మల్లన్నసాగర్ అద్భుత నిర్మాణం
రాష్ట్రంలోనే అతిపెద్ద రిజర్వాయర్
23న జాతికి అంకితం చేయనున్న సీఎం కేసీఆర్
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట, ఫిబ్రవరి 17 : వెక్కిరించిన నోళ్లే అసూయ పడేలా మల్లన్నసాగర్‌ను అద్భుతంగా నిర్మించామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించిన నాడు ఇది అవుతదా..? మేము బతికుండగా చూస్తామా..? ఇది కల లో కూడా కానీ పని.. ఇది ఎక్కడ అవుతది? అని కొంతమంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, గిట్టని వాళ్లు మాట్లాడారని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మల్లన్నసాగర్‌ను ప్రజలకు, జాతికి ఈనెల 23న అంకితం చేయబోతున్నామన్నా రు. ఆనాడు గిట్టని వాళ్లు ఏదేదో మాట్లాడారని, ఈ రోజు ఈ ప్రాంత ప్రజల కలను సీఎం కేసీఆర్ నిజం చేశారన్నారు. కలలో కూడా కాని పనిని సీఎం కేసీఆర్ రూపకల్పన చేసి, పూర్తిచేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి గొప్ప సందర్భమన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, ఈఎన్సీ హరిరాం, పోలీస్ కమిషనర్ శ్వేతలతో కలిసి గురువారం మంత్రి సందర్శించారు. సీఎం కేసీఆర్ మల్లన్నసాగర్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పారు. అక్కడే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్‌ను జాతికి అం కితం చేసే గొప్ప కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెప్పా రు. ఈ రిజర్వాయర్ 75 శాతం తెలంగాణ రాష్ర్టానికి నీరు ఇస్తుందన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలతోపాటు చుట్టుపక్కల జిల్లాలకు తాగునీటి అవసరాలను తీరుస్తుందని తెలిపారు. 550 మీటర్ల ఎత్తులో ఉండే మల్లన్నసాగర్‌కు నీరు తెచ్చుకునేటువంటి ఒక అపురూపమైన ఘట్టమన్నారు. ప్రస్తుతం రోజుకు ఒక టీఎంసీ నీటిని మల్లన్నసాగర్‌కు తెచ్చుకొంటామన్నారు. రెండో టీఎంసీ నీటిని తెచ్చుకొనే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని హరీశ్‌రావు తెలిపారు.