సిద్దిపేట, సెప్టెంబర్ 5 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరద సహాయం చేయటానికి ఖమ్మానికి వెళ్తే దాడి చేయటమే కాకుండా.. సీఎం రేవంత్ తమ మీద ఉల్టా కేసులు పెట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఇది ప్రజాపాలన కాదని, రాక్షస పాలన అని ధ్వజమెత్తారు. సహాయం చేసేవారిపై ఎవరైనా కేసులు పెడతారా? అని నిలదీశారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని, అంతిమంగా న్యాయం, ధర్మం గెలుస్తుందని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఖమ్మం, మహబూబాబాద్ వరద బాధితులకు సరుకులు తీసుకెళ్లే మూడు వాహనాలను హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సహాయం చేయటానికి వెళ్తే దాడిచేయటం అత్యంత హేయమైన చర్య అని కాం గ్రెస్‌పై దుయ్యబట్టారు. ‘మీరే దాడి చేసి మీరే ఉల్టా కేసులు పెడుతున్నారు. అధికారం ఉన్నదని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నావు. ఇది మంచిది కాదు. సహాయం చేసేందుకు వచ్చిన వారిని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ఖమ్మంలో వరద బాధిత మహిళలు దుమ్మెత్తిపోశారు. నీతి, నిజాయతీ ఉంటే నిజంగా మీది ప్రజాపాలన అయితే ఒకసారి సమీక్ష చేసి కేసులు ఉపసంహరించుకోవాలి. పైనుంచి మీరే ప్రేరేపించి మాపై దాడి చేయించారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేదేలేదు’ అని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి మండిపడ్డారు.
అధికారంలో ఉండి కనీసం మంచినీళ్లు, అన్నం పెట్టలేకపోయారని.. ఒక హెలికాప్టర్ కూడా పంపించలేకపోయారని.. బాధితులకు రూ.10 వేలు ఏమూలకూ సరిపోవని కాంగ్రెస్ సర్కారుపై హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇండ్లు పూర్తిగా నీట మునిగిన కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దళితులు, గిరిజనులు, బలహీన, మైనారిటీ వర్గాల ప్రజలకు చేయూతనివ్వాలని చెప్పారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ, ఆస్తి నష్టం నివారించే అవకాశం ఉండేదని అన్నారు. సామాజిక బాధ్యతగా బీఆర్ఎస్ తరఫున ఖమ్మంకు సరుకులు పంపిస్తున్నామని, మరో రెండు రోజుల్లో మహబూబ్‌బాద్‌కు కూడా సరుకులు పంపిస్తామని తెలిపారు. ఇప్పటికే కేసీఆర్ పిలుపు మేర కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఒక నెల జీతాన్ని సీఎం సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులతో తొలిసారి కల్యాణలక్ష్మి చెక్కుల కోసం హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని హరీశ్‌రావు అన్నారు. గురువారం 500 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం కూడా ఇస్తామని.. నేటికీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో క్షేమంగా ఉన్న హాస్టళ్లు నేడు సంక్షోభంలో పడ్డాయని విమర్శించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 7 నెలలుగా జీతాలు రావడం లేదని చెప్పారు. కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్సు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
ఖమ్మం, మహబూబాబాద్ వరద బాధితులను ఆదుకొనేందుకు సిద్దిపేట నియోజకవర్గం నుంచి వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, బీఆర్ఎస్ నాయకులు స్వచ్ఛందంగా కొన్ని వాహనాల్లో సరుకులు పంపిస్తున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. గురువారం 200 క్వింటాళ్ల సన్న బియ్యం, 2 వేల నిత్యావసర సరుకుల కిట్లు, 500 బ్లాంకెట్లు, 2 వేల బ్రెడ్ ప్యాకెట్లు, కూరగాయలు తదితర సామగ్రిని ఖమ్మంకు పంపించామని, గురువారం, శుక్రవారం కొన్ని వాహనాలను సమకూర్చి మహబూబ్‌బాద్‌కు పంపిస్తామని తెలిపారు. ఎవరికి వారు వరద బాధితులను ఆదుకోవాలని బీఆర్ఎస్ తరఫున కోరుతున్నట్టు పేర్కొన్నారు.
ఖమ్మం, సెప్టెంబర్ 5 : ఖమ్మం వరద బాధితుల సహాయార్థం సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు పంపించిన నిత్యావసర సరుకులు గురువారం రాత్రి ఖమ్మానికి చేరాయి. సిద్దిపేట నియోజకవర్గ హరీశ్‌రావు టీం సభ్యులు.. ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సమక్షం లో అందజేశారు. వాటిని ఎంపీ రవిచంద్రతో కలిసి ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, రూర ల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బెల్లం, తెలంగా ణ ఉద్యమకారులు రామ్మూర్తి, సుబ్బారావు పరిశీలించి.. డివిజన్, రూరల్ గ్రామాల వారీగా కేటాయించారు.
వరద బాధితులకు ఇదిగో సిద్దిపేట సాయం
ఖమ్మం వరద బాధితులకు అందజేయడానికి సిద్దిపేట నుంచి నిత్యావసర సరుకుల వాహనాలను పంపుతున్న మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్ఎస్ నాయకులు
సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు పంపిన సరుకుల లారీలతో ఖమ్మంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు, పగడాల తదితరులు
ఊరుకో చెల్లి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాంతండాలో వరద ప్రభావిత బాధిత మహిళలను ఓదారుస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
ఇంతటి ఘోరమా?
మహబూబాబాద్ జిల్లా అయోధ్యలో కొట్టుకుపోయిన చెరువుకట్టను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ రవీందర్రావు
అన్నీ తడిసి ముద్దయినయ్
ఖమ్మం నగరం బొక్కలగడ్డలో తడిసిన సామాన్లను బ్యాగులో సర్దుతున్న బాధితుడు
ఇల్లంతా ఇదే రీతి
ఖమ్మం నగరంలోని మోతీనగర్‌లో ఇంటిలో తడిసిన సామాన్లు, దుస్తులను శుభ్రం చేసుకుంటున్న మహిళ
మహబూబాబాద్ జిల్లా దుబ్బతండాలో ఆకేరువాగు వరద ప్రభావంతో పొలాల్లో వేసిన ఇసుక మేటలు
బువ్వకెట్ల?
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం దుబ్బతండాలో ఇంట్లో దాచుకున్న వడ్లు మొలకెత్తాయని చూపుతున్న మహిళ
ఖమ్మంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ మాటేటి నాగేశ్వరరావును విడుదల చేయాలని త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న స్థానికులు