Harish Rao : సింగరేణి సంస్థలో బొగ్గు కుంభకోణంతోపాటు సోలార్ కుంభకోణం కూడా జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. రేవంత్ బావమరిది కుంభకోణం బయటపెట్టినందుకే తమకు సిట్ నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అవినీతి రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
‘‘సిట్ విచారణపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లోపల ఏదో జరుగుతుందని తప్పుడు లీకులు ఇస్తున్నారు. లీకులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. కట్టుకథలతో ఇంకెన్నాళ్లు ప్రభుత్వాన్ని నడుపుతారు. రెండేళ్లు దాటినా లీకు రాజకీయాలే చేస్తారా..? రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రజలు చరమగీతం పాడతారు. మంత్రుల మధ్య వాటాల పంచాయితీ ఉంది. మంత్రుల పంచాయితీ కాంగ్రెస్ కు ఉరితాడులా మారింది. రేవంత్ బావమరిది వ్యవహారం ఆధారాలతో సహా బయటపెట్టాం. అందుకే ప్రభుత్వానికి కంటిమీద కునుకులేదు. కుంభకోణం ఎలా బయటపడిందా అని తలలుపట్టుకుంటున్నారు. సింగరేణి భూకుంభకోణం వల్ల తెలంగాణ ప్రతిష్ట మసకబారింది. సుజన్ వ్యవహారం బయటపెట్టినందుకే నాకు, కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చారు. రేవంత్ సిట్ కు కేటీఆర్ భయపడే వ్యక్తి కాదు. అలా భయపడేవాళ్లం అయితే ఉద్యమాలు చేసే వాళ్లం కాదు. మేం సుజన్ రెడ్డి వ్యవహారం బయటపెట్టిన తర్వాత ఢిల్లీ కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టింది.
నాడు కోల్ స్కాం యూపీఏ ప్రభుత్వ పతనానికి కారణమైంది. నేటి కోల్ స్కాం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది పలికింది. సింగరేణి స్కాంపై దృష్టి మళ్లించేందుకే బీజేపీతో కలిసి సిట్ డ్రామాలు ఆడుతున్నారు. నాడు సింగరేణి సిరుల గనిగా ఉండేది. నేడు సింగరేణి సుజన్ గనిగా మారింది. సింగరేణిలో బొగ్గు స్కాం మాత్రమే కాదు.. సోలార్ స్కాం కూడా జరిగింది. 127 మెగా వాట్ల సోలార్ స్కాం జరిగింది. మూడు ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్స్ పెట్టాలి. ఎంఎస్ఎంఈలను పాల్గొనకుండా మూడింటికీ కలిపి ఒకేసారి టెండర్లు పిలిచారు. టెండర్ అనుమతులు కఠినం చేశారు. సోలార్ ప్లాంట్స్ కు కూడా సైట్ విజిట్ నిబంధన పెట్టారు. రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు వచ్చేలా టెండర్లు కట్టబెట్టారు. ప్రభుత్వం అనుకున్నవారికి టెండర్లు దక్కేలా చూశారు. సోలార్ పవర్ పర్ మెగావాట్ దేశమంతా రూ.3 కోట్ల రూపాయలు. కానీ, మన దగ్గర రూ.5 కోట్ల 4 లక్షలకు టెండర్ ఇచ్చింది. అదనంగా సింగరేణి భూములు కూడా ఇచ్చారు’’ అని హరీష్ రావు ఆరోపించారు.