో మోసం దాగుందని విమర్శించారు. యాజమాన్యం తాము 40 నుంచి 42 లక్షలు ఇస్తున్నామని కోర్టుల ముందు ఒప్పుకుందని చెప్పారు. అసలు నిజమేంటంటే, వారు సొంతంగా ఇచ్చిన 25 లక్షలకు.. కార్మికులు చనిపోవడం వల్ల చట్టబద్ధంగా వారికి రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులను కూడా కలుపుకుని ఈ లెక్కలు చూపిస్తున్నారని అన్నారు
అవేదో కంపెనీ జేబులోంచి ఇస్తున్న పరిహారం కాదు, కార్మికులు కష్టార్జితం నుంచి హక్కుగా వచ్చిన డబ్బు అని హరీశ్‌రావు తెలిపారు. ఆ డబ్బులను కూడా తీసుకువచ్చి కంపెనీ ఇచ్చే పరిహారంలో కలిపి చూపించడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, యాజమాన్య అమానవీయతకు, దిగజారుడుతనానికి పరాకాష్ట అని మండిపడ్డారు. అంతేకాదు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన కార్మికుల వైద్య ఖర్చులను కూడా ఈ అరకొర పరిహారంలోనే కోత విధించడం దారుణమని అన్నారు. ఇక ప్రమాదంలో కాలి బూడిదై ఆచూకీ దొరకని 8 మంది కార్మికుల కుటుంబాలను డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్న దుర్మార్గ ప్రభుత్వం ఇది అని విమర్శించారు.
ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగిన సామూహిక హత్య అని హరీశ్‌రావు అన్నారు. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు గాలికొదిలేశారని విచారణలో ఆధారాలతో సహా స్పష్టంగా తేలిందని చెప్పారు. 818 హెచ్‌పీ సామర్థ్యానికి మాత్రమే అనుమతి తీసుకుని, అక్రమంగా 1777 హెచ్‌పీకి యంత్రాలను పెంచేశారు. సేఫ్టీ గార్డ్స్ లేవు, ఫైర్ ఎన్ఓసీ లేదు, డస్ట్ కంట్రోల్ సిస్టమ్ పనిచేయలేదని తెలిపారు. ఇంత నిర్లక్ష్యం బయటపడినా, ప్రభుత్వం యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
బాధితుల పక్షాన హైకోర్టులో కేసు వేసి, న్యాయస్థానం మొట్టికాయలు వేస్తే తప్ప పోలీసులు కదలలేదని హరీశ్‌రావు తెలిపారు. తూతూ మంత్రంగా ఎండీని అరెస్టు చేయడం, వెంటనే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేలా పరోక్షంగా సహకరించడం చూస్తుంటే.. ప్రభుత్వానికి, కంపెనీ యాజమాన్యానికి మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాలు ఏమిటో అర్థం అవుతూనే ఉందన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వందల కోట్ల టర్నోవర్ ఉన్న సిగాచి కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అటాచ్ చేయాలని అన్నారు. వాటిని అమ్మి అయినా బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఏ కొర్రీలు లేకుండా కోటి రూపాయల పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. బతికున్న ప్రజలను మోసం చేయడం, మాట తప్పడం మీకు ఎలాగూ అలవాటే. కానీ కనీసం ఆ ప్రాణాలు కోల్పోయిన పేద కార్మికులను, దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి కుటుంబాలను మోసం చేయకండని హరీశ్‌రావు హితవు పలికారు. కార్మికుల ఈఎస్ఐ, పీఎఫ్ డబ్బులను పరిహారంగా చూపే నీచమైన కుట్రలను తక్షణమే ఆపాలన్నారు. మీరు ఆనాడు మృతదేహాల సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం, పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులతో సంబంధం లేకుండా ప్రతి బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.