హైదరాబాద్: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును గృహ నిర్భంధం (Harish Rao) చేశారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయనను కలిసేందుకు వచ్చే ప్రజలను కూడా అడ్డుకుంటున్నారు.
హరీశ్‌రావును కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను అడ్డుకున్నారు. ఆయనను కలిసేందుకు వీల్లేదంటూ బయటే నిలిపివేశారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ ఎమ్మెల్యేను కలిసేందుకు మీ అనుమతి కావాలా, మీకు అభ్యంతరం ఎందుకు అంటూ నిలదీశారు.
ఉదయం 11 గంటలకు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు నివాసంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శంభీపూర్ రాజు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఆయనను హౌస్ అరెస్టు చేశారు. ఆయన నివాసానికి వస్తున్న పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు https://t.co/hM1JNOW4q0 pic.twitter.com/FPgoNOnSPZ
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2024