హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి పీఠం ఎక్కినా రేవంత్‌రెడ్డి బుద్ధిమాత్రం పెరగలేదని మాజీమంత్రి హరీశ్‌రావు ఫైరయ్యారు. తెలంగాణ సమాజంలో కేసీఆర్‌కు జీవించే హక్కులేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించటంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పనులు చేతగాక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని శుక్రవారం ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ఛీత్కరిస్తున్నదని, ఎంతమంది దుమ్మెత్తి పోసినా రేవంత్‌రెడ్డికి జ్ఞానం రావడం లేదని విమర్శించారు. ‘ఎలుకతోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపేగాని తెలుపు కాదు’ అనే సామెతను అక్షరాలా చాటుకుంటూ రేవంత్‌రెడ్డి తన దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తున్నాడని ధ్వజమెత్తారు. సీఎం పదవిలో ఉండి చిచోరా భాష మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డిని తెలంగాణ ప్రజలు ఛీ కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాహుల్‌పై కోపం కేసీఆర్ మీదనా?
‘సీఎం రేవంత్‌రెడ్డి రాహుల్‌గాంధీపై ఉన్న కోపాన్ని కేసీఆర్ మీద చూపిస్తే ఎట్లా?’ అని హరీశ్ నిలదీశారు. ‘ముఖ్యమంత్రిగా ఎవ్వరూ గుర్తించడం లేదని.. ఉనికి చాటుకొనేందుకు కేసీఆర్‌పై ప్రేలాపనలా? కేసీఆర్‌ను తిడితే ఒక రోజు హెడ్‌లైన్స్‌లో ఉంటవ్ కావచ్చు. కానీ కేసీఆర్ స్థానమే ప్రజల హృదయాల్లో ఉన్నదని తెలుసుకో’ అని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డిది నాడైనా నేడైనా తెలంగాణ ద్రోహుల భాషేనని విమర్శించారు. అందుకే తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌పై పెద్దా చిన్నా అన్న గౌరవం కూడా లేకుండా దుర్భాషలాడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న లేకి తనాన్ని, చిల్లర మనస్తత్వాన్ని తెలంగాణ సమాజం ఇప్పటికే అర్థం చేసుకున్నదని తెలిపారు.
సర్వే, రీ సర్వేతో రేవంత్‌కు దిమాక్ కరాబ్
ప్రజాస్వామ్య పంథాలోనే రేవంత్‌కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కులగణన పేరుతో కుటిల రాజకీయం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హరీశ్ హెచ్చరించారు. సర్వే సరిగా లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులే తూర్పార పడుతున్న విషయాన్ని ఉదహరించారు. ‘కులగణన చేయలేదు..గాడిదగుడ్డు చేయలేదు అని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే అంటున్నా సీఎం రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా మా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నది’ అని మండిపడ్డారు. కులసర్వేలో కచ్చితమైన గణాంకాలు వచ్చాయని సత్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో చెప్పించాలని సవాల్ విసిరారు. ‘కుల సర్వే ఉత్త ఎన్నికల గిమ్మిక్కు.. ఫెయిల్యూర్ మ్యాజిక్కు’ అని కొట్టిపారేశారు. సర్వే కరెక్ట్ అని చెప్పుకొంటూనే మరోవైపు రీసర్వే అంటున్నారంటే రేవంత్‌రెడ్డికి దిమాక్ కరాబ్ అయిందనేందుకు నిదర్శనమని విమర్శించారు. ‘సీఎం పదవి స్థాయిని చిల్లర మాటలతో దిగజార్చొద్దు.. ప్రశాంత తెలంగాణలో ఫ్యాక్షన్ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు ఎన్నటికీ సఫలం కావు.. నోరుమంచిదైతే ఊరుమంచిదవుతది.. రేవంత్ రాజకీయ జీవితానికి ఆయన నోరే ఉరిగా మారుతది’ అని హెచ్చరించారు.
తెలంగాణను ఆవిషరించిన కేసీఆర్‌ను బహిషరిస్తవా? సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందో తెలుసు కదా? మా బహిషరణ నీ వల్ల కాదు గాని, నీ నిష్రమణకు సమయం దగ్గర పడుతున్నది. సామాజిక బహిషరణ చేయాల్సివస్తే.. ప్రజలను పట్టపగలు మోసం చేస్తున్న నిన్ను ముందుగా చేయాలి రేవంత్..
– హరీశ్‌రావు
ఎవరికి సమాజంలో జీవించే హకులేదో ప్రజలను అడుగుదామా? నీ నియోజకవర్గం కొడంగల్.. లేక నీ సొంతూరు కొండారెడ్డిపల్లిలో అడుగుదామా? రేవంత్‌రెడ్డీ.. నీకు వచ్చే దమ్మున్నదా? రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ఛీత్కరిస్తున్నది. ఎంతమంది ఎన్ని విధాలుగా దుమ్మెత్తి పోసినా రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయమైతలేదు.
– హరీశ్‌రావు
కేసీఆర్‌ను తిడితే ఒకరోజు హెడ్‌లైన్స్‌లో ఉంటవేమో? కానీ తెలంగాణ చరిత్ర గతిని మార్చిన కేసీఆర్ స్థానం ప్రజల హృదయాల్లో పదిలమని తెలుసుకో.. రేవంత్‌రెడ్డి ఇదే భాషను కొనసాగించాలనుకుంటే జనజీవన స్రవంతిలో ఉండేందుకు అర్హుడే కాదు.
– హరీశ్‌రావు