హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ ఎదురుపడుతరా? రాఖీ పండుగ రోజు సీఎంకు రాఖీ కడుతరా? అనే ఉత్కంఠకు శుక్రవారం తెరపడినా.. ఆవెంటనే కొత్త చర్చ మొదలైంది. సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ బంగారు రాఖీ కట్టారు. ప్రత్యేకంగా చేయించి కట్టిన ఈ రాఖీతో ఆమె రాజీ కోసం వెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వివాదానికి ముగింపు పలికే చివరి ప్రయత్నంగా కొండా దంపతులు రాఖీ రాజకీయాన్ని ఎంచుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఒకవేళ రాఖీ అస్త్రానికి కూడా రేవంత్‌రెడ్డి దిగిరాకుంటే.. చిట్టచివరిగా రాజీనామా అస్త్రం ప్రయోగించి తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఎంతటి ఒత్తిడి వచ్చినా.. సరెండర్ అయ్యేది లేదని, తెగేదాకా నిలబడాలని కొండా దంపతులు గట్టి నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.
బలవంతంగా మంత్రి పదవి నుంచి తప్పించే పరిస్థితి వస్తే.. మౌనంగా ఉండకూడదని, మంత్రి పదవితోపాటు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉపఎన్నిక సమరం పూరించి పోరును నేరుగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్టు చెప్తున్నారు. ఈ ఉపఎన్నికను రేవంత్ ప్రభుత్వంపై, ఆయన పరిపాలనపై తిరుగులేని రెఫరెండంగా మార్చి గట్టి రాజకీ య సవాల్ విసరాలనేది కొండా వర్గం వేస్తు న్న ఎత్తుగడగా వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. మరోవైపు సెప్టెంబర్ 7 లోపు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి సైలెంట్‌గా తప్పించాలని రేవంత్‌రెడ్డి వేస్తున్న ఎత్తులు ఒక్కటి కూడా పారకపోవడంతో పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను సురేఖ ఖండించకపోవడాన్ని పీసీసీ క్రమశిక్షణా సంఘం తప్పుబట్టింది. సమగ్ర విచారణ జరిపి నివేదికను పీసీసీకి అందజేసింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా ఆమెపై వేటు తప్పదనే సంకేతాలనే ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆమెను కాపాడుకుంటూ వచ్చానని, ఇక కాపాడలేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చేతులెత్తేశారట. కొండా సురేఖ నేరుగా బెంగళూరు వెళ్లి మల్లికార్జున ఖర్గేను కలిసిన సంగతి తెలిసిందే. ఆయనతో తన వైఖరిని, ప్రభుత్వంలో తనకు ఎదురవుతున్న పరిణామాలను పూసగుచ్చినట్టు వివరించారని సమాచారం. ఖర్గే ఎలాంటి అభయం ఇచ్చారో గానీ.. ఆ తర్వాత ఆమె వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
క్రమశిక్షణ కమిటీ అధిష్ఠానానికి నివేదిక సమర్పించిన తర్వాత కూడా ఆమె బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదని గుర్తు చేస్తున్నారు. సీఎం విదేశాల్లో ఉన్నప్పుడే భట్టిని కలిసేందుకు కొండా దంపతులు ప్రయత్నించగా, ఆయన నిరాకరించిన ట్టు ప్రచారం జరిగింది. రేవంత్ తిరిగి వచ్చిన తర్వాత ఆయన సూచన మేరకు భట్టి విక్రమార్క కొండా మురళిని ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రితో భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ.. తమ కుమార్తె చేసిన వ్యాఖ్యలను ఖండించలేదని, అలాగని సమర్థించలేదని చెప్పారు. తమ కుమార్తె ప్లాన్-బీ ఏమిటో తనకు తెలియదన్నారు. ఈ వ్యాఖ్యలతో ఖర్గే నుంచి కొండా కుటుంబానికి ఏం అభయం వచ్చిందోనన్న చర్చ గాంధీ భవన్లో మొదలైంది.
తాజా పరిణామాలతో సీఎం రేవంత్‌రెడ్డి తన దూతగా భట్టి విక్రమార్కను ఆగమేఘాల మీద బెంగళూరుకు పంపినట్టు ప్రచారం జరుగుతున్నది. దేవదుర్గం బంగారు గనుల క్షేత్ర స్థాయి పరిశీలన పేరుతో బుధవారం బెంగళూరు వెళ్లిన భట్టి.. అక్కడ మల్లికార్జున ఖర్గేను కలిశారట. గంట పాటు భేటీ అయ్యి, కొండా సురేఖ వ్యవహారశైలి వల్ల పార్టీకి నష్టం జరిగిందని, ఆమెపై క్రమశిక్షణా చర్యలు అవసరమని, రేవంత్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఈ అంశంపై ఏకాభిప్రాయంతో ఉన్నారని వివరించినట్టు కాంగ్రెస్ నేతల్లో ప్ర చారం జరుగుతున్నది. ఖర్గే భిన్నంగా స్పందించారని, క్షేత్రస్థాయి నివేదికలు చూడకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేమని తేల్చి చెప్పినట్టు తెలిసింది.
బీసీ మహిళా నేతపై వేటు వేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని, దేశవ్యాప్తంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించినట్టు సమాచారం. మీనాక్షి నుంచి నివేదిక అందిన తర్వాత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభిప్రాయం తెలుసుకొని, తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు తెలిసింది. రేవంత్ రాయబారం విఫలమైందంటూ చర్చ జరుగుతున్నది. సురేఖను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఏఐసీసీ కోరే అవకాశాలు ఎకువగా ఉన్నాయని సీఎం అనుకూల వర్గం ప్రచారం చేయిస్తున్నది. నిరాకరిస్తే మంత్రివర్గం నుంచి తొలగించడం లేదా రాబో యే విస్తరణలో తప్పించడం వంటి మార్గాలను పరిశీలిస్తున్నారని లీకులు వదులుతున్నారు.
మరోవైపు కొండా కుటుంబం కూడా అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్తున్నారు. తన శాఖలోని అధికారులను తనకు తెలియకుండానే మాతృశాఖలకు పంపడం, ఓఎస్డీ వ్యవహారంలో చట్టపరమైన విచారణలు వేగవంతం కావడం వంటి అంశాలపై సురేఖ తన అసంతృప్తిని ఇప్పటికే హైకమాండ్ ముందుంచారట. అధిష్ఠానం తనను క్యాబినెట్ నుంచి తప్పిస్తుందా? లేదా ఇతర చర్యలు తీసుకుంటుందా? అనేది తేలిన తర్వాతే తమ తదుపరి అడుగులు వేస్తారని కొండా వర్గం చెప్తున్నది. సురేఖ మౌనం నిశ్శబ్దం కాదని, అధిష్ఠానం నిర్ణయం ఆధారంగా కొత్త దారి వేసుకోవడానికి వేస్తున్న ముందస్తు ప్రణాళిక అని పేర్కొంటున్నారు.
ఒకవేళ తమపై కఠిన చర్యలు తీసుకుంటే, బీసీ సెంటిమెంట్‌ను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లేందుకు ఉపఎన్నికకు సిద్ధం కావాలని అనుకున్నట్టు సమాచారం. బైఎలక్షన్కు వెళ్లడం ద్వారా తమకున్న బలమైన బీసీ కేడర్, వ్యక్తిగత ఇమేజ్‌తో రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రెఫరెండం పెట్టి అధిష్ఠానం కండ్లు తెరిపించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. మరోవైపు.. తెలంగాణలో బలపడేందుకు చూస్తున్న బీజేపీ ఉత్తర తెలంగాణలో బలమైన బీసీ నాయకత్వం కోసం వెతుకుతున్నది. దీంతో కొండా దంపతులకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు పుషలంగా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి బీజేపీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ అభ్యర్థిగా ఉపఎన్నిక బరిలో దిగే అవకాశం కూడా ఉన్నదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.