Harish Rao | సమాజ భవిష్యత్ ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా అంతే ముఖ్యమని తెలిపారు. నేపాల్, బంగ్లాదేశ్‌లో వచ్చిన విప్లవాలు మన దేశంలో రావద్దంటే సామాజిక నైతిక బాధ్యతలు నేర్పించాలని సూచించారు. సిద్దిపేట వైశ్య భవనంలో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
యువత డ్రగ్స్, గంజాయికి బానిసలుగా మారుతున్నారని హరీశ్‌రావు అన్నారు. విద్య అనేది ఉద్యోగం కోసమే కాకుండా గొప్ప సమాజ నిర్మాణం కోసం అవసరమని అభిప్రాయపడ్డారు. విద్యార్థులను ర్యాంక్ ల కోసమే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థులు శారీరకంగా ఎదిగేందుకు క్రీడల ద్వారా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. క్రీడలు గెలుపు, ఓటమిలను తట్టుకునేందుకు కృషి చేస్తుందని తెలిపారు. డ్రగ్స్, ఆన్ లైన్ గేమ్స్ పై విద్యార్థులు దృష్టి పెట్టకుండా చూడాలన్నారు.
విద్యారంగంలో సిద్దిపేట జిల్లా మొదట స్థానంలో ఉందని హరీశ్‌రావు తెలిపారు. చిన్ననాటి జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. రేపటి భవిష్యత్ తరగతి గదులలోనే నిర్మితమవుతుందని.. అది ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమని అన్నారు. సిద్దిపేటను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చామని తెలిపారు. సిద్దిపేటకు తెచ్చిన బీడీఎస్ కాలేజీని రేవంత్ రెడ్డి కొడంగల్‌కు తరలించాడని మండిపడ్డారు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది దానిని మేము మళ్ళీ తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గురుపూజోత్సవం రోజున ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులను సన్మానం చేయాలన్నారు.