సిద్దిపేట, జనవరి 12 : సంక్షేమంలో విఫలమైన రేవంత్‌రెడ్డి హింసాత్మక చర్యలను ప్రోత్సహిస్తున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. భువనగిరిలో దాడులు చేసిన వారిని పోలీసులే ప్రోత్సహించినట్టు కనిపిస్తున్నదని ఆరోపించారు. సిద్దిపేటలో ఆదివారం మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఉన్నది రేవంత్‌రెడ్డి కాబట్టి, ఆయనే హింసాత్మక ఘటనలను ప్రోత్సహిస్తే పెట్టుబడులు వస్తాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గూండాలు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మౌనం దాడులను ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని చెప్పారు. రాగద్వేషాలకు అతీతంగా పాలిస్తానని ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గూండాలు బరితెగించి దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే రేవంత్‌రెడ్డికి ముఖ్యమయ్యాయని, రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ఓపికను బలహీనంగా తీసుకోవద్దని, ప్రశ్నిస్తే దాడులు చేయడం మంచిది కాదని హితవు పలికారు. ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరిస్తే పతనం తప్పదని హెచ్చరించారు.
విపక్ష నేతల అరెస్టుల చుట్టే పోలీసులను తిప్పుతుంతుండడంతో రాష్ట్రంలో క్రైమ్ రేట్ 23 శాతం పెరిగిందని హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దాడుల సంస్కృతి మారకుంటే కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలన విధించయినా శాంతిభద్రతలు కాపాడాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో 9 చోట్ల మతఘర్షణలు జరిగాయని, కాంగ్రెస్ గుండాలు సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంపైన, ఖమ్మం వరద బాధితుల
పరామర్శకు వెళ్లినప్పుడు తనపైన, యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయంపై, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడులు చేశారని గుర్తుచేశారు. కౌశిక్‌రెడ్డి ఇంటికి వచ్చిన కాంగ్రెస్ గూండాలకు పోలీసులు ఎస్కార్ట్‌లా వ్యవహరించారని విమర్శించారు. ఇటటీవల బీజేపీ కార్యాలయంపైనా దాడులు చేశారని గుర్తుచేశారు. మీడియా సమావేశంలో హరీశ్‌రావుతో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, సంపత్‌రెడ్డి, మోహన్‌లాల్, భూపేశ్ తదితరులు పాల్గొన్నారు.