హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : ‘బిడ్డా.. నువ్వు బీఆర్ఎస్ జెండా గద్దెల జోలికొస్తే. నీ గద్దె కూల్తది జాగ్రత్త’ అని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా హెచ్చరించారు. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్ అనేది జెండా గద్దెలను కూల్చితే పోయే పార్టీ కాదని, ప్రజల్లో గుండెల్లో ఉన్నదని స్పష్టంచేశారు. సోమవారం తెలంగాణ భవన్లో హరీశ్ మీడియాతో మాట్లాడుతూ ‘నిన్నటి క్యాబినెట్ మీటింగ్‌పై రైతులు చాలా ఆశగా ఎదురుచూసిండ్రు, సంక్రాంతికే నువ్వు రైతుబంధు ఇస్తావని యాసంగి పంటకు ఎదురుచూసిండ్రు. సంక్రాంతికి ఇవ్వకపోవడంతో క్యాబినెట్ మీటింగ్‌లోనైనా రైతుబంధు ఇస్తావేమోనని ఎదురుచూసిన రైతులు భంగపడ్డారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
నువ్వు బీఆర్ఎస్ జోలికొస్తే దుమ్ముదుమ్మయిపోతవ్ బిడ్డా. నువ్వు బీఆర్ఎస్ను కూల్చడానికి అది గద్దెల్లో లేదు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది. బీఆర్ఎస్ జెండా గద్దెలను కూల్చితే పోయే పార్టీ కాదు మాది. ప్రజల హృదయాల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. రేవంత్‌రెడ్డీ..ఈ పిచ్చి మాటలు బంద్ చెయ్. ఆరు గ్యారెంటీల అమలు మీద దృష్టిపెట్టు.
-హరీశ్‌రావు
‘రాష్ట్రంలో ఎరువుల కొరత ఉన్నది.. దానిపై క్యాబినెట్ మాట్లాడతదేమో అనుకున్నం.. రైతుబంధుపై, యూరియాపై ప్రకటన వస్తుందేమోనని రైతులు ఎదురుచూసిండ్రు. మేడారంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో రైతుబంధు, ఎరువుల కొరతపై చర్చలేదు. పిల్లల ఫీజు రీయింబర్స్మంట్ గురించి ఊసు లేదు. 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నవ్’ అని ధ్వజమెత్తారు. ‘రేవంత్‌రెడ్డే హోంమంత్రి, ముఖ్యమంత్రి. ఆయనకు తెల్వకుండా సిట్ పడుతుందా? ఎట్లా వచ్చింది సిట్? ఒకవేళ రేవంత్‌రెడ్డికి తెలియకుండా సిట్ ఏర్పడితే.. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఫెయిల్. రేవంత్‌కు పాలన మీద పట్టులేదు. ముఖ్యమంత్రిగా పనికిరాడు. ఆ కుర్చీకి పనికిరాడు. మీరు సర్కారు నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా?’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇటీవల మీటింగ్‌లకు వెళ్తూ రేవంత్‌రెడ్డి ఏ రోటికాడ ఆ పాట పాడుతున్నారని హరీశ్ మండిపడ్డారు. ‘ఖమ్మంలో నాలుగు ఓట్లు వస్తాయని టీడీపీ గురించి మాట్లాడుతవ్. నువ్ ఉన్నది కాంగ్రెస్‌లో అని తెల్వదా? టీడీపీ కేంద్రంలోని బీజేపీతో పొత్తులో ఉన్నదని తెల్వదా?’ అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ దేశం మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంది. నువ్ ఎవరితో కలిసి పనిచేస్తున్నవ్? బీజేపీ, టీడీపీ ఒక్కటే కదా? వారు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకుంటున్నరు. ఆ టీడీపీతో నువ్వు అంటకాగడమంటే.. బీజేపీతో అంటకాగడమే కదా? బీజేపీతో సంబంధం పెట్టుకోవడమే కదా? నువ్ బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నవ్.. అది బంద్ చెయ్’ అని హెచ్చరించారు. ‘కాంగ్రెస్‌కు ఔట్సోర్సింగ్ సీఎంగా రేవంత్‌రెడ్డి ఉన్నడు. ఆయనకు, అసలు కాంగ్రెస్ నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. పాలించుమని ప్రజలు అవకాశమిస్తే.. దోపిడీ సొమ్ముకోసం కొట్టుకుంటున్నరు. ప్రజలు, రాష్ర్టాన్ని, పాలనను గాలికి వదిలేసిండ్రు’ అని తీవ్రంగా మండిపడ్డారు.
తెలంగాణ ఈజ్ ద బెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని కేసీఆర్ చూపించిండ్రు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్నదని నిరూపించిండ్రు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత పురోగతి సాధించింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాటాల పంచాయితీలు, కాంట్రాక్టర్ల పంచాయితీలు, బెదిరింపులు, భూ కబ్జాలు నిత్యకృత్యమైనయ్. వాటిల్లోనే మీరు ప్రగతి సాధిస్తున్నరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. జాగ్రత్త బిడ్డా..
– హరీశ్‌రావు
‘టీడీపీఎప్పుడు పుట్టిందో తెలుసా? కాంగ్రెస్ పార్టీ ప్రధాని రాజీవ్‌గాంధీ మన ముఖ్యమంత్రి అంజయ్యను అవమానిస్తే కాదా? తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిందే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అనే విషయం తెల్వదా? ఎన్టీఆర్ ఆనాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్‌ను నెలకొల్పలేదా? కాంగ్రెస్ భూస్థాపితమే తన లక్ష్యమని ఎన్టీఆర్ ప్రతినబూనలేదా? నిజంగా కాంగ్రెస్ భూస్థాపితమైతే.. ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరుతది’ అని హరీశ్ నిప్పులు చెరిగారు. ‘నీకు టీడీపీపై అంత ప్రేముంటే ఆ తెలుగుదేశంలోనే ఉండ్సాలింది. ఎందుకు కాంగ్రెస్‌లోకి వచ్చినవ్? నిజంగా చెప్పాలంటే నువ్వే ద్రోహివి. తెలుగుదేశం నుంచి బయటికి వచ్చి ఆపార్టీకి ద్రోహం చేసినవ్. నీకు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉన్నదా?’ అని నిలదీశారు. ఎన్టీఆర్ జీవితాంతం గల్లీ నుంచి ఢిల్లీదాకా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు.