హైదరాబాద్ జూన్ 3 (నమస్తేతెలంగాణ): మాజీ మంత్రి హరీశ్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యాన ర్ల తొలగింపుపై గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. దుర్మార్గాలకు కాంగ్రెస్ పరాకాష్ఠగగా మారిందని మండిపడ్డారు. ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే అధికారులు హరీశ్‌రావు ఫ్లెక్సీలు, బ్యానర్లను చించివేశారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.
ఫొటోలను చించినంత మాత్రాన ఆయన అభిమానాన్ని, ప్రజాదరణను తగ్గించలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇలాంటి పైశాచిక పోకడలు, దిగజారుడు రాజకీయాలను గతంలో ఏనాడూ చూడలేదన్నారు. ఫొటోలను చూసే ఇంతగా భయపడిపోతే ఎలా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హరీశ్‌రావు ఫొటో లు, ఫ్లెక్సీలను రాత్రికిరాత్రే తొలగించడాన్ని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే ఫ్లెక్సీలను తీసివేశారని మంగళవారం ఎక్స్ వేదికగా ఆరోపించారు.
మెట్రో పిల్లర్లు, కూడళ్లలో నెలల తరబడి ఉన్న సీఎం, పీసీసీ చీఫ్ ఫొటో లు తొలగించకుండా హరీశ్‌రావు ఫ్లెక్సీలను మాత్రం తొలగించడం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమన్నారు. ఇంతటి దిగజారుడు రాజకీయాలను ఏనాడు చూడలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్కారు అలసత్వం, రేవంత్ నిర్లక్ష్యాన్ని అడుగడుగునా నిలదీస్తున్నారనే దుగ్ధతోనే దుర్మార్గాలకు దిగుతున్నదని విరుచుకుపడ్డారు.
ఫ్లెక్సీలు చించినంత మాత్రాన హరీశ్‌రావుపై అభిమానం ఇసుమంత కూడా తగ్గదనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రజల మన్ననలు పొందిన నాయకుడిని చిన్నగా చూపాలనుకోవడం వారి అవివేకానికి నిదర్శమన్నారు. ‘అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారులు తస్మాత్ జాగ్రత్త’ అని హెచ్చరించారు. మూడేండ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరేనని, ఇలాంటి దుశ్చర్యలకు తగిన సమాధానం చెప్తామని హెచ్చరించారు.
‘బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు చూస్తే కాంగ్రెస్‌లో వణుకుపుడుతున్నది. అందుకే రాత్రికిరాత్రే హరీశ్‌రావు జన్మదిన ఫ్లెక్సీలను తొలగించారు’ అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని ఆరోపించారు. అధికారుల అత్యుత్సాహం సరికాదని, భవిష్యత్తులో వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
మందమర్రి, జూన్ 3 : మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలో ఫ్లెక్సీల వివాదం తారాస్థాయికి చేరింది. పాతబస్టాండ్ ఏరియాలో బీఆర్ఎస్ నాయకులు పార్టీ రజతోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మంగళవారం తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది పూనుకున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఫ్లెక్సీల తొలగింపును అడ్డుకున్నారు. మున్సిపల్ సిబ్బంది గో బ్యాక్, కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వద్ద నిరసన తెలిపారు. వినతిపత్రం తీసుకోవాలని సిబ్బందిని కోరగా వారు నిరాకరించారు. దీంతో వినతి పత్రాన్ని కార్యాలయ గుమ్మానికి సమర్పించారు.