రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాదర్గుల్ భూములు ఇప్పుడు బిగ్ బ్రదర్స్ హస్తగతమైనట్టు తెలుస్తున్నది. దీంతో స్థానికంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వంలోని నంబర్-2 మంత్రి అనేక కంపెనీల రూపంలో ఆ భూముల్లో పాగా వేయలానుకున్నా తొలుత రైతాంగం అడ్డుకున్నది. దశాబ్దాలుగా సాగు చేసుకున్న ఈ భూములు తమవేనంటూ రైతుల నిరసనలు మిన్నంటిన చోట.. ఇప్పుడు మౌనం రాజ్యమేలుతున్నది.
వారందరినీ అధికార, ధన బలం తో రాజీకి తెచ్చేలా ‘బిగ్’ అనుచరగణం ప్రయత్నించింది. చేతికి చిక్కని వారిని నయానో.. భయానో దారిలోకి తెచ్చుకున్నట్టు తెలుస్తున్నది. మొత్తంగా సర్వే నంబర్ 613లోని సుమారు 274 ఎకరాల భూమంతా ఇప్పుడు పూర్తిగా కార్పొరేట్ కంపెనీల వశమైంది. కానీ, ఈ క్షణానికీ ఆ భూములు రెవెన్యూ రికార్డుల్లో 22-ఏ నిషేధిత జాబితాలో రాష్ట్ర ప్రభుత్వ భూమిగానే ఉన్నది.మరోవైపు హైడ్రా సిబ్బంది, అధికార యంత్రాంగం ఆ దిక్కు చూసేందుకు దడుసుకుంటున్నది.
స్పెషల్ టాస్క్బ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం (గతంలో సరూర్‌నగర్ మండలం)లోని సర్వే నంబర్ 613లో (పాత సర్వేనంబరు 119) 373.22 ఎకరాల భూమి కథ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికీ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్నా.. ప్రైవేట్ కంపెనీ స్వాధీనంలోకి వెళ్లిపోయాయి. అయినా ప్రశ్నించే నాథు డే కరువయ్యాడు. ఆ భూములను రక్షించే అధికారులు కనిపించకుండాపోయారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వాటిని ప్రైవేట్ భూములని చెప్పారని స్వయానా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాకు చెప్పారు.
కానీ అదే కలెక్టర్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు రాసిన నిషేధిత జాబితాల్లో 613 (119)లోని 373.22 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వ భూములుగా పొందుపరిచారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవి ప్రభుత్వ భూములే.. కానీ గతంలోనే ప్రైవేట్ కంపెనీలు వాటి చుట్టూ రేకులు వేశాయని చెప్పుకొస్తారు. ‘రేకులు ఎప్పుడు వేస్తే ఏమిటి? ప్రభుత్వ భూము ల్ని స్వాధీనం చేసుకోవచ్చుకదా?’ అనే ప్రశ్నకు మాత్రం ఏ ఒక్కరూ సమాధానం చెప్పడం లేదు. తెరవెనుక ప్రైవేట్ వ్యక్తులు నోట్ల కట్టలతో అమాయక రైతుల నోళ్లు మూయించి, ఆ భూములను రియల్ మార్కె ట్లో పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని సర్వే నంబర్ 613లో (పాత సర్వే నంబర్ 119) ఉన్న 373.22 ఎకరాలు ఖాస్రా పహాణీలో దస్తగర్దన్ భూమిగా నమోదై ఉన్నది. పట్టాదారు కాలమ్‌లో శివరాజ్ ఇలాకాగా నమోదు చేశారు. ఆ తర్వాత 1961-62, 1963-64, 1965-66, 1972-72ల్లో 355.12 ఎకరాలు ప్రభుత్వ భూమి (సర్కారి)గా నమోదవుతున్నాయి. భూ రికార్డుల నవీకరణ (ఎల్‌ఆర్‌యూపీ)లో 373.22 ఎకరాలు ‘కంచ సర్కారి’గా నమోదు చేశారు. దశాబ్దాలుగా రక్షిత కౌలుదారులు అందులో సాగుచేసుకుంటున్నారు. రూ.కోట్లు విలువ చేసే ఈ భూములను కొట్టేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో ఓ పత్రిక అధినేత, మాజీ ఎంపీ ప్రయత్నించారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, వ్యవసాయం మొదలు పెట్టారు. దీంతో రైతులు 2007లో తిరగబడి పెద్ద ఎత్తున ఆ ఫాంహౌజ్‌పై దాడిచేసి, నిర్మాణాలను ధ్వంసం చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఈ భూములను ఏపీఐఐసీకి అప్పగించింది.
ఆ తర్వాత రైతులు వ్యవసాయం కొనసాగించారు. అయితే శివరాజ్ వారసులు 2006లో తమకు ఈ భూములను అమ్మారంటూ మూడు కంపెనీలు 50 ఎకరాల చొప్పున 150 ఎకరాలు క్లెయిమ్ చేశాయి. మ్యుటేషన్, నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేయగా, 2019లో ఆర్డీవో తిరస్కరించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం సైతం ఆర్డీవోను సమర్థించింది. దీంతో ఆయా కంపెనీలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. అది ప్రభుత్వ భూమి అని, ఇనాం భూములు రద్దయిన తర్వాత అవి సర్కారుకు సంక్రమించాయని, వారి వాదనలు తప్పు అని ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు స్పష్టం చేశాయి. దీనిపై సుప్రీంకోర్టులో ఇప్పటికీ న్యా య వివాదం కొనసాగుతున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పెద్దల కన్ను ఈ భూములపై పడింది. 3 కంపెనీల నుంచి డెవలప్మెంట్ కోసం జీపీఏ చేసుకున్నామంటూ ఏక్యూ స్కేర్ అనే సంస్థ రంగంలోకి దిగింది. భూమి చుట్టూ ప్రహరీ నిర్మించింది. ఆ భూములపై ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ డా క్యుమెంట్లు తప్ప ఎలాంటి ఆధారాలు లేవు. పైగా శివరాజ్ బహదూర్ వారసుల్లోనూ స్పష్టత లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ, ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అడ్డం పెట్టుకొని ఏక్యూ స్కేర్ డెవలపర్స్ అనే కంపెనీ భూమిని తన ఆధీనంలోకి తీసుకున్నది.
దశాబ్దాలుగా అందులో సాగు చేసుకుంటున్న రైతుల్లో కొందరికి ఎకరాకు రూ.5 లక్షల చొప్పున ఇచ్చి అనధికారిక ఒప్పందాలు చేసుకున్నది. ఆపై కోహినూర్, మేఘా ఇన్ఫ్రా, రాఘవ ఇన్ఫ్రా తదితర అనేక బోర్డులు తెరపైకొచ్చాయి. అప్పుడే కొందరు రైతులు కంపెనీ ఇచ్చే డబ్బులకు అంగీకరించకుండా భూమి కావాలని పోరాడారు. అయినా బౌన్సర్లు, పోలీసుల సహకారంతో వారిని భూముల్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత ‘నమస్తే తెలంగాణ’ ఈ భూ దందాను వెలుగులోకి తీసుకురావడంతో రైతులు చైతన్యవంతంగా పోరాడారు. బీఆర్ఎస్ అండతో తమ భూముల్లోకి ప్రవేశించారు.
రెండు దశాబ్దాల కిందట ఈ భూముల్లో పాగా వేసిన ఓ మాజీ ఎంపీని తమ చైతన్యంతో పరుగులు పెట్టించిన నాదర్గుల్ రైతులు ఇప్పుడు ఈ భూ దందా సమయంలో మాత్రం చెల్లాచెదురయ్యారు. కొన్ని రోజులుగా బిగ్ బ్రదర్స్ అనుచరులంటూ కొందరు గ్రామంలోకి వచ్చారని, రాజీకి రాని రైతులను బెదిరింపులకు గురిచేసి, వారిని దారిలోకి తీసుకొచ్చినట్టు తెలిసింది. గతంలో ఎకరాకు రూ.5 లక్షలు ఇవ్వగా, ఇప్పుడు ఎకరాకు రూ.30 లక్షలు ఇచ్చి వారితో రాజీ కుదుర్చుకున్నట్టు సమాచారం. ఇందుకు ఒప్పుకోని పలువురు రైతులను బెదిరించినట్టు ప్రచారం. సదరు రైతులు ఈ వివరాలు చెప్పేందుకు సైతం వణికిపోతున్నారంటే బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
నాదర్గుల్ గ్రామంలో ఇప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోయింది. దశాబ్దాలుగా సాగు చేసుకున్న భూములు తమవేనంటూ రైతుల నిరసనలు మిన్నంటిన చోట.. ఇప్పుడు మౌనం రాజ్యమేలుతున్నది. గతంలో నిరసనలు తెలిపిన రైతులు మిన్నకుండిపోయారు. ప్రభుత్వ పెద్దలకు చెందిన ప్రైవేట్ సైన్యాన్ని ఎదురించి, ప్రైవేట్ కంపెనీల రేకుల ప్రహరీని దాటుకొని, తన భూమిలో సాగు చేసుకుంటూ డెయిరీ నిర్వహించిన రైతు యాదయ్య కూడా ఇప్పుడు తట్టాబుట్టా సర్దుకొని ఆ భూముల్లో నుంచి బయటికొచ్చారు. మొత్తంగా సర్వే నంబర్ 613లోని సుమారు 274 ఎకరాలు ఇప్పుడు పూర్తిగా కార్పొరేట్ కంపెనీల చేతుల్లో బందీ అయ్యాయి. కానీ ఈ క్షణానికీ ఆ భూములు రెవెన్యూ రికార్డుల్లో 22-ఏ నిషేధిత జాబితాలో రాష్ట్ర ప్రభుత్వ భూమిగానే నమోదై ఉన్నాయి. అయినా అధికారులు నోరు విప్పరు.. హైడ్రా అటువైపు కన్నెత్తి చూడదు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాదర్గుల్ భూములు ఇప్పుడు బిగ్ బ్రదర్స్ హస్తగతమైనట్టు తెలుస్తున్నది. ప్రభుత్వంలోని నంబర్-2 మంత్రి అనేక కంపెనీల రూపంలో ఆ భూముల్లో పాగా వేసి కథ ముగించాలనుకున్నా, అది నెరవేరలేదు. గుట్టురట్టయి… అన్నివర్గాల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం కావడంతో ప్రభుత్వ పెద్దలు కొంతకాలం పాటు మౌనం వహించారు. కానీ కొన్నిరోజులుగా మళ్లీ ఆ భూములపై పావులు కదపడం మొదలుపెట్టారు.
ముఖ్యంగా నంబర్-2 మంత్రిని సైడ్ చేసి బిగ్ బ్రదర్స్ నేరుగా రంగంలోకి దిగినట్టు నాదర్గుల్ గ్రామంలో ప్రచారం జరుగుతున్నది. బ్రదర్స్ అనుచరులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి, గతంలో డబ్బులు తీసుకోకుండా నిరసన తెలిపిన రైతులను రాజీకి తీసుకొచ్చేందుకు భారీ ప్రయత్నాలు చేశారట. కొందరిని నయాన… మరికొందరిని భయాన దారిలోకి తెచ్చుకున్నారని, ఒక్కొక్కరికీ రూ.లక్షలు ముట్టజెప్పి నోరు మూయించారని చెప్తున్నారు. బిగ్ బ్రదర్స్ ఈ స్థాయిలో రెచ్చిపోతుంటే.. మరి రాష్ట్రంలో చట్టాలు ఎందుకు? ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఈ స్థాయిలో అధికార యంత్రాంగం ఎందుకు? ‘గుత్ప (దొడ్డు కర్ర) ఎవనిదో, బర్రె వానిదే’ అన్నట్టుగా… అధికార, ధన బలం ఉన్నవారు ప్రభుత్వ భూములను చుట్టేసి చంకన పెట్టుకుంటే భావి తరాలకు సర్కారు భూములు మిగులుతాయా?
నాదర్గుల్ భూములపై రెవెన్యూ శాఖ మౌనం వీడటం లేదు. ఈ భూములు ప్రభుత్వానివేనంటూ నిరుడు మార్చిలో కందుకూరు ఆర్డీవో ఆధారాలతో సహా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి మాత్రం ఆ భూములను పరిరక్షించడం లేదు. ఎందుకు? అని అడిగితే జిల్లా కలెక్టర్ మొదలు ఆర్డీవో, తహసీల్దార్ వరకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు. గతంలో ఈ భూములపై సీలింగ్ ప్రక్రియ మొదలుపెట్టినట్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు ఉండగా, ప్రభుత్వ భూములు అంటూ పోరాడకుండా సీలింగ్ ప్రక్రియపై దృష్టిపెట్టడంపై అప్పట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కాగా సీలింగ్ ప్రక్రియ ఇప్పుడు ఎంతవరకు వచ్చిందనే దానిపైనా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. కారణం.. సీలింగ్ ప్రక్రియ నిర్వహిస్తే చట్టం ప్రకారం గతంలో ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీలు చేసుకున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లన్నీ చెల్లకుండా పోతాయి. అంటే అవి సర్కారు భూములు అయినందున అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవాలి. లేదంటే శివరాజ్ బహదూర్ వారసులందరికీ నోటీసులు ఇచ్చి, సీలింగ్ ప్రక్రియ నిర్వహించాలి. ఇందుకుగాను ఆయనకు ఉన్న భూములన్నింటినీ పరిగణనలోనికి తీసుకోవాలి. ఈ రెండు మార్గాలు తప్ప రెవెన్యూ శాఖ ముందు నిబంధనల మేరకు మరో మార్గం లేదని రెవెన్యూ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఓ అపరిచిత వ్యక్తి రైతు దగ్గరికి వచ్చాడు. తాను బిగ్ బ్రదర్స్ అనుచరుడినని పరిచయం చేసుకున్నాడు. కొన్ని ఫొటోలు చూడాలని రైతుపై ఒత్తిడి తెచ్చాడు. ఆ ఫొటోల్లో రక్తపు మడుగులో ఉన్న ఒక వ్యక్తి ఉంటాడు. ‘చూశావా..! అన్న చెప్పినట్టు వినకుంటే ఇట్లనే అయితది’ అని బెదిరించాడు. ‘ఎందుకొచ్చిన గొడవ! నాతో రా.. గండిపేటకు తీసుకుపోయి అన్నతో మాట్లాడిస్తా!’ అని అన్నాడు.
– ఇదీ… రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ గ్రామంలోని ఒక రైతుకు కొంతకాలం కిందట ఎదురైన అనుభవం.