మద్దతు ధరకు వడ్లు కొనక రైతులు తీవ్రంగా నష్టపోతున్నరు. 1900కే అమ్ముకునే దుస్థితి వచ్చింది. అన్ని వడ్లకు ఎంఎస్పీ, బోనస్ ఇస్తున్నమని మహారాష్ట్రకు పోయి రేవంత్ చెప్పిండు. తెలంగాణలో రోడ్ల మీదున్న వరి కుప్పలే ఆయన అసమర్థత పాలనకు సాక్ష్యం.
-హరీశ్‌రావు
Harish Rao | హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసగించింది చాలక మహారాష్ట్రలో కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాల చిట్టా విప్పారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రజలను కూడా మభ్యపెడుతున్నారని భగ్గుమన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చారని, దాదాపు ఏడాది (335 రోజులు) అవుతున్నా ఒక్కటీ సరిగా దిక్కులేదని మండిపడ్డారు. ‘గెలిచేదాకా గ్యారెంటీలు.. గెలిచిన తర్వాత గ్యారెంటీలు గ్యారేజీకి పోయినయ్’ అని దెప్పిపొడిచారు. రాష్ట్రంలో రోడ్ల మీద కనిపిస్తున్న వడ్ల కుప్పలే రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. మహారాష్ట్రకు డబ్బుల మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ వడ్లు కొనడంలో రేవంత్‌రెడ్డికి లేదని చురకలంటించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు కల్పించినట్టు, రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసినట్టు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘అభయహస్తంలో మొదటి హామీ మహిళకు రూ.2500 ఒక్కరికైనా ఇచ్చారా? మొదటి హామీకే దికేలేదుగాని, మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతలు కోతలు కోస్తున్నరు’ అని దుయ్యబట్టారు. ఏ హామీలు అమలు చేశారో బహిరంగంగా చర్చిద్దామని సవాల్ చేశారు. తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణతోపాటు మహారాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతోనే తాను ప్రెస్‌మీట్ పెట్టినట్టు పేర్కొన్నారు.
మాఫీపై మాట తప్పామని చెప్పాలి
‘అధికారంలోకి రాగానే తొలి సంతకం ఏకకాలంలో రుణమాఫీ అన్నరు.. 2023 డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పినమని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలి. 42 లక్షల మందికి రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని.. రూ.17 వేల కోట్లే రుణమాఫీ చేశారు. రుణమాఫీ చేశామని అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసగిస్తున్నది. రుణమాఫీ 7 నెలలు ఆలస్యం చేసి రైతులపై వడ్డీల భారం మోపింది. బ్యాంకులు ముకుపిండి రైతుల నుంచి వడ్డీలు వసూలు చేసినయ్. రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ప్రజలకు అబద్ధాలు కాదు.. తెలంగాణలో ప్రజలకు చేసిన మోసాన్ని చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
రైతుభరోసా ఇచ్చారా?
కేసీఆర్ ఎకరానికి రూ.10 వేలు రైతుబంధు పంటకాలానికి ముందే ఇచ్చేవారని హరీశ్ గుర్తుచేశారు. రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి, రాష్ట్రంలో ఒక్క రైతుకైనా, ఒక్క ఎకరాకైనా ఇచ్చామని చెప్పగలరా? అని నిలదీశారు. ‘రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి ఇచ్చిండ్రా? రైతు కూలీలకు ఇచ్చిన హామీ నెరవేర్చిండ్రా?, వరి పంటకు మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇచ్చిండ్రా? వడ్లను ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు తకువ రేటుకు దళారులకు అమ్ముకునే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో ఎకడైనా బోనస్ వస్తున్నదా? రేవంత్‌రెడ్డే చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
ఒక ఇల్లయినా కట్టినవా?
‘11 నెలల్లో ఒక ఇల్లు కూడా కట్టలేదు కానీ.. వందల ఇండ్లు కూలిగొట్టినవ్.. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో ఇండ్లు కూలగొట్టి ఒక్కటి కూడా కట్టలేదని మహారాష్ట్రలో నిజం చెప్పాలి. రూ.4000 ఫించన్ ఇస్తానని వృద్ధులను మోసం చేసినవ్.ఒకొకరికి రూ.26 వేల పెన్షన్ కాంగ్రెస్ బాకీ పడింది. 41 లక్షల మంది పింఛనుదారులకు ప్రభుత్వం బాకీ ఉన్నది. ఇవన్నీ అమలు చేయలేదని మహారాష్ట్ర ప్రజలకు రేవంత్ చెప్తే బాగుండేది’ అని హరీశ్ ఎద్దేవా చేశారు.
పది నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఎట్ల ఇచ్చినవ్?
తెలంగాణలో పది నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలో పచ్చి అబద్ధాలు చెప్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను మీరు ఇచ్చినట్టు మహారాష్ట్రలో చెప్పుకోవడం సిగ్గుచేటు. నోటిఫికేషన్ ఇచ్చింది లేదు.. ఎగ్జామ్ పెట్టింది లేదు మరి 50 వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారో చెప్పాలి. అశోక్‌నగర్ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులపై లాఠీచార్జి చేయించిన ఘనత, యువకుల వీపులు పగులగొట్టించిన ఘనత రేవంత్‌రెడ్డిది. అర్ధరాత్రి ఆడపిల్లలను అరెస్ట్ చేయించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఉద్యోగాల భర్తీలో వైఫల్యంపై మహారాష్ట్రలో ఎందుకు చెప్పలేదు? జీవో 29 పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసిండ్రు. ప్రశ్నించిన నిరుద్యోగులను పోలీసులతో అణచివేసే ప్రయత్నం చేసిండ్రు. నిరుద్యోగత యువతకు ఇస్తానన్న రూ.4 వేల భృతి ఏమైంది? ఇక్కడ చేసింది చాలదన్నట్టు మహారాష్ట్ర యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తుండ్రు’ అని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎగవేతలే కాంగ్రెస్ నైజం
రాష్ట్రంలో ఎకడా వడ్లు కొనే పరిస్థితి లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. క్వింటాల్ వడ్లు రూ.1900కే అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని వర్గాలవారిని రేవంత్ మోసం చేశాడని, ఎన్నికల హామీలు ఎగవేయటమే కాంగ్రెస్ నైజంగా మారిందని దుయ్యబట్టారు.
మాటిచ్చిన గాంధీలు ఏరీ?
ఎన్నికల ముందు ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ విసిరిన గ్యారెంటీల వలలో చిక్కుకొని ఓటర్లు విలవిలలాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కానిస్టేబుళ్లు కూడా తమ హక్కుల కోసం రోడ్ల మీదికి వచ్చే పరిస్థితి దాపురించిందని వాపోయారు. హాస్టళ్లలో చదివే విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌తో దవాఖానల పాలవుతున్నారని మండిపడ్డారు. ‘సోనియమ్మ మాట.. రాహుల్‌గాంధీ మాట, ప్రియాంక గాంధీ మాట అంటూ హామీలిచ్చారు. ఇప్పుడా గాంధీలు ఎకడికి పోయారో తెల్వది. కాంగ్రెస్ చెప్పేదానికి.. చేసేదానికి పొంతనేలేదు. మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలిచ్చామని అబద్ధాలు చెప్తున్నరు. వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఇప్పటి వరకు జీవోనే ఇవ్వలేదు. వడ్డీలేని రుణం రూ.5 లక్షల వరకే ఉన్నది. ప్రతి అప్పునకు వడ్డీ లేని రుణం వర్తిస్తుందో లేదో చెప్పాలి. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. రైతులకు ఉచితంగా నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్. ఇది కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకొనే ప్రయత్నం చేస్తున్నరు. నిజాలు చెప్తున్న అని మహారాష్ట్ర ప్రజలకు రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పిండు’ అని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
వాస్తవాలు చెప్పటం మా బాధ్యత
సీఎం రేవంత్‌రెడ్డి నోరు విప్పితే అన్నీ అబద్ధాలేనని హరీశ్‌రావు మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికలకు రేవంతే డబ్బులు సమకూర్చుతున్నారని, పాలన గాలికి వదిలి.. మంత్రులు గాలిమోటర్లలో ఇతర రాష్ర్టాలకు చెక్కర్లు కొడుతున్నారని, తెలంగాణ డబ్బును రేవంత్‌రెడ్డి ఇతర రాష్ర్టాలకు పంపుతున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో తాము ఏ పార్టీకి అనుకూలంగానో.. వ్యతిరేకంగా ప్రచారం చేయడం లేదని, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై వాస్తవాలు చెప్పడమే తమ బాధ్యత అని స్పష్టంచేశారు. మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్, మాణిక్‌రావు, నాయకులు రూప్సింగ్, నగేశ్ పాల్గొన్నారు.
గప్పాలు కొట్టడం కాదు.. ధాన్యం కొనండి
తెలంగాణలో మద్దతు ధరతోపాటు 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు మహారాష్ట్రలో గప్పాలు కొట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. ముందుగా ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతుల బాధలు చూడాలని హరీశ్‌రావు హితవు పలికారు. తెలంగాణ రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆదివారం ఎక్స్‌వేదికగా సూచించారు. ‘మభ్యపెట్టి, అబద్ధాలు చెప్పి, తిమ్మిని బమ్మిని చేసి అధికారంలోకి రావడం కాదు రేవంత్‌రెడ్డి గారూ.. రైతులు రోడ్డెకకుండా ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ధరపై 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలి’ అని డిమాండ్ చేశారు. రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాలు చేస్తున్న ఫొటోలను ఆయన ట్వీట్‌కు జతచేశారు.
హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో ఇండ్లు కూలగొట్టినవు.. కానీ, ఒక ఇల్లయినా కట్టినవా రేవంత్? 11 నెలల్లో ఒక ఇల్లు కూడా కట్టలేదు కానీ.. వందల ఇండ్లు కూలగొట్టిన అని మహారాష్ట్రలో నిజం చెప్పాల్సి ఉండె. ఒకరికైనా 5 లక్షల భరోసా కార్డు ఇచ్చినవా? ఫీజు రీయింబర్స్మెంట్ బంద్ పెట్టిన ఘనత నీది. విద్యార్థులు, నిరుద్యోగులను రోడ్డు మీదికి ఈడ్చినవ్.
-హరీశ్‌రావు
కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను నువ్విచ్చినట్టు మహారాష్ట్రలో చెప్పుకోవడం సిగ్గుచేటు. 2 లక్షల ఉద్యోగాలిస్తనని చెప్పి మోసం చేసిన అని మహారాష్ట్ర ప్రజలకు నిజం చెప్పేది ఉండె. నోటిఫికేషన్ ఇచ్చింది లేదు.. ఎగ్జామ్ పెట్టింది లేదు మరి 50వేల ఉద్యోగాలు ఎట్ల ఇచ్చిండ్రో చెప్పాలి.
– హరీశ్‌రావు
ఏ హామీలు అమలు చేసిండ్రో.. ఎకడ చర్చిద్దామో చెప్పండి.. ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు మేం సిద్ధం.. అభయహస్తంలో మొదటి హామీ మహిళకు రూ.2500 దికులేదు. ఒకో మహిళకు రూ.27,500 ప్రభుత్వం బాకీ పడ్డది. రేవంత్ మాత్రం చెప్పినవన్నీ చేసినట్టు గోబెల్స్ ప్రచారం చేస్తున్నడు.
– హరీశ్‌రావు
ఎన్నికల ముందు ఓట్ల కోసం గ్యారెంటీల వల విసిరిండ్రు.. గెలిచాక కాంగ్రెస్ పార్టీ విసిరిన వలలో చిక్కుకొని ఓటర్లు విలవిలలాడుతున్నరు. అన్నివర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది.
– హరీశ్‌రావు