ప్రభుత్వాలు వస్తయ్.. పోతయ్. కానీ, రాష్ట్రం బాగుండాలి. మీరు మమ్మల్ని ఓడించారు సరే.. కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని ఓడించకండి.. చరిత్ర ఎప్పుడూ నిర్మాణాన్ని గుర్తుపెట్టుకుంటుంది. గౌరవిస్తుంది. విధ్వంసాన్ని క్షమించదు. కచ్చితంగా శిక్షిస్తుంది. మీరు సృష్టించిన ఈ వినాశనం.. రేపు మిమ్మల్నే కబళిస్తుంది. రాష్ట్ర ప్రజలకు శాపమవుతుంది. ఇప్పటికైనా అబద్ధాలు ఆపేసి, అభివృద్ధి వైపు అడుగులు వేయండి. లేదంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు!
-హరీశ్‌రావు
‘రాహుల్‌గాంధీ మాట నమ్మి.. ప్రియాంకాగాంధీ బాస నమ్మి.. కాంగిరేసుకు ఓటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం.. ఎంత కష్టం ముఖ్యమంత్రి ఢిల్లీ పాయె.. జాబులేమో రాకపాయె.. కడుపుమండి ర్యాలీ తీస్తే.. లాఠీచార్జి చేసుడాయె తలలు పగిలి నెత్తురాయె.. అశోక్ నగరే చిత్తడాయె కాంగిరేసుకు ఓటు వేసిన నిరుద్యోగికి ఎంత కష్టం.. ఎంత కష్టం’ శ్రీశ్రీ ఉంటే ఇప్పటిపరిస్థితిపై ఇలా కవిత రాసేవాడేమో!
– అసెంబ్లీలో హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : బ్యాంకు అప్పు ఉన్న బకరైతును ముంచేందుకు గిన్ని జిమ్మికులు, గిన్ని మ్యాజికులు చేస్తరా? అని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. ‘రుణమాఫీకి రూ.51 వేల కోట్లు అవుతుందని బ్యాంకర్ల మీటింగ్‌లో ప్రకటించారు. మొదటి బడ్జెట్‌కు వచ్చేసరికి అది రూ.31 వేల కోట్లకు కుదించారు. రెండో బడ్జెట్ నాటికి అది రూ.20,616 కోట్లకు కుదించారు. కానీ..మీరు రుణమాఫీ చేసింది కేవలం రూ.20,157 కోట్లే. ఐసు ముక్కలు కరిగినట్టు రుణమాఫీ లెక్కలు కరిగిపోయినయ్’ అని తూర్పారబట్టారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్ల తీరును లెక్కలు సహా నిండు సభలో సోమవారం ఎండగట్టారు.
తన నియోజకవర్గంలో రెండు లక్షల లోపు రుణమాఫీ కాని రైతులు 10,217 మంది ఉన్నారని, రెండు లక్షల పైన ఉండీ మాఫీ కానీ రైతులు 12,632 మంది ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 17 వేల మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని, వేల మంది సంతకాలతో కూడిన వినతి పత్రాలను మాజీ మంత్రి జోగు రామన్న తనకు అందజేశారని చెప్పారు. రాష్ట్రంలో ఎకడ చూసినా ఇదే పరిస్థితి ఉన్నదని వాపోయారు . ‘నాకు రుణం మాఫీ కాలేదు సారూ! నేనేం పాపం చేసిన సారూ ! నాకు ఎందుకు కాలేదు సారూ’ అని కన్నీరు పెట్టుకుంటున్న రైతుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
‘సమైక్య రాష్ట్రంలో అష్టకష్టాలు పడ్డ రైతులకు స్వరాష్ట్రంలో కేసీఆర్ కొండంత అండగా నిలిచారు. 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు ఇచ్చిండ్రు. సమయానికి ఎరువులు, విత్తనాలు ఇచ్చిండ్రు. రైతుల ఆత్మహత్యలు ఆగిపోవాలని రైతుబంధు పథకం తెచ్చిండ్రు’ అని హరీశ్ గుర్తుచేశారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు సహాయం ఆపలేదని, 11 విడతల్లో రూ.72 వేల కోట్లు క్రమం తప్పకుం డా రైతుల ఖాతాల్లో జమ చేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెట్లో రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. రెండో బడ్జెట్లో రూ.12 వేల ని చెప్పి, ఇప్పుడు అవీ ఇవ్వడం లేదని విమర్శించారు. రైతు భరోసా 15 వేలకు ఎప్పుడు పెంచుతారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రెండున్నరేండ్లు గడిచినా మీ ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు కాలేదు? వాటి అమల్లో మీ సంకల్ప బలం సడలిందా? చిత్తశుద్ధి కొరవడిందా? నిజాయితీ లోపించిందా? ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలను అలవిగానివిగా మార్చింది మీరు కాదా? మ్యానిఫెస్టోలో ఆకాశమంత హామీలు.. బడ్జెట్లో అసంపూర్తిగా నిధులు.. క్షేత్రస్థాయిలో అరకొరగా అమలు.
-హరీశ్‌రావు
అన్ని పంటలకు బోనస్ ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారని, మొదటి బడ్జెట్లో సన్న వడ్లకే పరిమితం చేశారని హరీశ్ దుయ్యబట్టారు. గత యాసంగి బోనస్ రూ.1,161 కోట్లు ఎగవేశారని విమర్శించారు. ‘వీళ్ల సంకల్పంలో ప్యూరిటీ లేదు. వీళ్లు చెప్పే మాటల్లో క్లారిటీ లేదు. బడ్జెట్ ప్రసంగాలకు సాంటిటీ లేదు. అమలు చేస్తారనే ష్యూరిటీ లేదు. మ్యానిఫెస్టోలో ఒకటి రాస్తారు.. బడ్జెట్లో ఒకటి చదువుతారు.. క్షేత్రస్థాయిలో ఒకటి చేస్తారు. అందుకే ఇది నో ప్యూరిటీ, నో క్లారిటీ, నో ష్యూరిటీ గవర్నమెంట్’ అని తూర్పారబట్టారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టు తయారైందని హరీశ్ మండిపడ్డారు. మొదటి బడ్జెట్లో భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తామని చెప్పి.. రెండో బడ్జెట్లో రూ.12 వేలు ఇస్తున్నామని చెప్పారని గుర్తుచేశారు. ఆ రూ.12 వేలు క్షేత్రస్థాయిలో ఎంత మంది కూలీలకు ఇచ్చారో చెప్పాలి? అని డిమాండ్ చేశారు. ‘ఎండనక, వాననక రెకల కష్టం మీద బతికే నిరుపేద కూలీల పొట్ట కొట్టుడతరా? దీన్ని ఆత్మీయత అంటరా? ఇందిరమ్మ భౌతికంగా మరణించింది.. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న వాగ్దానాలు నైతికంగా మరణిస్తున్నాయి’ అని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ నమ్మకద్రోహానికి నిరుద్యోగులు బలై.. నెత్తురు చిందిస్తున్నారని, ఉద్యోగాలు అడిగితే వీపులు విమానం మోత మోగిస్తున్నారని హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామన్నారు కదా? ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు? నియామక పత్రాలు చూపిస్తరా? లేదా నిరుద్యోగుల విజయోత్సవాలు కూడా నిర్వహిస్తారా?’ అని ఎద్దేవాచేశారు. ‘నిరుద్యోగులను ఓటింగ్ మిషన్ల లెక్క వాడుకొని, వాళ్ల నెత్తురు కండ్ల చూసిన మీ పాపం కడిగేసుకోవాలంటే ఇప్పటికైనా మీరు చెప్పిన ప్రకారం వెంటనే రెండు లక్షల ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభించాలి’ అని హితవు పలికారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క కలుగజేసుకోగా బీఆర్ఎస్ హయాంలో 1.62 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని, 95 శాతం లోకల్ రిజర్వేషన్లు తెచ్చామని గుర్తుచేశారు.
రుణమాఫీ రెండు లక్షలపైన ఉన్నవి కడితే.. మిగతావి ప్రభుత్వం చెల్లిస్తుందని మీరు చెప్తే రైతులు తమ భార్యల పుస్తెల తాళ్లు కుదువపెట్టి మరీ రుణాలు కట్టిండ్రు. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేస్తమన్న మీ అభయహస్తం.. రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారింది. వారిని ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టింది.
-హరీశ్‌రావు
వడ్డీలేని రుణాలపై ప్రభుత్వం అబద్ధాలు ఆడుతున్నదని హరీశ్ విమర్శించారు. మొదటి బడ్జెట్లో ఏటా రూ.20 వేల కోట్లకు తగ్గకుండా ఐదేండ్లలో రూ.లక్ష కోట్లకు వడ్డీలేని రుణం అందిస్తామని చెప్పారని, రెండో బడ్జెట్లో కోటి మంది మహిళలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణం అందిస్తామని, ఈ బడ్జెట్లో ఐదేండ్లలో రూ.లక్ష కోట్ల మేరకు బ్యాంకు ద్వారా రుణాలను ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం వారి మోసానికి నిదర్శనమని మండిపడ్డారు. ‘ఇప్పటికీ మీరు ఇస్తున్నది కూడా నాడు మేము ఇచ్చిన రూ.5 లక్షల వడ్డీ లేని రుణమే. ఇదే శాసనసభ సాక్షిగా అడిగిన ప్రశ్నకు జీవో నంబర్ 27 ప్రకారం 5 లక్షల వరకే వీఎల్ఆర్ వర్తిస్తుందని మీరే సమాధానం చెప్పలేదా? మిగతా రూ.5 లక్షల మినహా రూ.15 లక్షలకు మహిళలే వడ్డీలు కడుతున్న మాట వాస్తవం కాదా? మీకు నిజాయితీ ఉంటే 20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు జీవో బయటపెట్టండి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రాజీవ్ యువ వికాసం అనే పథకం గురించి నాడు వారు చెప్పిన మాటలు కోటలు దాటాయి కానీ కాళ్లు తంగెళ్లు దాటలేదు’ అని హరీశ్ దెప్పిపొడిచారు. యువతకు రూ.6 వేల కోట్లతో ఈ పథకాన్ని తెస్తున్నామని రొమ్ము విరిచి చెప్పుకొని.. రూపాయి కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ బడ్జెట్లో రూ.6 వేల కోట్లు మళ్లీ ప్రతిపాదించారని, గేమ్ చేంజర్ అని డప్పు కొట్టుకున్న ఈ పథకం కింద ఇప్పటి వరకు ఎంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువకులకు స్వయం ఉపాధి కల్పించారో చెప్పాలని నిలదీశారు. ‘రాజీవ్ యువ వికాసం అని కాకుండా రేవంత్ ఆత్మీయ మోసం అనో.. లేక భట్టి యువ భ్రమలు అనో పేర్లు పెట్టుకోవాలి’ అని ఎద్దేవాచేశారు.
ఇరిగేషన్ విషయంలో ఆర్థిక మంత్రి మొదటి బడ్జెట్లో ఆశల ఆనకట్టలు కట్టారని హరీశ్ గుర్తుచేశారు . తుది దశలో ఉన్న ప్రాజెక్టులు, ఆయకట్టు తక్షణం పెంపొందించేలా 6 ప్రాజెక్టులను మొదటి ఆర్థిక సంవత్సరంలో, 12 ప్రాజెక్టులను ఆ తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నాడు నిర్ణయించి.. నేడు గాలికి వదిలేశారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2024-25లో 6,55,895 ఎకరాలు.. 2025-26లో 5,05,000 ఎకరాలు అభివృద్ధి చేస్తామని హామీలిచ్చారని, మీరు ఇస్తామన్న ఆ 11,60,895 ఎకరాల ఆయకట్టు ఏమైందని ప్రశ్నించారు.
‘ఒక అడవిలో ఒక ముసలి పులి ఉండేది. ముసలి తనం వల్ల వేటాడే సత్తువ లేకుండా పోయింది. దాని కోసం అది ఒక ఉపాయం ఆలోచించింది. ఏందంటే అది ఒక బురద గుంతలో కూర్చొని, చేతిలో ఒక బంగారు కడియం పట్టుకొని దారిన పోయే బాటసార్లను పిలుస్తూ ఉంది. ఓ బాటసారులారా.. నన్ను రక్షించండి.. ఈ బురద గుంతలో నుంచి నన్ను బయటకు తీసుకురండి అని కనిపించిన వారందరినీ అడుగుతా ఉంది. మీరు నన్ను బురద గుంతలో నుంచి బయటకు తీసుకువస్తే ఈ బంగారు కడియాన్ని మీకు బహుమతిగా ఇస్తా అని వచ్చిపోయేటోళ్లకు అందరికీ ఆశ చూపించింది. ఒక రోజు అమాయక బాటసారి అటునుంచి వెళ్తూ ఆ పులి మాటలు విన్నాడు.
ఇది ముసలి పులి కదా ఒంట్లో బలమైతే లేదు. ఇది తనను ఏమీ చేయదనుకుని పాపం బేఫికర్‌గా ఈ పులిని కాపాడుదాం.. ఆ బంగారు కడియాన్ని తీసుకుందామని చెప్పి దగ్గరికి పోయిండు. లోపలికి దిగిండు. పులిని బయటకు తీద్దామని పోతే పాపం అమాయక బాటసారి పులికి ఆహారమై పోయిండు’ అని పేర్కొంటూ హరీశ్‌రావు కథ ముగించారు. ఈ కథలో ముసలి పులి ఎవరో బహుషా మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఆ ముసలి పులి ఎవరో కాదు ఘనత వహించిన ఈ కాంగ్రెస్ పార్టీ.. అది ఆశ చూపిన బంగారు కడియం మరోపేరే ఆరు గ్యారెంటీలు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.