Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ప్రజాందోళనలకు కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గింది. కేశంపేట పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలను గురువారం రాత్రి బేషరతుగా విడుదల చేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11:30 గంటలకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేసిన ఉద్యమానికి, ముఖ్యంగా కేశంపేట పోలీస్‌స్టేషన్ వద్దకు తరలివచ్చిన వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తల పోరాటానికి ప్రభుత్వం, పోలీసులు దిగివచ్చారు.
కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసినవారిపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని డీజీపీ హామీ ఇవ్వడంతో కార్యకర్తలు వెనుదిరిగారు. అంతకుముందు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై ఫిరాయింపు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మూకదాడి జరిపిన సంఘటన నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహోదగ్రులయ్యారు. పోలీసు అధికారులు కాంగ్రెస్ బాసుల కనుసన్నల్లో పనిచేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి ఘటనపై ఫిర్యాదు చేయటానికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు వెళ్లిన మాజీమంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అనేకమంది బీఆర్ఎస్ నాయకులను రెండు బృందాలుగా విడగొట్టి అనేక గంటలపాటు పోలీస్ వాహనాల్లో తిప్పి.. రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట, తలకొండపల్లి స్టేషన్లకు తరలించారు. ఈ విషయం తెలిసిన వేల మంది స్థానిక ప్రజలు, గ్రామస్థులు, బీఆర్ఎస్ అభిమానులు పోలీస్ స్టేషన్ల ముందు ఆందోళనకు దిగారు. పోలీస్ వాహనాలను అడ్డుకొన్నారు. నిప్పు పెట్టి టైర్లను కాల్చేశారు.
పోలీసులు పలుమార్లు వారిపై లాఠీచార్జీ చేసినా ప్రజలు వెనక్కి తగ్గలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలను విడుదల చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. అయితే, తమను ఎందుకు నిర్బంధించారో, ఇన్ని గంటలసేపు ఎందుకు పోలీస్ వాహనాల్లో తిప్పారో, ఎందుకు ఇంతదూరం తీసుకొని వచ్చారో చెప్పనిదే తాము స్టేషన్‌ను విడిచి బయట కాలు పెట్టే సమస్యే లేదని బీఆర్ఎస్ నేతలు తేల్చిచెప్పారు.
ముఖ్యం గా.. తాము ఫోన్ చేసినప్పుడు పోలీస్ ఉన్నతాధికారులు ఎందుకు స్పందించలేదని స్థానిక పోలీసులను హరీశ్‌రావు ప్రశ్నించారు. ఒక దశలో స్థానిక పోలీసులు హరీశ్‌రావుకు దండం పెట్టి మరీ.. దయచేసి స్టేషన్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే, హరీశ్‌రావు వారికి ప్రతినమస్కారం చేసి తమ ప్రశ్నలకు జవాబిచ్చేవరకు స్టేషన్ నుంచి కదిలే సమస్యే లేదని అంతే మర్యాదగా జవాబిచ్చారు. ‘ఇదెక్కడి దుర్మార్గం.. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? శాసనసభ్యులను అరెస్ట్ చేసే ముందు స్పీకర్ అనుమతి తీసుకున్నారా?’ అని నిలదీశారు. హరీశ్‌రావు ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేక బిక్కముఖం వేశారు.
ఠాణా నుంచి బయటకు వెళ్లబోమని హరీశ్‌రావు తదితరులు భీష్మించటం, బయట వేల సంఖ్యలో జనం గుమిగూడటం.. పెద్ద ఎత్తున నినాదాలు.. లాఠీచార్జీతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పరిస్థితి చేయిదాటిపోయే అవకాశం ఉన్నదని ఉన్నతాధికారులకు స్థానిక పోలీస్ అధికారులు నివేదించారు. పర్యవసానంగా డీజీపీ జితేందర్ హరీశ్‌రావుకు ఫోన్‌చేసి మాట్లాడారు. దయచేసి సహకరించాలని, స్టేషన్ నుంచి వెళ్లిపోవాలని డీజీపీ.. హరీశ్‌రావును రిక్వెస్ట్ చేశారు. ‘కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా గంటల తరబడి వాహనాల్లో మమ్మల్ని ఎందుకు తిప్పారు? ప్రజాప్రతినిధులం అనే గౌరవం కూడా లేకుండా పోలీసులు అలా ఎలా వ్యవహరిస్తారు? శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు?’ అని హరీశ్.. డీజీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో డీజీపీ ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
‘మీరు సీనియర్ నాయకులు. మనమంతా కలిసి తెలంగాణ తెచ్చుకున్నాం. దాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మీ అభ్యంతరాలు, ఆరోపణలన్నింటినీ నేను పరిగణనలోకి తీసుకొన్నాను. వాటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాను. కౌశిక్ ఇంటిపై దాడిచేసిన గాంధీ, ఆయన అనుచరులపై ఇప్పటికే 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశాం. మీరు మాకు సహకరించాలి. మీపట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై తప్పక విచారణ జరుపుతాం. రాష్ట్రంలో వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. త్వరలో నిమజ్జనం ఉన్నది. మీరు మాకు సహకరించాలి’ అని డీజీపీ పదేపదే విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తమ పార్టీ ఎమ్మెల్యేలపై జరుగుతున్న వరుస దాడులను కేటీఆర్ ఖండించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన గురువారం రాత్రి డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. ఖమ్మంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌పై కాంగ్రెస్ నాయకుల దాడిని ప్రస్తావించారు. రైతు రుణమాఫీపై శాంతియుతంగా ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెలపై దాడిని గుర్తుచేశారు. తాజాగా కౌశిక్‌రెడ్డిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేసిన దాడి ఘటనలపై పోలీసుల నిష్క్రియాపరత్వాన్ని ఆయన డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై డీజీపీ సానుకూలంగా స్పందించి విచారణ చేపడతామని పేర్కొన్నారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
పోలీసులు భేషరతుగా విడుదల చేస్తున్న సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. ఈ పోరాటంలో పాలుపంచుకున్న ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకునే పార్టీగా బాధ్యతతో ఆందోళనను విరమిస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిచేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. నేతలను అరెస్ట్ చేయలేదని, బేషరతుగా విడుదల చేస్తున్నట్టు చెప్పారన్నారు. రాష్ట్రంలో ఓవైపు గణేశ్ నిమజ్జనం జరుగుతున్నదని, ఇలాంటి సమయంలో శాంతి భద్రతలకు సమస్యలు కలిగించవద్దని, పోలీసులకు సహకరించాలని కోరారన్నారు. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినొద్దనే ఉద్దేశంతో డీజీపీ హామీ మేరకు వెనక్కి వెళ్తున్నట్టు చెప్పారు.
మాట మీద నిలబడాలని కోరారు. లేదంటే మరోసారి ఉద్యమం చేస్తామన్నారు. అధికారంలో ఎవరున్నారన్నది సమస్య కాదని, ఈరోజు వాళ్ల దగ్గర ఉంటే, రేపు తమ దగ్గర ఉండొచ్చన్నారు. శాంతి భద్రతలు కాపాడాలని, ఏకపక్షంగా కాకుండా న్యాయం పక్షాన ఉండాలని పోలీసు అధికారులను కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ‘మీకు ఎన్నిరకాలుగా కృతజ్ఞత చెప్పినా తక్కువే. మమ్మల్ని అరెస్ట్ చేసి కేశపట్నంవైపు తెస్తున్నారని తెలియగానే కొన్ని నిమిషాల్లో వచ్చారు.
ప్రాణాలకు తెగించి అడ్డం పడ్డారు. మేం వెళ్లిన తర్వాత మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే తిరిగి వస్తాం. మా ప్రాణాలను అడ్డం పెట్టి అయినా వారి కోసం పోరాడుతాం’ అని స్పష్టం చేశారు. జిల్లాల్లో కార్యకర్తలను బైండోవర్ చేస్తున్నారని, అలాంటి చర్యలు మానుకోవాలని పోలీసులను కోరారు. కార్యకర్తలందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ‘మన లక్ష్యం రైతులకు రుణమాఫీ కావాలి.. మన లక్ష్యం పేదలకు రూ.4వేల ఆసరా పెన్షన్లు అందాలి.. మన లక్ష్యం మహిళలకు ప్రతి నెల రూ.2,500 రావాలి.. దాని కోసం పోరాడుదాం’ అని విజ్ఞప్తి చేశారు.