హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌తో రహస్యంగా సమావేశమయ్యారన్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. పీసీసీ అధ్యక్ష హోదాలో ఉండి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సూటిగా ఎదుర్కొనే ధైర్యంలేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. విలువలు విస్మరించి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బాటలోనే నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్ట కాల్చి మీద వేసినంత మాత్రానా అబద్దాలు, నిజం అయిపోవన్నారు. ఇలాంటి ఆరోపణలు మానుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలుపై దృష్టిపెట్టాలని చురకలంటించారు.
‘పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న చిల్లర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. విలువలకు తిలోదకాలు ఇచ్చి, రేవంత్ రెడ్డి బాటలోనే మీరూ నడుస్తున్నారు. బట్ట కాల్చి మీద వేసినంత మాత్రానా అబద్దాలు, నిజం అయిపోవు.
పెళ్ళిలోనో, చావు లోనో కలిసిన సందర్భాలే తప్ప మీరు ఆరోపించినట్లు ఇతర పార్టీ నాయకులను గానీ, మా పార్టీ నుంచి వెళ్లిన నాయకులను గాని ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసింది లేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప, మీ లాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడను. ఇలాంటి ఆరోపణలు మానుకొని, స్థాయికి తగ్గట్లు వ్యవహరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు పై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్‌కు సూచిస్తున్నాం.’ అంటూ హరీశ్‌రావు ట్వీట్ చేశారు.