పాలన చేతకాక, హామీలు నెరవేర్చలేక, ప్రజా సమస్యలకు సమాధానం చెప్పలేక ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడమే కాంగ్రెస్ ఏకైక ఎజెండాగా పెట్టుకున్నది. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పకదారి పట్టించేందుకు, వరుస కుంభకోణాల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలకు నిదర్శనం. చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్‌రెడ్డి.
– హరీశ్‌రావు
ఇది ఎస్ఐటీ సిట్ కాదు.. సీఐటీ సిట్.. సీఎం ఇన్స్ట్రక్షన్ టీమ్.. విదేశాల్లో ఉన్న రేవంత్‌రెడ్డి ఫోన్ చేసి ఏది చెప్తే అది ఇకడ పోలీసులు పాటిస్తున్నరు. సిట్ స్వతంత్రంగా పని చేయడం లేదు. సీఎం కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలకే పనిచేస్తున్నది. సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టుగా ఉన్నది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నది.
-హరీశ్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం కక్షసాధింపు చర్యలకు, నీచ రాజకీయాలకు పరాకాష్ట అని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. సిట్ పేరిట జరుగుతున్నది దర్యాప్తు కాదని, ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడి అని మండిపడ్డారు. నోటీసుల వెనుక చట్టం లేదని, కేవలం రాజకీయ ప్రతీకారం, రేవంత్‌రెడ్డి అహంకారం మాత్రమే ఉన్నదని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను సిట్ పేరిట బహిరంగంగా ఉల్లంఘించారని, నోటీసులు ఇవ్వడంలో కనీస చట్టపరమైన విధానాలు కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘కేసీఆర్ ఎకడ ఉంటున్నారో ఈ రాష్ర్టానికి తెలియదా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఎర్రవెల్లి చుట్టే ఉన్నా నందినగర్ గోడలకు నోటీసులు అంటించడం మీ చౌకబారు రాజకీయానికి నిదర్శనం’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పదేండ్లు రాష్ర్టాన్ని నడిపిన ముఖ్యమంత్రికి ఇదేనా కాంగ్రెస్ పాలన ఇచ్చే మర్యాద? ’అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతపై రేవంత్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి అవమానకరమని విమర్శించారు. ‘చిల్లర, నీచబారు రాజకీయాలు, వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్‌రెడ్డి రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనం’ అని ఆదివారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు.
‘ఇది ఎస్ఐటీ సిట్ కాదు.. సీఐటీ సిట్. సీఎం ఇన్స్ట్రక్షన్ టీమ్’ అని హరీశ్ అభివర్ణించారు. విదేశాల్లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్ చేసి ఏది చెప్తే అది ఇకడ పోలీసులు పాటిస్తున్నారని విమర్శించారు. సిట్ స్వతంత్రంగా పని చేయడం లేదని, సీఎం కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల మేరకే పనిచేస్తున్నదని మండిపడ్డారు. ‘సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్‌గా మారి చట్టాన్ని ఉల్లంఘిస్తూ, రాజ్యాంగాన్ని అవనిస్తున్నది. మీరు ఇచ్చిన నోటీసులు చట్టబద్ధం కావు. మీరు అనుసరించిన విధానం రాజ్యాంగబద్ధం కాదు. అయినా సరే.. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా కేసీఆర్ దర్యాప్తునకు సహకరించిండ్రు.
అధికారమదంతో సిట్ పేరిట నువ్వు చేస్తున్న డ్రామాలు నీ వికృత వైఖరికి, నీ పాలన చేతగానితనానికి నిదర్శనం’ అని నిప్పులు చెరిగారు. ‘దర్యాప్తునకు కేసీఆర్ పూర్తిగా సహకరిస్తున్నా పోలీసులు ఎందుకు అతి చేస్తున్నట్టు? బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎకడికడ ఎందుకు అరెస్టులు చేశారు? ఎందుకు అదుపులోకి తీసుకున్నరు?’ అని నిలదీశారు. గజ్వేల్ నుంచి హైదరాబాద్ దాకా వేలాది మంది పోలీసులు మోహరించారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు, కా ర్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
‘రెండేండ్లు చేసిందేమీలేదు. చెప్పుకొనేందుకు కూడా ఏదీ లేదు. అందుకే రేవంత్‌రెడ్డి సిట్టూ.. లట్టు.. పొట్టు అంటూ టైంపాస్ చేస్తున్నడు’ అని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దర్యాప్తు పేరుతో ముందే తీర్పు రాయడం కాంగ్రెస్ రాజకీయ సంస్కృతి అని, సిట్ విచారణ పూర్తి కాకముందే మీడియాకు లీకులిస్తూ చెత్త వార్తలు రాయిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రశ్నించాలి గాని కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్తే నోటీసులు, మాట్లాడితే అరెస్టులు.. ఇదీ కాంగ్రెస్ న్యూడెమోక్రసీ మోడల్ అని మండిపడ్డారు.
‘రైతుల కష్టాలు పట్టవు. యువతకు ఉద్యోగాలివ్వరు. అవ్వా తాతలకు పింఛన్లు పెంచరు. ఆరు గ్యారెంటీలు అమలు చేయరు.. కానీ.. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నరు. కేసీఆర్‌కు నోటీసులివ్వడం ద్వారా కాంగ్రెస్ తన భయాన్ని బహిరంగంగా ప్రకటించింది. భయపడే ప్రభుత్వా లే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తయి. చరిత్ర సృష్టించిన నాయకుడిని కేసులు పెట్టి చిన్నబుచ్చగలమని అనుకోవడం కాంగ్రెస్ భ్రమ. చరిత్రను చెరిపేయలేరు. ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ పేరును తుడిచేయలేరు’ అని స్పష్టంచేశారు.