భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 4 (నమస్తే తెలంగాణ)/బూర్గంపహాడ్ : పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ముప్పు ఉంటుందని పేర్కొంటూ బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) బృందానికి లేఖ రాశారు. ఈ లేఖను గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో పీపీఏ బృందం సభ్యులకు భద్రాచలం, పినపాక నియోజకవర్గాల బీఆర్ఎస్ నాయకులు అందజేశారు.
కాగా పోలవరం బ్యాక్‌వాటర్ బాధితులకు న్యాయం చేయాలని, ప్రభావిత గ్రామాల రక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలని పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు వేర్వేరుగా పీపీఏ బృందాన్ని సారపాక ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో కలిసి విన్నవించారు. కాగా బూర్గంపహాడ్ సర్పంచ్ మందా నాగరాజు ఆధ్వర్యంలో అఖిలపక్షం నాయకులు సైతం పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం సభ్యులకు వినతిపత్రం సమర్పించారు. పోలవరం బ్యాక్‌వాటర్‌తో పొంచి ఉన్న ముప్పును వారు అధికారులకు వివరించారు.