Harish Rao | ఎంబీబీఎస్ సీటు సాధించిన ఓ పేదింటి ఆడబిడ్డకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అండగా నిలిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించిన పెర్క శ్రీజకు మొదటి సంవత్సరం ఫీజు కింద రూ.60 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఎంబీబీఎస్ పూర్తయ్యేవరకు ప్రతి ఏటా కాలేజీ ఫీజును తానే చెల్లిస్తానని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుతో వైద్య విద్య సీట్లు పెంచిన ఫలితమే ఇది అని తెలిపారు. వైట్ కోట్ విప్లవం సృష్టించి బడుగు, బలహీన వర్గాలను వైద్య విద్య దిశగా కేసీఆర్ బాటలు వేశారని కొనియాడారు.
“ధనిక కుటుంబాలకే ఎంబీబీఎస్ చదువు.. ఆర్థిక స్తోమత ఉన్నవారికే వైద్య విద్య.. డబ్బుంటేనే ఒంటిపై వైట్ కోట్.. ” తెలంగాణ స్వరాష్ట్రం సాకారం కాక ముందు ఈ పరిస్థితి ఉండేదని హరీశ్‌రావు అన్నారు. కానీ నేడు సీన్ రివర్స్ అయ్యిందని, ధనికుల కంటే ఎక్కువగా పేద ,బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే ఎంబిబిఎస్ సీట్లు సాధిస్తున్నారని, ఇదంతా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఫలితమేనని అర్థమవుతున్నదని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనతో పాటు వైద్య విద్య సంస్కరణలలో భాగంగా కేసీఆర్ సృష్టించిన వైట్ కోట్ విప్లవం పేద విద్యార్థుల ముఖాల్లో వెలుగులు నింపుతున్నదని పేర్కొన్నారు. ఒకప్పుడు అందని ద్రాక్ష గా మెడికల్ విద్య ఉండే నేడు అందుబాటులో వైద్య విద్యా అనే విధంగా కేసీఆర్ ఏర్పాటు చేసిన జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల, స్థానిక విద్యార్థులకు స్థానికంగా అవకాశం రావడమే అని వ్యాఖ్యానించారు.
ఇక హరీశ్‌రావు గతంలోనే సిద్దిపేటకు చెందిన ఓ గుమస్తా ఇద్దరి బిడ్డల వైద్య విద్య పూర్తి చేసే వరకు సహాయం అందించి చదివించారు.. అదేవిధంగా సిద్దిపేటకు చెందిన ముగ్గురు పేద విద్యార్థులకు నర్సింగ్ విద్య సహాయం అందించి చదివిస్తున్నారు. ఇటీవల ఓకే కుటుంబంలో నలుగురు అమ్మాయిలు ఎంబీబీస్ చదువుతున్నారు. గతంలోనే ఇద్దరు అమ్మాయిలకు సీటు వచ్చింది.. ఇద్దరు అమ్మాయిలకు ఇటీవల ఎంబీబీఎస్ లో సీటు సాధిస్తే వారికి సహాయం అందించారు.. ఇలా ఎంతో మంది పేద విద్యార్థుల చదువులకు సహాయం చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు.. నేడు దళిత కుటుంబానికి చెందిన శ్రీజ కు వైద్య విద్యకు సహాయం చేసి మరో సారి గొప్ప మనసును.. మానవత్వాన్ని చాటుకున్నారు.