కొండపాక కుకునూరుపల్లి, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): నిజంగా ఈ రోజు నా జన్మ ధన్యమైంది. గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు ఆపరేషన్ చేసి పునర్జన్మను ప్రసాదిస్తున్న సత్యసాయి సంజీవని సేవలో నేను కూడా భాగమైనందుకు నా మనస్సు తృప్తితో నిండిపోయింది అని మాజీమంత్రి హరీశ్‌రావు ఆనందం వ్యక్తంచేశారు. శనివారం సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్‌కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రభు త్వ మాజీసలహాదారు కేవీ రమణాచారి, బీఆర్ఎస్ నేతలు యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, సత్యసాయి ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్‌రావుతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఓపెన్ హార్ట్ సర్జరీ పూర్తి చేసుకున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులను హరీశ్‌రావు ఆత్మీయంగా పలకరించారు.
అనంతరం మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే మాటను మాటల్లోనే విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నా. భగవాన్ మధుసూదనాసాయి, ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు, కేవీ రమణాచారి విజ్ఞప్తి మేరకు కళాశాల వార్షికోత్సవానికి వచ్చాను. సత్యసాయి ట్రస్ట్ ద్వారా వైద్యసేవలను అందించాలని భగవాన్ సత్యసాయిని కోరాను. గుండె జబ్బులతో బాధపడే చిన్నా రులకు వైద్యం అందించే దవాఖాన ఏర్పా టు చేయాలన్న విజ్ఞప్తి మేరకు దేశంలో ఐదో చైల్డ్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ఇక్కడ నిర్మించారు. అప్పుడు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రిగా ఉన్న నేను నా శక్తి మేరకు భాగస్వామి అయ్యాను. ఇంత అదృష్టాన్ని కలుగజేసిన భగవాన్ మధుసూదన సాయికి రుణపడి ఉంటానుఅని తెలిపారు. దవాఖాన ఏర్పాటుకు కృషి చేసిన కేవీ రమణాచారిని హరీశ్‌రావు అభినందించారు.