హైదరాబాద్, జనవరి 7(నమస్తే తెలంగాణ) : ‘రేవంత్‌రెడ్డి.. యూనివర్సిటీలపై నీ కెందుకంత కక్ష..? విజ్ఞాన కేంద్రాల్లోని విలువైన భూములు అమ్మడంలోని అసలు ఆంతర్యమేంది?’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ సర్కార్‌కు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ దుర్మార్గపు విధానాల తో తెలంగాణ విద్యావ్యవస్థ, విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తున్నదని బుధవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి భూ దాహానికి యూనివర్సిటీలు బలవుతున్నాయ ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మొన్న జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర ఉద్యానవన యూనివర్సిటీ నుంచి 100 ఎకరాలకు పైగా లాక్కున్నా రు, 60ఏళ్లుగా కాపాడుతూ వస్తున్న ఔషధ, సుగంధ మొక్కల పరిశోధన కేంద్రంలోని 60 ఎకరాలు ధ్వంసం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరా ల అటవీ భూమిని తాకట్టుపెట్టి ధ్వంసరచనకు పూనుకున్నారు. పర్యావవరణాన్ని విధ్వంసం చేసి మూగజీవాల మనుగడ ప్రశ్నార్థకం చే శా రు. తాజాగా మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాలపై కన్నేసి లాక్కునేందుకు యత్నిస్తున్నారు’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్టారు.
కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నదంతా యాదృచ్ఛికంగా జరిగింది కాదని, విద్యారంగం, యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిపై కావాలనే జరుగుతున్న దాడిగా హరీశ్‌రావు అభివర్ణించారు. అభివృద్ధి అంటే భవనాలు కట్టడమే కాదు.. భావితరాలకు జ్ఞానాన్ని అందించే పరిశోధన కేంద్రాలను కాపాడుకోవడం అని తేల్చి చెప్పారు. భవిష్యత్తరాలకు విజ్ఞానాన్ని అందించాల్సిన చోట విధ్వంసానికి పాల్పడడం దుర్మార్గమని, ఆవిష్కరణకు ఊపిరిపోయాల్సినచోట భూములు లాక్కోవడం దారుణమని ధ్వజమెత్తారు. భవిష్యత్తును నిర్మించాల్సిందిపోయి బుల్డోజర్లతో కూల్చివేతకు దిగ డం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు కండ్లు తెరిచి యూనివర్సిటీల విధ్వంసాన్ని నిలిపివేయాలని, లే దంటే సమాజం, విద్యార్థిలోకం తగిన బుద్ధి చెబుతుందని హరీశ్ హెచ్చరించారు.