Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది బాగోతం పొద్దున బయటపెడితే సాయంత్రం నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేటలో ఉంటే రాత్రి మా ఇంటి వద్ద సిబ్బందికి నోటీసులు ఇచ్చి వెళ్లారని తెలిపారు. చట్టాన్ని గౌరవించి నేను రాత్రి సిద్దిపేట నుంచి వచ్చి, ఇవాళ సిట్ విచారణకు వెళ్తున్నానని పేర్కొన్నారు. సిట్ విచారణకు బయల్దేరి వెళ్లేముందు హైదరాబాద్‌లోని కోకాపేట నివాసం వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బయపడనని స్పష్టం చేశారు.
నిన్న బొగ్గు స్కాం బయట పెడితే ఒక్క మంత్రి, ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదని హరీశ్‌రావు తెలిపారు. దండుపాళ్యం ముఠా వాటాలు పంచుకోవడంలో ఎలా తన్నుకుంటున్నారో బయట పెట్టానని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల ముందు అవినీతి బండారం బయట పడితే నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడ్డారని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని.. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నామని తెలిపారు. తాము తెలంగాణ ఉద్యమకారులమని.. కేసీఆర్ తయారుచేసిన సైనికులమని తెలిపారు. రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు.
ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి? మహిళలకు మహాలక్ష్మీ ఏమైంది? అవ్వతాతలకు రూ.4వేల పింఛన్ ఎప్పుడు ఇస్తావని అడిగామని హరీశ్‌రావు తెలిపారు. హిల్ట్ పాలసీ, పవర్ స్కాం, భూ కుంభకోణాలు బయటపెట్టినామని పేర్కొన్నారు. నీ వాటాల విషయం ప్రజలకు అర్థమైందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నీళ్లను ఏపీకి అప్పనంగా కట్టబెడుతూ తెలంగాణకు ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకోక నీ బండారం బయట పెట్టినామని తెలిపారు. అసెంబ్లీ లోపల, బయట నిలదీసినామని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారని.. మున్సిపల్ ఎన్నికల ముందు నాకు నోటీసులు ఇచ్చావని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తామంటున్నారని.. పట్టణాల్లో వడ్డీలేని రుణాలు ఇస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. మాకు నోటీసులు ఇచ్చి, ప్రజల్ని ఎంగేజ్ చేస్తున్నాడని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఒత్తిడిని సీఎం రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అంచనాలు తప్పాయని అన్నారు. 40 శాతం స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని అన్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో అయినా లాభం పొందాలని కేసులు, విచారణ అంటున్నాడని మండిపడ్డారు. రెండేళ్ల నుంచి రేవంత్ రెడ్డి ఇదే డ్రామా ఆడుతున్నాడని తెలిపారు. గతంలో నాపై ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే, సుప్రీంకోర్టు చెంప చెల్లుమనిపించేలా తీర్పునిచ్చిందని అన్నారు. న్యాయం మావైపు ఉంది కాబట్టి హైకోర్టులో కూడా గెలిచామని తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిందని.. ఇదే సీరియల్ ఇంకా ఎన్ని రోజులు నడుపుతావని మండిపడ్డారు. నువ్వు ఎన్ని డైవర్షన్లు చేసినా మీ స్కాంలు బయటపెడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆంధ్రాకు అమ్ముడుపోయిన దానిపై నిలదీస్తూనే ఉంటామన్నారు.
బొగ్గు స్కాంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తున్నానని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యింది నిజం కాకపోతే సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తన బామ్మర్దితో కలిసి రేవంత్ రెడ్డి చేస్తున్న స్కాంపై విచారణ జరిపించాలన్నారు. నైనీ బ్లాక్ ఒక్కటే కాదు.. అన్ని టెండర్లను రద్దు చేయాలన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. బీజేపీ వెంటనే స్పందించి దొంగలను అరెస్టు చేయాలని, అవినీతి సొమ్మును కక్కించాలని డిమాండ్ చేశారు. సింగరేణి డబ్బులతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆడుతున్నాడని.. షోకుల కోసం సింగరేణి డబ్బులు ఖర్చు చేస్తుంటే కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.
న్యాయ వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉందని హరీశ్‌రావు తెలిపారు. నేను తప్పు చేయలేదు.. కేవలం బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ కేసు పెట్టారని పేర్కొన్నారు. ఇది రాజకీయ డ్రామా అని అన్నారు. మేం భయపడం.. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి నన్ను ఎంత ఇన్వాల్వ్ చేసినా సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. నీ అవినీతి కుంభకోణాలు బయటపెడతామని.. తెలంగాణ ప్రజల పక్షాణ ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు.