హైదరాబాద్, మార్చి 25(నమస్తేతెలంగాణ): రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తా రు. బుధవారం అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందంటూ నిప్పులు చెరిగారు. మరణించిన, శాశ్వత వైకల్యం పొందిన గీతకార్మికుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా మొం డిచెయ్యి చూపిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి ఏటా 16 శాతం గ్రోత్ వస్తే.. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2024-25లో 6శాతం, 2025-26లో 3శాతానికి పడిపోయిందని తెలిపారు. ప్రస్తుతం బడ్జెట్లో 84,400 కోట్లు ప్రతిపాదిస్తే కేంద్రం ట్యాక్స్ తగ్గించిందని.. అంతర్జాతీయ పరిణామాల ను అంచనా వేయకుండా ఏవిధంగా లక్ష్యం చేరుకుంటారో మంత్రి సమాధానం చెప్పాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎైక్సెజ్ శాఖలో 2024-25కు సంబంధించి ప్రభుత్వానికి రూ.34,600 కోట్ల ఆదాయం వస్తే ప్రస్తుతం 46,941కోట్లు ప్రతిపాదించారని, ఒక్క ఏడాదే రూ.12,338 కోట్ల ఆదాయం ఎలా పెరుగుతుందో చెప్పాలని నిలదీశారు. కనీసం 25వేల కోట్ల మద్యం అమ్మకాలు పెరిగితేనే సాధ్యమవుతుందని, మరి అంత ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పీ కార్పొరేషన్‌కు రూ.5,403 కో ట్లు కేటాయించి కేవలం రూ. 74కోట్లే ఖర్చు చేశారని తెలిపారు. సంత్‌సేవాలాల్, ఏకలవ్య, కుమ్రంభీం కార్పొరేషన్లకు కనీసం 3 రూపాయలు ఇచ్చారా? అని ప్రశ్నించారు.
రుణమాఫీపై తప్పుడు లెక్కలు
గవర్నర్ ప్రసంగంలో రూ.20,619 కోట్ల రుణమాఫీ చేశామని చెబితే, మంత్రి మాత్రం రూ.20,157కోట్లు చేశామని చెప్పడమేమిటని హరీశ్‌రావు ప్రశ్నించారు. 20వేల లబ్ధిదారుల సంఖ్య సైతం ఇలానే ఉన్నదని వివరించారు. మరో వైపు ఆర్థిక శాఖ మంత్రి రూ.31వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారని వెల్లడించారు. రెండు బడ్జెట్లలో క్రాప్ ఇన్సూరెన్స్‌కు రూ. 1,300 కోట్లు పెట్టినా.. ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని అన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖకు 2025-26 బడ్జెట్లో 2,800 కోట్లు బడ్జెట్ పెడితే అందులో సగం కూడా విడుదల చేయడం లేదని తెలిపారు. మైనార్టీ స్కా లర్షిప్లకు రూ. 120 కోట్ల బడ్జెట్ పెట్టి.. కోటి మాత్రమే విడుదల చేసిందన్నారు.
అజార్ పేరును కాంగ్రెస్ ఖరాబ్ చేస్తాంది!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పోరాటం వల్లే అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చిందని చెప్పారు. క్రికెటర్‌గా దేశ ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఆయన పేరును కాంగ్రెస్ ఖరాబ్ చేస్తున్నదని ఫైరయ్యారు.