Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాజకీయ లబ్ధి పొందాలన్న వక్ర బుద్ధే తప్పా.. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడాలనే తపన లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ అబద్ధాలపై ప్రవాహంపై ఆయన ధ్వజమెత్తారు. బోడిగుండుకు మోకాలుకు లంకె పెట్టి మాట్లాడటంలో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడని అని మరోసారి రుజువైంది. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కేసీఆర్ చెప్పిన వాటిని దురుద్దేశపూర్వకంగా వక్రీకరించాడని ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లోని అజెండా ఐదు అంశాలు దాచి పెట్టి, అజెండా నెంబర్ వన్ మాత్రమే అంశాలను మాత్రమే ప్రస్తావించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోదావరి–కృష్ణ నదుల అనుసంధానం ప్రాజెక్టుల విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు పోకూడదని.. ఒకవేళ వెళ్తే అందుకు తెలంగాణ అంగీకరించదని.. ఆనాడు కేసీఆర్ అజెండాలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. ఈ విషయాన్ని కావాలని దాచిపెట్టి, స్వార్థపూరిత రాజకీయ లక్ష్యాల కోసం అసత్యాలను ప్రజల ముందు ఉంచారని మండిపడ్డారు. మీడియాను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని.. అబద్ధాల పునాదులపై జరిగిన ఈనాటి రేవంత్ తతంగాన్ని ప్రజలు విశ్వసించరన్నారు.