కృష్ణాకు వచ్చిన నీళ్లు 1010 టీఎంసీలు
ఇప్పటికే ఏపీ వాడుకున్నది- 657 టీఎంసీలు
తెలంగాణ వాడుకున్నది- 220 టీఎంసీలు
ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి సుమారు 100 టీఎంసీలు
ఏపీ, తెలంగాణకు ఇంకా కావాల్సిన కృష్ణా జలాలు 132 టీఎంసీలు
నీళ్లందించాల్సిన పంట 8.78 లక్షల ఎకరాలు
సర్కారు నిర్లక్ష్యంతో తెలంగాణకు తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నది. కాంగ్రెస్‌ను గెలిపించింది పంటలు ఎండగొట్టడానికా? తాగు, సాగు నీటి కోసం ప్రజలు గోస పడడానికా? తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు పట్టని కేంద్ర మంత్రి కిషన్రెడ్డీ మీకు పదవులెందుకు?
Harish Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆత్మలేని రేవంత్‌రెడ్డి కట్టప్పలా మారి మరో కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తన సీటు కాపాడుకోవడం కోసం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఒక న్యూస్‌చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఏపీ ఇష్టారాజ్యంగా నీళ్లను దోచుకెళ్తుంటే రేవంత్ సర్కారు ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నదని విమర్శించారు. చంద్రబాబు నీటి దోపిడీని అడ్డుకునే ధైర్యం రేవంత్‌రెడ్డికి లేదా? అని ప్రశ్నించారు. ఏపీ అడ్డగొలుగా నీళ్లు తరలించుకుపోతుంటే రేవంత్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కేంద్ర బలగాల ఆధీనంలో ప్రాజెక్టు ఉన్నా.. నీటిచౌర్యం ఆగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి ఉత్తమ్‌కు సాగునీటిరంగంపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీకి రాష్ట్ర ప్రజల పట్ల కృతజ్ఞత లేదని మండిపడ్డారు.
ఏపీ రాష్ట్రం యథేచ్ఛగా కృష్ణజలాలను ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్నా, తెలంగాణ రాష్ట్ర సాగు, తాగు నీటి ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నా కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నీటి నిర్వహణలో, వినియోగంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రాన్ని, బోర్డును ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కండ్లుమూసుకోవడంతో తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, వేసవిలో తాగునీటి సమస్య ఎదురయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నా బీజేపీ నేతలు కూడా స్పందించడం లేదని, రైతాంగం క్షేమం పట్టవారికి పదవులెందుకని నిలదీశారు. తెలంగాణ సోయి లేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంతటి నష్టం జరుగుతుందో కండ్ల ముందు కనబడుతున్నదని వాపోయారు.
ఈ ఏడాదికి కృష్ణాలో 1,010 టీఎంసీల నీళ్లు వచ్చాయని, తాతాలిక ఒప్పంద ప్రకారమే అనుకున్నా ఏపీకి 666 టీఎంసీలు దక్కుతాయని, కానీ ఇప్పటికే 657 టీఎంసీలను వాడిందని, ఇంకా మిగిలింది కేవలం తొమ్మిది టీఎంసీలేనని హరీశ్‌రావు వివరించారు. అయినప్పటికీ, ఇవాళ కూడా సాగర్ కుడి కాల్వ నుంచి 10వేల క్యుసెకులు, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి నుంచి జలాలను యథేచ్ఛగా తరలిస్తున్నదని వివరించారు. తాత్కాలిక ఒప్పందం ప్రకారమే తెలంగాణకు 343 టీఎంసీల నీళ్లు రావాలని, ఇప్పటివరకు వాడుకున్నది 220 టీఎంసీలు మాత్రమేనని, ఇంకా రాష్ట్ర కోటాలో 123 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉన్నదని తెలిపారు.
ఏపీ, తెలంగాణ కోటాలు కలిపి మొత్తం 132 టీఎంసీలు అవసరమని వెల్లడించారు. సాగర్ ఎండీడీఎల్ 510 అడుగుల వద్ద 50 టీఎంసీలు, శ్రీశైలం ఎండీడీఎల్ 834 అడుగుల వద్ద మరో 50, మొత్తంగా రెండింటిలో కలిపి ప్రస్తుతం 100 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆ 100 టీఎంసీల జలాలను కూడా ఏపీ యథేచ్ఛగా తరలిస్తున్నదని, అయినప్పటికీ పట్టించుకోకుండా కాంగ్రెస్ గుడ్లు అప్పగించి చూస్తున్నదని, ఏపీ నుంచి తెచ్చుకున్న అడ్వైజర్ ఏం చేస్తున్నాడని, నీటి పారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఇప్పటికైనా కండ్లు తెరవాలని, ఏపీని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే సాగర్ ఎడమ కాల్వ కింద నల్లగొండలో 1.45 లక్షల ఎకరాలు, సూర్యాపేటలో 2.35 లక్షల ఎకరాలు, ఖమ్మంలో 2 లక్షలపైగా ఎకరాలు, మొత్తంగా 6.38 లక్షల ఎకరాలు, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద సాగుచేస్తున్న 2.4 లక్షల ఎకరాలకు సాగునీరందని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంకా నాలుగు తడుల నీళ్లు ఇస్తే గాని పంటలు పండబోవని, దాదాపు 30, 35 టీఎంసీల నీళ్లు కావాల్సి ఉంటుందని వివరించారు. వచ్చే సీజన్ వరకూ ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంటుందని తెలిపారు. రైతుల పంటలు పండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరవాలని, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏపీ జలదోపిడీని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
‘నీళ్లను సాధించండి.. అది చేతగాకుంటే అఖిలపక్షాన్ని తీసుకుపోండి’ అని సూచించారు. లేఖలు రాస్తే పనులు కావని, కేఆర్ఎంబీ ఆఫీసు, ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేద్దాం పదండి, తామూ వస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపించింది పంటలు ఎండగొట్టడానికా, తాగు నీటి కోసం ప్రజలు గోస పడడానికా? అనినిలదీశారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని, ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి పరోక్షంగా సహరిస్తున్నారని, గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని, రేవంత్ ఇకడ అధికారంలో ఉండటంతో నీటి తరలింపు సులువైందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నుంచి చెరో 8 మంది చొప్పున ఎంపీలు గెలిచి తెలంగాణకు ఏం ప్రయోజనమని, పార్లమెంట్లో ప్రశ్నించేవారే లేకుండా పోయారని హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్‌కు తెలంగాణ సోయి లేకుండా పోయిందని, బీజేపికి పట్టింపులేదని, రెండు పార్టీలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. కేంద్రంలో తనకున్న తిరుగులేని బలం వల్లనే చంద్రబాబు ఇష్టారీతిన జలదోపిడీ చేస్తున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి దానిని ప్రశ్నించకుండా, అడ్డుకోకుండా పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసేంత సత్తా కూడా లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. బోర్డు కేంద్రం కంట్రోల్లో ఉన్నదా, ఏపీ కంట్రోల్లో ఉన్నదా? అనే అనుమానం వస్తున్నదని, కేంద్రం రెండు రాష్ట్రాలను ఎందుకు సమానంగా చూడటం లేదని మండిపడ్డారు. త్రిసభ్య కమిటీ మీటింగ్ పెట్టకుంటే రాష్ట్ర ప్రభుత్వమైనా ఎందుకు డిమాండ్ చేయడం లేదని నిలదీశారు. బోర్డుపై ఒత్తిడి చేయరు, మీటింగ్ పెట్టమని డిమాండ్ చేయరు. నీళ్లు తరలిస్తుంటే శిలా విగ్రహాల్లాగా ఉంటున్నారని, ప్రేక్షకపాత్ర వహించడానికా ఎన్నుకుందని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చణాకా కొరటా, చిన్నకాళేశ్వరం, గూడెం ప్రాజెక్టులకు ఇలా అనుమతులు తెచ్చామని హరీశ్‌రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు కాదు కదా, చివరి దశలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులను సాధించడంలోనూ విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ చివరిదశ వరకు తీసుకువచ్చిన అనేక డీపీఆర్‌లు కూడా కాంగ్రెస్ చేతగానితనం వల్ల వాపస్ వస్తున్నాయని ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డి, వార్దా, కాళేశ్వరం మూడో టీఎంసీ, సీతారామ ప్రాజెక్ట్ డీపీఆర్‌లను ఉదహరించారు. సమ్మక సాగర్ డీపీఆర్ పరిస్థితి అట్లనే ఉన్నదని, ప్రాజెక్టులకు అనుమతులు తేరు, ఉన్న నీటి కేటాయింపులను సక్రమంగా వినియోగించడంలేదని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా మేడిగడ్డను పడావు పెడుతున్నారని, గట్టిగ చేస్తే ఆరు నెలల్లో చేసే పని, కాళేశ్వరం కూలిపోయిందని దొంగ ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ఏడు బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పియర్ కుంగిందని, దానిని రిపేర్ చేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు. రైతులు నీటి కోసం ధర్నాలు చేసున్నా పట్టించుకోకుండా వారి నోట్లో మట్టి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకనైనా నీళ్లను సాధించండి.. లేదంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలి, అందుకు బీఆర్ఎస్ కలిసి వస్తుందని చెప్పారు. అవసరమైతే అఖిలపక్షాన్నిఢిల్లీకి తీసుకువెళ్లాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, నోముల భగత్, గొంగడి సునీత పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై ఏర్పాటుచేసిన సీఆర్పీఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, 2023 నవంబర్ 30 నాడు ఏ స్టేటస్‌లో ఉన్నదో, అదే స్టేటస్‌లో ఉండాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కాంగ్రెస్ చేతులు దులుపుకున్నదని, ఏడాది గడచినా ఇప్పటివరకు ఆధీనంలోకి తీసుకోలేదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ప్రాజెక్టు తెలంగాణ ఆధీనంలో ఉంటే ఏపీ సర్కారు ఇష్టారాజ్యంగా నీటిని తరలించుకుపోయే పరిస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించి, ప్రాజెక్టును అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబును అడిగే దమ్ము, ధైర్యం సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ నేతలకు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
ఏపీ జలదోపిడీ బీజేపీకి కనిపించడం లేదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మన నీళ్లు తరలిపోతుంటే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం ఉంటే.. కేంద్రం గల్లా పట్టి రాష్ట్రం హక్కులపై పోరాడేదని స్పష్టంచేశారు. కృష్ణా బోర్డు కేంద్రం పరిధిలోనే ఉన్నదని, మీరు ఆర్డర్ వేస్తే ఏపీకి తరలిపోతున్న నీళ్లు ఆగవా? అని ప్రశ్నించారు. ఇకనైనా స్పందించకపోతే సికింద్రాబాద్ ప్రజలు కూడా తాగు నీటి సమస్య ఎదుర్కుంటారని హెచ్చరించారు. సాగర్‌పై సీఆర్పీఎఫ్ బలగాలను తక్షణం తొలగించాలని, లేదంటే శ్రీశైలంలో కూడా ఏర్పాటుచేయాలని కిషన్‌రెడ్డిని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఉపయోగపడని పదవులు ఎందుకని ప్రశ్నించారు. సందర్భాన్ని బట్టి స్పందించాలని, కిషన్‌రెడ్డి చొరవ చూపి తెలంగాణ ప్రయోజనాలు కాపాడేలా చూడాలని డిమాండ్ చేశారు.
నాగార్జునసాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం గత మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి రోజుకు పది వేల క్యూసెకుల చొప్పున నీళ్లను తరలించుకుపోతున్నా తెలంగాణ ప్రభుత్వం చేవచచ్చి, చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తున్నదని, నీళ్ల మంత్రి నీళ్లు నములుతున్నాడని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కృష్ణా జలాల్లో ఏపీ తాతాలిక వాటా 512 టీఎంసీలు కాగా, ఇప్పటికే 657 టీఎంసీలు తరలించిందని, అయినప్పటికీ ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి బెల్లంకొట్టిన రాళ్లలాగా చలనం లేకుండా పడి ఉన్నారని, నోరు పెగలడం లేదని తూర్పారపట్టారు. గడిచిన 25 రోజుల్లోనే 60 టీఎంసీలను అంటే రోజుకు రెండు టీఎంసీలను ఏపీ తరలించిందని, ఇక కాంగ్రెస్‌ను ఎన్నుకున్నది ఎందుకని నిలదీశారు.