Harish Rao | లక్షా50వేలకోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తారట.. కానీ, రైతులకు మాత్రం సున్నం పెడతాడట అంటూ రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులను ధాన్యం కొనుగోలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నెల రోజులుగా వడ్లు తెచ్చినా కోనేటోళ్లు లేరని.. పట్టించుకునే నాథుడు లేడు అని రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వంలో వడ్లుకొనే దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30శాతం వడ్లు దళారులు కొన్నారని.. రైతులు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు గోసపడుతున్నారని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేని పరిస్థితి దుస్థితి నెలకొందని.. ఎన్నికలకు ముందు రేవంత్ రైతుల మద్దతు కోరిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇప్పుడేఓ రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతీ గింజ కొనుగోలు చేశామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం నెల రోజులైనా కొనడం లేదని.. పగలంతా కోతుల బెడదతో ఇబ్బందులుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ధర్నాలు చేస్తున్నారని, రైతులను రేవంత్ రోడ్డున పడేశారన్నారు. రైతుల ఓట్లు కావాలని గానీ రైతుల వడ్లు వద్దంటున్నారని.. ఒక్కనాడైనా కొనుగోళ్లపై రేవంత్ సమీక్ష నిర్వహించాడా? అంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రేవంత్ ఊరూరు తిరిగాడని.. ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి చూడాలలని డిమాండ్ చేశారు. వడ్లకు రూ.500 బోనస్ బోగస్ అయ్యిందని.. రైతుబంధు దిక్కలేకుండాపోయిందన్నారు. రేవంత్ ప్రభుత్వం రైతుల ఉసురుపోసుకుంటుందని.. ఎక్కడా మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టలేదని.. పత్తికి కూడా మద్దతు ధర రావడం లేదన్నారు. ఆంధ్రా దళారులు ఇక్కడికి వచ్చి ధాన్యం కొనుక్కువెళ్తున్నారని.. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. క్వింటాల్‌కు రూ.500 రైతులు నష్టపోతున్నారన్నారు. సగం మంది రైతులకు రుణమాఫీ జరుగలేదని.. రుణమాఫీకి 31కోతలు పెట్టారని మండిపడ్డారు.
కరోనా కష్టకాలంలో కేసీఆర్ రైతుబంధును రైతుల ఖాతాల్లో జమ చేశారని.. కేసీఆర్ 11 సార్లు 72,815 కోట్ల రైతుబంధు ఇచ్చారన్నారు. లక్షా50వేలకోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తారట.. కానీ, రైతులకు మాత్రం సున్నం పెడతాడట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని.. తడిసిన ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ఐకేపీ సెంటర్లకు కొబ్బరికాయలు కొడితే సరిపోతుందా? అంటూ ప్రశ్నించారు. మంత్రులు ఫొటోలకు ఫోజులిచ్చి పోయారని.. క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, ఉన్నతాధికారులు పర్యటించాలన్నారు. రైతుల బతుకు గాల్లో దీపంలో తయారైందన్నారు. సోయాబీన్ రైతులకు ఇప్పటికీ డబ్బులు వేయలేదని.. సిద్దిపేట జిల్లాలో 3.60లక్షల ఎకరాల్లో వరిసాగైందని తెలిపారు. 9లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండాయని పేర్కొన్నారు. అధికారులు మాత్రం 800 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారన్నారు. పండిన పంటలో ఒకటో వంతు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆరోపించారు. ఇప్పటికే పావలాశాతం వడ్లు బయటకు వెళ్లిపోయానని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అంటూ విమర్శించారు.