Harish Rao | సిద్దిపేట ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. నిజానికి ఇందిరానగర్ పాఠశాల అంటే ఉత్సాహంగా ఉండే విద్యార్థులు గుర్తుకొస్తారు.. నేనెప్పుడూ ఈ స్కూల్‌కి వచ్చినా ఒక కొత్త శక్తిగా తిరిగి వెళ్తాను.. ఇది ఒక గొప్ప భావన అని అన్నారు. ఇంత బాగా తీర్చి దిద్దినందుకు, విద్యార్థులను ఇంత బాగా ప్రోత్సహిస్తున్నందుకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.
సిద్దిపేటకు ఉపాధ్యాయులు రావాలని కొందరు అనుకుంటారు, కానీ ఇందిరానగర్ రావాలంటే చాలామంది భయపడతారని హరీశ్‌రావు అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు అభినందనలు అని అన్నారు. ఇష్టంతో పనిచేస్తున్నారు కాబట్టి ఇంతటి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. నేను సహకారం మాత్రమే చేయగలుగుతాను.. కానీ ఆ విజయం మన ఉపాధ్యాయుల పట్టుదల, కృషి తోనే సాధ్యమని చెప్పారు. నిజంగా విద్యార్థులు, తల్లిదండ్రుల పక్షాన మా ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.
ఈ రాష్ట్రంలో టాప్ 10 స్కూల్స్‌లో ఇందిరానగర్ టాప్ 3 లో ఉందని హరీశ్‌రావు తెలిపారు. ఇంకొంచెంఫెసిలిటీస్ ఇవ్వగలిగితే ఇంకా ముందుకెళ్తారని అన్నారు. పాఠశాల అభివృద్ధికి ల్యాబ్, డైనింగ్ హాల్ కావాలని అడిగారని.. అవి నెల రోజుల్లోనే అందిస్తానని తెలిపారు. అవసరమైతే తన సొంత డబ్బులతో చేస్తానని.. లోటు మాత్రం రానియ్యనని పేర్కొన్నారు. నేను ఏది చేయాలనుకున్నా కూడా ఫస్ట్ చేయగలిగింది ఇందిరానగర్ స్కూల్‌కు మాత్రమేనని స్పష్టం చేశారు.
సిద్దిపేటలో ఫార్మసీ కాలేజ్ కట్టించామని. దానికి మన ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ల సహకరంతో నా సొంత డబ్బులతో ఆరు ఎకరాల స్థలం కొని బీ ఫార్మసీ కళాశాల కట్టించానని హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేటలో రెండు మెడికల్ కాలేజీలు, రెండు నర్సింగ్ కాలేజీలు, రెండు పారామెడికల్ కాలేజీలు, నాలుగు పాలిటెక్నిక్ కాలేజీలు, BSc అగ్రికల్చర్ ఇలా అన్ని విద్యాలయాలు ఉన్నాయని అన్నారు. ఇక్కడ విద్యార్థులు విద్యతో పాటు జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తున్నారని తెలిపారు. Z.P.H.S ఇందిరానగర్ నుంచి మహమ్మద్ అనాస్ నేషనల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో కెప్టెన్‌గా ఉండటం చాలా గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతి మ్యాచ్‌లో రన్నర్ అయ్యాడని.. ప్రతి మ్యాచ్‌లో గోల్ కొట్టి ప్రతిష్ట పెంచాడని. మన స్కూల్ విద్యార్థి ఇంద్రానగర్ విద్యార్థి అని అన్నారు. ఈ సంవత్సరం స్కాలర్షిప్లో మొత్తం 45 మందికి సీట్లు వస్తే.. సిద్దిపేట నుంచి కేవలం ఇందిరానగర్ నుంచే 16 మందికి సీట్లు వచ్చాయన్నారు. అంటే దాని ముందు టీచర్ మరియు విద్యార్థుల డెడికేషన్ ఉందని తెలిపారు. ఆటో డ్రైవర్ పిల్లలు, ఆటో కార్మికుల పిల్లలు, కూలీల పిల్లలు టాప్‌లో ఉండటం మనకు గర్వకారణమని చెప్పారు. 260 మంది టెన్త్ స్టూడెంట్స్ ఉన్నారని అన్నారు. ఈ సంవత్సరం కూడా 600 మార్కుల్లో 550 పైగా సాధించిన వారు 16 మంది ఉన్నారని.. 550 మార్కులకు పైగా ఎంతమంది తెచ్చుకుంటే అందరికీ నేను క్యాష్ ప్రైజ్ ఇస్తానని ప్రకటించారు. క్యాష్ ప్రైజ్ తో పాటు సిల్వర్ మెడల్ ఇస్తానని తెలిపారు.
టీవీలు చూడొద్దు, ఫోన్ వాడొద్దు, ఫంక్షన్స్‌కి వెళ్లొద్దని.. చదువులో ఏకాగ్రత సాధించి భవిష్యత్తుకి అడుగులు వేయండని సూచించారు. త్వరలోనే మీ అమ్మానాన్నలకు ఉత్తరం రాస్తానని అన్నారు. ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా రికమండేషన్స్ రావడం ఇదే ఇందిరానగర్ స్కూల్ గొప్పదనమని అన్నారు. భవిష్యత్ లో ఇంకా ఏమి కావాలన్నా నేను అన్ని విధాలా అండగా ఉంటానని తెలిపారు. ఎవరైతే మంచిగా చదువుకుంటారో, ఎవరైతే స్కూల్‌కి సెలవులు పెట్టకుండా రెగ్యులర్‌గా వస్తారో వారికి ప్రత్యేకంగా ఒక బస్సు పెడతానని తెలిపారు. అందులో నుంచి కొందరిని అసెంబ్లీకి తీసుకెళ్లి చూపిస్తానని చెప్పారు.