Harish Rao | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు పచ్చిమోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దేవుళ్లు, చర్చి, దర్గాలపై విశ్వాసం ఉంటే, ఇచ్చిన హామీ మేరకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సిందేనని, మాటతప్పితే బీఆర్ఎస్ వెంట పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడుతామని స్పష్టంచేశారు. అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి రుణమాఫీ పూర్తయిందని, రూ.2లక్షలపైన ఉన్న రైతులకు మాఫీ చేయ బోమని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు.
‘రేవంత్‌రెడ్డీ.. పాలమూరు బిడ్డవి అయితే.. నీకు పౌరుషం ఉంటే.. నీకు నిజాయతీ ఉంటే.. మాట మీద నిలబడే వ్యక్తివే అయితే.. అసెంబ్లీలో మంత్రి చెప్పిన మాటను ఖండించు.. ఇచ్చినమాట నిలబెట్టుకో.. లేదంటే ఒట్టేసి మాటతప్పిన నీకు ఆ దేవుళ్ల శాపం తగులుతుంది..’ అని హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అసెంబ్లీలో, బహిరంగ సభల్లో దేవుళ్లపై ఒట్టేసి ఇప్పుడు మాటతప్పడం దుర్మార్గమని మండిపడ్డారు.
రైతాంగాన్ని దగా చేసిన కాంగ్రెస్ సర్కారును ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అసెంబ్లీలో, బయట ఎప్పటికప్పుడూ నిలదీస్తూనే ఉంటామని స్పష్టంచేశారు. రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులను, ఎమ్మెల్యేలను, మంత్రులను, రేవంత్‌ను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ‘రూ.రెండు లక్షలపైనున్న రైతులు.. పైనున్న పైసలు చెల్లిస్తే రుణమాఫీ చేసే బాధ్యత నాదీ అని చెప్పిన రేవంత్‌రెడ్డీ.. ఇప్పుడు ఆ బాధ్యత ఏమైంది? రైతులకిచ్చిన మాట నిలబెట్టుకోవా?’ అని నిలదీశారు.
అసెంబ్లీలో రుణమాఫీ పూర్తయిందని, రూ.2లక్షలకు పైనున్న వారికి చేయబోమని వ్యవసాయ మంత్రి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీ పూర్తి చేశామని మంత్రి తుమ్మల ప్రకటించడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. ఇప్పటివరకు రూ.1.99,999 లక్షల వరకే మాఫీ అయిందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నాడు ఓట్ల కోసం కుటుంబంతో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తామని ప్రకటించి, నేడు కుటుంబంలో ఒక్కరికే వర్తింపజేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు 15 నెలల పాలనలో సాగును ప్రశ్నార్థకం చేసిందని విమర్శించారు.