హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. క్యాబినెట్ నిర్ణయాలపై ఆయన గురువారం రాత్రి ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వంలోని ఉద్యోగులందరికీ పెండింగ్‌లో ఉన్న 3 డీఏలను తక్షణం చెల్లిస్తామని అభయహస్తం మ్యానిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 డీఏలను పెండింగ్‌లో పెట్టిందని ఎద్దేవా చేశారు. ఇన్ని నెలల ఎదురుచూపుల తర్వాత ఇప్పుడు ఉసూరుమంటూ ఒక డీఏ విడుదల చేసిందని మండిపడ్డారు.
బకాయిలను, సకాలంలో నేరుగా చెల్లించడం అంటే ఇదేనా రేవంత్‌రెడ్డి? అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పీఆర్సీ ఏర్పాటు చేస్తామంటూ మభ్యపెట్టి, 18 నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు పీఆర్సీ ఊసే లేదని విమర్శించారు. ఆరునెలల తర్వాత మరో డీఏ అని చెప్పడం సిగ్గుచేటు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. క్యాబినెట్లో పీఆర్సీ, పెండిం గ్ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ప్రస్తావనలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఉద్యోగుల ఆశలను వమ్ము చేసిందని దుయ్యబట్టారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్టు పెండింగ్ డీఏలన్నీ చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఉద్యోగుల బీమా నిధి కోసం రెండుసార్లు ఇచ్చిన చెకులపై మళ్లీ క్యాబినెట్ నిర్ణయం హాస్యాస్పదమని విమర్శించారు. గతంలో రెండుసార్లు ఉద్యోగులు ఇచ్చిన చెకులకు విలువ లేదా సీఎం రేవంత్‌రెడ్డీ? అని నిలదీశారు. నిరుడు నవంబర్ 19న వరంగల్‌లో స్వయం సహాయక సంఘ సభ్యులకు రుణబీమా, ప్రమాదబీమా చెకులను సీఎం రేవంత్‌రెడ్డి అందించారని, మళ్లీ అవే చెకులను ఈ ఏడాది మార్చి 8న ఇందిరా మహిళా శక్తి పేరిట హైదరాబాద్ లో నిర్వహించిన సభలో అందించారని గుర్తుచేశారు. మహిళ సంఘాలకు సీఎం రెండుసార్లు చెకులు ఇచ్చి నా.. చెల్లుబాటు కాలేదని తెలిపారు. ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయంతో మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.