Harish Rao | సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మెదక్ రోడ్డులో రోడ్డు వెంట ఉన్న చెట్లను అకారణంగా నరికివేస్తున్న విద్యుత్ సిబ్బందిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మందలించారు. అటుగా వెళ్తున్న హరీశ్‌రావుకు చెట్లను నరికివేస్తుండడాన్ని గమనించారు. దాంతో సిబ్బంది వద్దకు వెళ్లి చెట్లను ఎందుకు నరికివేస్తున్నారని ప్రశ్నించారు. కరెంట్ తీగలకు చెట్లు అడ్డంగా ఉన్నాయని చెప్పారు. దాంతో ఆయన స్పందిస్తూ.. వైర్లకు అడ్డంగా ఉన్నాయని చెట్లను పూర్తిగా నరికివేయడం సరికాదని.. లైన్లకు అడ్డం వచ్చిన కొమ్మలను మాత్రమే తొలగించాలన్నారు. పూర్తిగా చెట్లను నరికివేస్తూ పర్యావరణానికి ఎందుకు నష్టం చేస్తున్నారంటూ మందలించారు.
20 ఏళ్లుగా సిద్దిపేటలో మొక్కలను పిల్లల్లా కాపాడుకుంటూ వచ్చామని.. ఇక్కడి ప్రజలకు చెట్లతో ఉండే అనుబంధాన్ని తొలగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందు చూపులేకుండా, పర్యవేక్షణ లేకుండా గుడ్డిగా కార్మికులను పెట్టి చెట్లను తొలగించడం అధికారుల నిర్లక్ష్యమని అన్నారు. చెట్లను తొలగించడం సులువైన పని కానీ.. వాటిని పెంచడానికి సిద్దిపేట ప్రజలకు 20 సంవత్సరాలు పట్టిందని వాటిని ఎంతో ప్రేమగా పెంచామని అన్నారు. పర్యావరణానికి ఎంతో ఉపయోగపడే చెట్లను విచక్షణారహితంగా తొలగించడం దుర్మార్గమని, తొలగించాలని ఆదేశించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.