Harish Rao | బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు దాతృత్వం చాటుకున్నారు. ప్రమాదంలో కాలు విరిగి మంచానికే పరిమితమైన యువకుడికి అండగా నిలిచారు. రూ.5లక్షలతో కృత్రిమ కాలు అందించి ఆర్థిక భరోసా కల్పించారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన వర్కోలు మల్లేశం-సాలవ్వ దంపతుల కుమారుడు రంజిత్(20) కొన్ని రోజుల క్రితం జరిగిన ప్రమాదానికి గురయ్యాడు. ఆ యాక్సిడెంట్లో రంజిత్ కాలు విరిగింది. మళ్లీ నడవాలంటే కృత్రిమ కాలు పెట్టుకోవడం ఒక్కటే మార్గమని వైద్యులు సూచించారు. దానికోసం రూ.8 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో రంజిత్, అతని కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇక ఎప్పటికీ నడవలేనని రంజిత్ బాధపడ్డాడు. పై చదువులు చదువుకుని, జీవితంలో స్థిరపడాలని ఆశపడితే కాలు అడ్డంకిగా మారిపోయిందని రంజిత్ తీవ్ర మనోవేదన చెందాడు. చేతికి అందే సమయంలో కొడుకు మంచానికే పరిమితం కావడంతో రంజిత్ తల్లిదండ్రులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇది తెలుసుకున్న స్థానిక సర్పంచ్ సామల సునీత.. ఈ విషయాన్ని హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన హరీశ్‌రావు.. నేను ఉన్నా ఆందోళన చెందకండి అని ధైర్యం చెప్పారు. ఎన్ని డబ్బులు అయినా సరే కృత్రిమ కాలు ఇప్పించే బాధ్యత నాదే అని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 15 రోజుల్లోనే కృత్రిమ కాలు తెప్పించి.. రంజిత్‌కు అందించారు.
ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ.. హరీశన్న కొత్త జీవితాన్ని ఇచ్చాడని హర్షం వ్యక్తం చేశాడు. హరీశన్నకు జీవితాంంతం రుణపడి ఉంటానని తెలిపాడు. తమ కుటుంబానికి అండగా నిలిచిన హరీశ్‌రావుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని రంజిత్ కుటుంబసభ్యులు పేర్కొన్నారు.