ఖాకీ బుక్కు అందరికీ సమానం అని చెప్పే డీజీపీ శివధర్‌రెడ్డి.. మెదక్‌లో ఖాకీ బుక్కు ఎందుకు పనిచేయలేదో చెప్పాలి. రా్రష్ట్రంలో ఓ బీజేపీ నాయకుడు పోలీసు గల్లా పట్టి బెదిరించినా, మరో కాంగ్రెస్ నేత పోలీసు అధికారులను బూతులు తిట్టినా ఎందుకు అరెస్టు చేయలేదు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లను అరెస్టు చేసే దమ్ము ఈ పోలీసులకు లేదు. కానీ బీఆర్ఎస్ నాయకులను మాత్రం అరెస్టు చేస్తరు. అక్రమ కేస్తులు పెడ్తరు.
– హరీశ్‌రావు
సంగారెడ్డి, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో గూండాలరాజ్యం నడుస్తున్నదని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని మాజీ మంత్రి, శాసనసభలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో ఉన్న మెదక్‌కు చెందిన 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల అరాచకాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెదక్ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే నాలుగు కార్ల కాన్వాయ్‌తో వార్డులోకి వెళ్లి ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు.
మెదక్ డీఎస్పీ స్వయంగా ఎమ్మెల్యేను వార్డులోకి తీసుకెళ్లటం, డబ్బులు పంపిణీ చేయటం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే గన్‌మెన్ ఓ ముస్లిం మహిళ ఛాతిపై చేయి వేసి దాడిచేశారని అందుకే స్థానికులు తిరగబడ్డారని తెలిపారు. మెదక్‌లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తల ఆటో, టిప్పర్‌ను పెట్రోలు పోసి తగులపెట్టినా కేసు నమోదు చేయలేదని, మరో బీఆర్ఎస్ కార్యకర్త కాలుపై నుంచి కాంగ్రెస్ నాయకులు కారు తీసుకెళ్లి కాలు విరగ్గొట్టినా పోలీసులు కనీసం ఫిర్యాదు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పోలింగ్‌బూత్‌లో బీఆర్ఎస్ ఏజెంట్ అఖిల్‌ను అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే ‘నిన్ను ఖతం చేస్తా’ అని బెదిరించినా కేసు పెట్టకపోగా, దాడులు చేయటాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే, అతడి గన్‌మెన్‌పై ఎందుకు కేసు పెట్టలేదని డీజీపీ శివధర్‌రెడ్డిని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మూడు మున్సిపాలిటీల్లో కోరం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ చైర్మన్లు గెలువకుండా కాంగ్రెస్ పార్టీ గొడవలు సృష్టించి ఎన్నికలు వాయిదా పడేలా చేసిందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్కు మెజారిటీ ఉందని ఎన్నికలు వాయిదా వేయటం ఏమిటని ప్రశ్నించారు. జహీరాబాద్, మెదక్, తొర్రూరు, క్యాతనపల్లి, జనగామ, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ఎక్కువ కౌన్సిలర్లను గెలిచినా, కాంగ్రెస్ అక్రమంగా కొన్ని చైర్మన్ పీఠాలు దక్కించుకుందని తెలిపారు. ప్రజాతీర్పు బీఆర్ఎస్ వైపు ఉన్నదని, మెదక్‌లో కొందరు గూండాలు ఇండ్ల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలను ఎత్తుకెళ్తుంటే చట్టం ఏం చేస్తుందని నిలదీశారు.
రాష్ట్రంలో చట్టం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారింది. ప్రజాస్వామ్యం పట్టపగలు ఖూనీ అవుతున్నా.. రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్‌గాంధీకి ఇక్కడ జరిగే అరాచకం, దౌర్జన్యం కనబడకపోవటం, వినపడకపోవటం విడ్డూరంగా ఉంది. సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ప్రజలు రాహుల్‌గాంధీని ఎలా నమ్ముతారు.
– హరీశ్‌రావు
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రతి అంశాన్నీ డైరీలో నోట్ చేసి పెడుతున్నామని హరీశ్‌రావు స్పష్టంచేశారు. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా, చేతుల్లోకి తీసుకున్నా, అక్రమ కేసులు పెట్టినా, దుర్మార్గంగా వ్యవహరించినా, వారిని ఎవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటనలపై అడిషనల్ డీజీ అధికారితో విచారణ జరిపించాలని డీజీపీ శివధర్‌రెడ్డిని డిమాండ్ చేశారు. చట్టం మీద ప్రజల గౌరవం సన్నగిల్లేలా పోలీసు ఉన్నతాధికారుల చర్యలు ఉన్నాయని, ఇకనైనా అలాంటివి మానుకోవాలని సూచించారు. ఏ రాజకీయ పార్టీకి అయినా చట్టం సమానంగా ఉండాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టాలని ఉన్నతాధికారులు మౌఖికంగా చెబుతున్నారని, కాగితాల మీద మాత్రం డీఎస్పీ, సీఐ, ఎస్ఐల పేర్లు ఉంటాయని తెలిపారు.
కేసులు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత అక్రమ అరెస్టులపై కిందిస్థాయి అధికారులే జవాబుదారీ అవుతారని హెచ్చరించారు. ఇప్పుడున్న ఉన్నతాధికారులు త్వరలో రిటైర్ అయిపోతారని, ఆ తర్వాత కోర్టుల్లో, చట్టం ముందు కిందిస్థాయి అధికారులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. గూండాయిజం, పోలీసురాజ్యం మీద, పోలీసు వ్యవహారశైలి మీద అసెంబ్లీలో సీరియస్ చర్చ పెడుతామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అతిగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. తమ కార్యకర్తలను రక్షించుకునేందుకు అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. అక్రమ కేసులు పెట్టించిన, పెట్టిన వారికి శిక్ష పడే వరకు పోరాడుతామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
రేవంత్ సర్కార్ వెంటనే రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయకపోతే వ్యవసాయశాఖ కమిషనరేట్‌ను ముట్టడిస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు రైతుబంధు డబ్బులు వేస్తామని లీకులు ఇచ్చాడని, ఆ తర్వాత ఊసెత్తడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు డబ్బులు వేయకపోతే బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించిన వారిలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, నాయకులు పట్నం మాణిక్యం, మల్లికార్జున్‌గౌడ్, మామిళ్ల రాజేందర్, చింతా సాయి, మందుల వరలక్ష్మి, శివరాజ్ పాటిల్, శ్రీకాంత్‌గౌడ్ తదితరులు ఉన్నారు.