హైదరాబాద్ సిటీబ్యూరో/ఖైరతాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ): ‘మీ ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ పూర్తిగా పడకేసింది. బాన్సువాడ మాతాశిశు ఆరోగ్యకేంద్రంలో ఇన్ఫెక్షన్ సోకి 10మంది బాలింతలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ప్రభుత్వం స్పందించలేదు. ఘటన జరిగి 10రోజులు గడుస్తున్నా ఒక మంత్రి గానీ, ఎమ్మెల్యే గానీ, ఒక ఉన్నతాధికారి కూడా వారిని పరామర్శించిన పాపానపోలేదు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నేరపూరితమైన నిర్లక్ష్యమే’ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు.
బాన్సువాడ ఎంసీహెచ్‌లో శస్త్రచికిత్స అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై, నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలింతలు, వారి కుటుంబసభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యసేవలపై నిమ్స్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఖమ్మంలో జరిగిన దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న బాలికను సైతం హరీశ్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నిమ్స్‌లో ఫాతిమా, రుక్సానా, జ్యోతి, లక్ష్మీప్రియ, సునీత అనే ఐదుగురు బాలింతలు చికిత్స పొందుతున్నారని, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఘటన జరిగి పది రోజులైనా ప్రభుత్వం కనీస స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు.
ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిసిన తర్వాత కూడా, అదే థియేటర్లో మళ్లీ మరో నలుగురికి సిజేరియన్ ఎందుకు చేశారని నిలదీశారు. వారికి కూడా ఇన్ఫెక్షన్కు గురైనట్టు చెప్పారు. ఆపరేషన్ థియేటర్లో మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ సోకిందని, వైద్యుల నిర్లక్ష్యానికి తాము బలయ్యామని, కాలంచెల్లిన మందులు వాడటం వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానలో జాయిన్ చేసుకోకపోవడం, బెడ్ ఇవ్వకపోవడం వల్ల నిలబడే బిడ్డకు జన్మనిచ్చిన హృదయ విదారకమైన ఘటనను ఉటంకిస్తూ హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు.
సర్కార్ దవాఖానలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని హరీశ్‌రావు దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషన్ కిట్, పుట్టగానే కేసీఆర్ కిట్ ఇచ్చామని, ఆరోగ్యలక్ష్మి పథకం కింద పాలు, పౌష్టికాహారం అందించామని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు కేవలం 30-35% ఉంటే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దానిని 72శాతానికి తీసుకెళ్లామని, అది ఇప్పుడు మళ్లీ 50శాతానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో మాతృ మరణాల రేటును 92నుంచి 43కి తగ్గించి, దేశంలోనే 3వ ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామని, కానీ నేటి కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ దవాఖానలకు సుస్తీ చేసిందని మండిపడ్డారు.
బాధిత కుటుంబాలకు పూర్తిస్థాయి వైద్యం, ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మంలో బాలిక ఘటన జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ స్పందించేదాకా ఈ ప్రభుత్వం రాలేదని, తాము వచ్చిన తర్వాతే హడావిడిగా మంత్రులు సీతక, తుమ్మల వచ్చారని పేర్కొన్నారు. ఆ బాలిక తన కాళ్ల మీద తాను నిలబడటం కష్టమేనని డాక్టర్లు చెబుతున్నారని, ఆమె కుటుంబానికి కనీసం రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తను వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దవాఖానలపై రెగ్యులర్ సూపర్విజన్ ఉండేదని, ఇవాళ అది లోపించిందని, రివ్యూలు, జవాబుదారీతనం కాదు కదా.. కనీసం మందులు కూడా నిల్వలేవని మండిపడ్డారు.