Harish Rao | చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా? అంటూ రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ప్రశ్నించారు. వసతిగృహాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న తమకు జనవరి నుంచి జూలై వరకు వేతనాలు రావడం లేదని హరీశ్‌రావుకు ఉద్యోగులు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఇంటి అద్దెలు చెల్లించడం కూడా భారంగా మారిందని, పీఎఫ్ డబ్బులు సైతం జమచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు ఈ చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా? అంటూ నిలదీశారు. తక్షణమే ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలకు పరిష్కారం చూపాలని, ఏడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.