Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అసెంబ్లీలో మండిపడ్డారు. కాళేశ్వరం రిపోర్ట్‌పై చర్చ సమయంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం రిపోర్ట్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘ఇవాళ ఒక విషయం అర్థమైంది. ఈ ప్రభుత్వం ఇంత ఆదరబాదరగా.. ఆదివారంనాడు అసెంబ్లీ పెట్టి కాళేశ్వరం రిపోర్ట్‌ను సభలో పెట్టడమంటేనే వీళ్ల బురద రాజకీయం అర్థమవుతుంది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం.. 8బీ, 8సీ ఇవ్వకుండా.. నిబంధనలు అనుసరించలేదని మేం కోర్టుకు వెళ్లాం. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇందిరాగాంధీ, ఎల్కే అద్వానీ కోర్టుకు వెళ్లారు. ఇందిర గాంధీ వెళ్తే ఒప్పు.. మేం వెళ్తే తప్ప? ఎల్కే అద్వానీ వెళ్తే ఒప్పు.. మేం వెళ్తే తప్పా? నేను అన్నింటికి గురించి వివరస్తా. మీరు వర్రీ కాకండి. ఈ విషయం కోర్టులో ఉంది. మూడు వారాల్లో కౌంటర్ వేస్తమని ప్రభుత్వం చెప్పింది’ అన్నారు.
‘మేం ఎక్కడ సుప్రీంకోర్టుకు వెళ్తమో.. ఎక్కడ ఈ కమిషన్ రిపోర్ట్ క్వాష్ అవుతుందో.. ఇందులో సత్తా లేదు.. ఇందులో నియమ నిబంధనలు పాటించలేదనే విషయం ముఖ్యమంత్రికి బాగా అర్థమైంది. అందుకే సీఎం సుప్రీంలో కేవిట్ వేశారు. కోర్టులో మళ్లీ రేపేమాపో డిస్కషన్‌కు వస్తుంది కదా? ఈలోపు స్టే వస్తే క్వాష్ అయిపోతుందేమోనని ఆదరబాదరాగా.. ఆదివారంనాడు రిపోర్ట్ పెట్టారంటేనే మీ కుట్ర ఏంటో స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. విషయాలన్నీ స్పష్టంగా ఉన్నాయి. రాజకీయంగా మీరంతా చేస్తున్న కథ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రిలిమినరీ రిపోర్ట్. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మధ్యంతర నివేదిక. మా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే ఫైనల్ రిపోర్ట్. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రేపే మాపో వస్తుంది కనుక పీసీ ఘోష్ రిపోర్ట్. ఇవన్నీ రాజకీయ డ్రామాలే. వీళ్లు సర్కస్ నడుపుతున్నరా? సర్కర్ నడుపుతున్నారా? నాకైతే తెలియదు’ అని పేర్కొన్నారు.
‘కమిషన్ రిపోర్ట్ గురించి చర్చించే ముందు సహజ న్యాయానికి, ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి మౌలిక అంశాలపై ముందుగా మాట్లాడదలచుకున్నాను. పీసీ ఘోష్ కమిషన్ విచారణ చట్టబద్ధంగా, విధివిధానాలను పాటిస్తూ జరిగిందా? లేదా? అనేది చర్చించాల్సిన అవసరం ఉంది. నేను చెబుతున్న విషయాలు సాంకేతిక పరమైనవి కావు. సహజ న్యాయానికి, ప్రజాస్వామ్యానికి సంబంధించిన మౌలిక అంశాలు. రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాట్లాడుతున్నాను. చర్చ వ్యక్తుల గురించి కాదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం నిష్పాక్షికంగా విచారణ జరిగిందా? లేదా అనే దాని గురించి మాట్లాడుతున్నా. అలా జరగని పక్షంలో ఆ విచారణకు విలువ ఉండదు.. ఆ విచారణ రిపోర్ట్ చిత్తుకాగితంతో సమానమని గతంలో సుప్రీంకోర్టులు, హైకోర్టులు అనేక సందర్భాల్లో చెప్పాయి’ అని గుర్తు చేశారు.
‘విచారణ కమిషన్‌ను కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 కింద వేశారు. ఇది ఏందీ? గత ప్రభుత్వాలపై, సంబంధిత అంశాలపై విచారణ చేసే హక్కు ఎంత ఉందో.. విచారణ ఎదుర్కొనే పౌరులు, అధికారులు, నాయకులు ఎవరైనా సరే తమను తాము రక్షించుకునేందుకు 1952 ఎంక్వైరీ యాక్ట్ స్పష్టమైన హక్కులు, రక్షణల్ని కల్పించడం జరిగింది. సెక్షన్ 5 ప్రకారం విచారణ కమిషన్‌కు సాక్షులను పిలిచే అధికారం ఉంది. విచారణతో ఎవరి ప్రతిష్టకైతే భంగం కలుగుతుందో వారు తమ ప్రతివాదనలు వినిపించేందుకు అదే చట్టంలో సెక్షన్ 8బీ ప్రకారం నోటీసులు ఇవ్వాలి. వారిని వారి డిఫెండ్ చేసుకోవడానికి యాక్ట్‌లో స్పష్టంగా చెప్పారు. పార్లమెంట్ యాక్ట్‌లో 8బీ, 8సీ గురించి చదివి వినిపించమంటే వినిపిస్తా. ఒక సభ్యుడిపై ఆరోపణలు చేయాలనుకుంటే ఆ సభ్యుడికి ఏ విషయంలో ఆరోపణలు చేస్తున్నరు? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చి 8బీ, 8సీ కింద నోటీసులు ఇస్తేనే అది చెల్లుతుంది. లేకపోతే చెల్లదు’ అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.