Harish Rao | రుణమాఫీ చేయకుండా ప్రజలను మోసం చేసిన గజదొంగ రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ కాదు చీట్ చేస్తున్నారని విమర్శించారు. లేనివి ఉన్నట్లు చెప్పి మోసం చేయడం రేవంత్ అలవాటేనని.. రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తే రుణమాఫీపై నిలదీస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిదని, కొండారెడ్డిపల్లికి లేదా సిద్దిపేట వెళ్లి రుణమాఫీపై రైతులను అడుగుదామన్నారు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ మంత్రులు రోజూ చెబుతున్నారని, ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నది నా సవాల్ అని.. చేశారా? అంటూ రేవంత్‌ని నిలదీశారు. రుణమాఫీ సవాల్ ఏమైందో రైతులే చెబుతారన్నారు. వ్యవసాయ మంత్రి లెక్కల ప్రకారమే 22లక్షల మందికి రుణమాఫీ కాలేదని.. రైతులను కాదు రాహుల్‌కు రూడా రేవంత్ మోసం చేశారన్నారు. రుణమాఫీ సభకు సీఎం మూడుసార్లు ఆహ్వానించినా రాహుల్ రాలేదన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు వాల్మీకి కుంభకోణంపై సైతం స్పందించారు. వాల్మీకి కుంభకోణంలో పట్టపగలు నిలువు దోపిడీ జరిగిందని.. ఈ కుంభకోణం గురించి సీఎం, కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. వాల్మీకి కుంభకోణంలో మాపై ఆరోపణలు చేస్తున్నారని.. వాల్మీకి కుంభకోణంపై ఈడీకి ఫిర్యాదు చేద్దామన్నారు. వాల్మీకి కుంభకోణంపై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా? అని సవాల్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాబట్టే కుంభకోణంపై ఈడీ దాడులు జరగట్లేదని ఆరోపించారు. కుంభకోణంపై విచారణ చేసి బీజేపీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని.. ఈ కుంభకోణంపై ఈడీకి ఫిర్యాదు చేస్తామన్నారు. సివిల్ సప్లయిస్ కుంభకోణంపై కూడా ఈడీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.