హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ ప్రాంతం కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అనేక త్యాగాలు చేశారు.. అలాంటి కేసీఆర్ పేరును ఈనాటి కాంగ్రెస్ పాలకులు చెరిపేయలేరు’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టంచేశారు. మహోన్నత వ్యక్తి వారసత్వాన్ని కాంగ్రెస్ కుట్రలు, విచారణ కమిషన్ల పేరిట చెరిపేయలేవని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి కాళేశ్వరం వంటి పరివర్తనాత్మక ప్రాజెక్టులను అందించడం వరకు, ప్రజల పట్ల కేసీఆర్ నిబద్ధత అచంచలమైనదని పేర్కొన్నారు.
ఇతరులు అధికారం వెంట పరుగెత్తుతుంటే, కేసీఆర్ ప్రజల జీవితాలను మార్చే యజ్ఞాన్ని తలకెత్తుకున్నారని తెలిపారు. తెలంగాణ కోసం ఆయన చేసిన త్యాగాలు అసమానమైనవి’ అని కొనియాడారు. అభివృద్ధిలో, సంక్షేమంలో నాడు కేసీఆర్ తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారని, అలాంటి రాష్ర్టాన్ని నేడు కాంగ్రెస్ పాలకులు అధోగతి పాలు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.