Harish Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రైతులను, పేదలను కంటతడి పెట్టించడమే కాంగ్రెస్ మార్క్ మార్పు? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇండ్ల మీదికి బుల్డోజర్లు, రైతుల ఇండ్లపైకి బ్యాంకు అధికారులు.. ఇదేనా? ‘మార్పు’? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి నిర్వాకానికి మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో రైతుపై బ్యాంక్ అధికారుల దౌర్జన్యమే నిదర్శనమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
రూ.2 లక్షల రుణమాఫీ పేరిట రేవంత్‌రెడ్డి చేసిన మోసం రైతులపాలిట శాపంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. బ్యాంకు సిబ్బంది రైతుల ఇండ్లపై బడి తలుపులు పీకుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. రైతుపై బ్యాంక్ అధికారుల దౌర్జన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇంత దిగజారుడు తనమా? ఇంత దౌర్జన్యమా? సీఎం రేవంత్‌రెడ్డి చేసిన నిర్వాకానికి రైతుల పరువు బజారున పడుతున్నదని తెలిపారు.