సంగారెడ్డి/మంచిర్యాల, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలన్నీ బంద్ అయ్యాయని, ఇదేమని ప్రజలు ప్రశ్నిస్తే రేవంత్‌రెడ్డి బూతుల దండకం అందుకుంటున్నాడని మాజీ మంత్రి, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. పాలన చేతగాక.. తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు రోజుకో డైవర్షన్ రాజకీయం చేస్తున్న రేవంత్‌రెడ్డిని ప్రజలే సీఎం కుర్చీ నుంచి డైవర్ట్ చేస్తారని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్, జిన్నారంలో మహిళలతో హరీశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. మొదట సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో మహిళలతో సమావేశమై వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మహిళలు హరీశ్‌కు వివరించారు. ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని భరోసా ఇచ్చారు.
చావునోట్లో తలపెట్టి తెలంగాణ తీసుకువచ్చిన కేసీఆర్‌ను పట్టుకొని రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ‘అసెంబ్లీలో పెన్షన్ ఎప్పుడు ఇస్తావని అడిగితే లాగుల తొండలు ఇడుస్తా.. మహాలక్ష్మీ పథకం అమలు గుర్తించి అడిగితే పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటున్నడు’ అని మండిపడ్డారు. కేసీఆర్ రాక ముందు ఇస్నాపూర్‌లో పవర్ హాలిడే ఉండేదని గుర్తుచేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక పటాన్చెరు నియోజకవర్గంలోని కంపెనీలకు 24 గంటల కరెంట్ సరఫరా చేశారని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో తిరిగి కరెంటు కోతలు మొదలయ్యాయని వాపోయారు. సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి 54 మంది చనిపోతే ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు ఇస్తామన్న కోటి రూపాయల పరిహారం రేవంత్‌రెడ్డి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కార్మికుల శవాల ముందు కోటి పరిహారం ఇస్తామని చెప్పి మాట తప్పిన రేవంత్‌రెడ్డి మనిషా? పశువా?’ అని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి కోటి రూపాయలు ఇచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. తన పోరాటం వల్లే రూ.25 లక్షల వరకు పరిహారం ఇచ్చారని, మిగతా డబ్బులు ఇవ్వాలని బాధితుల తరఫున కోర్టులో కేసు వేసినట్టు చెప్పారు.
కారుకు ఓటేస్తే రేవంత్ గూబ గుయ్యిమంటది
పట్టణ ఓటర్లు బీఆర్ఎస్కు ఓటు వేస్తే రేవంత్‌రెడ్డి గూబ గుయ్యిమంటదని హరీశ్ విరుచుకుపడ్డారు. జిన్నారంలో మహిళలతో సమావేశమై దేవుడి మీద ఓట్టువేసి రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన పాపాత్ముడు రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి వచ్చాక రైతులు ఐదు పంటలు వేస్తే మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టాడని చెప్పారు. మహాలక్ష్మీ పథకం అమలు కావాలన్నా, అవ్వాతాతలకు రూ.4వేల పెన్షన్ రావాలన్నా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
బంగారు బాతును కోసుకుతింటున్నరు
తెలంగాణ సిరులతల్లి సింగరేణి సంస్థను రేవంత్‌రెడ్డి కుంభకోణాలకు నిలయంగా మార్చాడని హరీశ్ నిప్పులు చెరిగారు. రేవంత్ బామ్మర్ది సృజన్‌రెడ్డి కండ్లలో ఆనందం కోసం కోట్లాది రూపాయల సింగరేణి సొమ్మును అక్రమంగా కట్టబెట్టేందుకు టెండర్లలో మార్పులు చేశారని చెప్పారు. కార్మికుల కష్టం, రక్త, మాంసాలు దోచుకోవడానికి సింగరేణి ఏమైనా రేవంత్‌రెడ్డి జాగీరా? లేక ఆయన బామ్మర్ది సొత్తా? అని నిలదీశారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కలిసి సింగరేణికి అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు.

సింగరేణిని కొట్టి ఆ పైసలే పంచుతున్నరు
‘మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తది. ఇవ్వాళో, రేపో మీ ఇండ్లళ్లకు పైసలు వస్తయ్. రూ.5 వేలు ఇచ్చి ఓటు కోసం ఒట్టు పెట్టుకోమంటరు. దయచేసి ఆ పని చేయకండి. మన సింగరేణిని కొట్టి సంపాదించిన పైసలు. ఒట్టు పెట్టుకుంటే దేవునికి మనసులో చెప్పుకోండి. దేవుడా ఇది ఉత్తుత్త ఒట్టే ఏం అనుకోకని దండం పెట్టుకోండి. ఇచ్చిన పైసలు తీసుకొని కారు గుర్తుకు ఓటు వేయండి’ అని హరీశ్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తు అని, సింగరేణి భవిష్యత్తు అని చెప్పారు. ఒకటో తారీఖున కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే బ్యాంక్‌లో అప్పు చేస్తే తప్ప, ఓడీ తెస్తే తప్ప ఇవ్వలేని దుస్థితికి సింగరేణిని తెచ్చారని వాపోయారు. ‘రూ.6 వేల కోట్ల స్కామ్ ఇది.. సింగరేణి టెండర్లలో తప్పు చేయనోళ్లయితే సమాధానం చెప్పాలి కదా? సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి రావాలి కదా? ఎందుకు వస్తలేడు?’ అని నిలదీశారు.
కారుణ్య నియామకాల ఘనత కేసీఆర్‌దే
‘నాడు చంద్రబాబు నాయుడు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేసిండు. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. కేసీఆర్ మాట ఇచ్చి డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించిండ్రు. నెలనెలా మెడికల్ బోర్డు మీటింగ్ పెట్టిండ్రు. పదేండ్లలో 16,500 మందికి డిపెండెంట్ ఉద్యోగాలిచ్చిండ్రు. కాంగ్రెస్ వచ్చింది మళ్ల ఆగమైనం’ అని హరీశ్ వివరించారు. ‘నెలనెలా మెడికల్ బోర్డు లేదు. అంతా కలిపితే రెండే బోర్డులు పెట్టిండ్రు.. వంద మందిపోతే 70 మందిని అన్‌ఫిట్‌కు నిరాకరించిండ్రు. నేను మొన్న అందర్నీ తోలుకొని సింగరేణి సీఎండీ ఆఫీస్‌కు పోతే.. అక్కడ అన్‌ఫిట్ కోసం వచ్చిన ఓ కార్మికుడికి పాపం నడువస్తలేదు. ఒకాయనకు క్యాన్సర్ వచ్చింది’ అని పేర్కొన్నారు.
మంత్రి వివేక్‌కు వాటా ఉన్నదా?
‘చెన్నూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన వివేక్ కార్మిక మంత్రిగా ఉన్నడు.. కార్మికులకు అన్యాయం జరిగితే ఎందుకు నోరు విప్పుత లేడు? మెడికల్ బోర్డు, డిపెండెంట్ ఉద్యోగాలపై ఎందుకు అడగరు? ఈ స్కామ్‌లో ఆయనకు వాటా ఉన్నదా?’ అని నిలదీశారు.
పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌దే..
సింగరేణిలో కొన్ని వేల మందికి పట్టాలిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమని హరీశ్ గుర్తుచేశారు. క్యాతన్‌పల్లిలో 3,360 మందికి, మంచిర్యాలలో దాదాపు 3,600 మందికి, బెల్లంపల్లిలో దాదాపు రెండు వేల పైచిలుకు మందికి పట్టాలు వచ్చాయని తెలిపారు. ‘ఒకప్పుడు రూ.2 లక్షలు, రూ.3 లక్షలున్న భూమి.. మేం పట్టాలిచ్చాక రూ.30 లక్షలు, రూ.40 లక్షలు కాలేదా? చెప్పాలి. అది చేసింది కేసీఆర్ కాదా? ఆలోచించాలి’ అని సూచించారు.
కేసీఆర్ లేకుంటే సీఎం అయ్యేటోనివా?
‘కేసీఆర్ తెలంగాణ తేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోనివా?.. ఆంధ్రా నాయకుల వెంబటి ఉందువు కదా? ఇవ్వాళ తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను పట్టుకొని ఏం భాష మాట్లాడుతున్నవ్? కేసీఆర్ మీద అటువంటి భాష మాట్లాడవచ్చునా? ఆ భాష ఆమోదయోగ్యమేనా? ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా అది?’ అని హరీశ్ నిప్పులు చెరిగారు.
సీఎం కుర్చీ నుంచి డైవర్ట్ కావడం పక్కా..
‘మేం రేవంత్‌రెడ్డి స్కామ్‌లు బయటపెట్టంగనే ఒక డైవర్షన్.. కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఏమైనయ్? దళితబంధు ఏమైంది? బతుకమ్మ చీరలేమైనయ్? బీసీబంధు ఏమైంది? కేసీఆర్ కిట్లు ఏమైనయ్ అని అడిగితే రేవంత్‌రెడ్డి డైవర్షన్ టాక్టిక్స్.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఏమైనయ్ అంటే డైవర్షన్ టాక్టిక్స్.. ఏదో తిట్టుడు.. పోలీస్‌స్టేషన్‌లో నీ మీద కేసున్నది.. సిట్ పిలుస్తున్నది రా అనుడు.. అన్నీ డైవర్షన్లే.. స్కీమ్‌లు అడిగితే డైవర్షన్, స్కామ్‌లు బయట పెడితే డైవర్షన్.. ఆరు గ్యారెంటీలు అడిగితే డైవర్షన్.. బిడ్డా జనం అన్నీ మనసున పెట్టుకున్నరు .నిన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి డైవర్ట్ చేస్తరు జాగ్రత్త’ అని హరీశ్‌రావు హెచ్చరించారు.
స్కీమ్‌లు లేవు.. స్కామ్‌లే..
‘రెండేండ్లలో రేవంత్‌రెడ్డి ఉన్న స్కీమ్‌లు బంద్ పెట్టి.. స్కామ్‌లు చేసిండు.. జాబ్ క్యాలెండర్ రాలే కానీ స్కామ్ కాలెండర్ వచ్చింది. జనవరిలో భూముల కుంభకోణం, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ దగ్గర ఫ్లైయాష్ కుంభకోణం, మార్చిలో మెడికల్ పీజీ సీట్ల కుంభకోణం, ఏప్రిల్‌లో ఆర్టీసీ కుంభకోణం.. ఇట్ల చూసుకుంటూ పోతే డిసెంబర్లో సింగరేణి కుంభకోణం బయటపడ్డది. ఇట్ల నెలకో కుంభకోణం చేస్తున్నడు. మొత్తం దోపిడీ రాజ్యమైంది. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని మన కండ్ల ముందే రేవంత్‌రెడ్డి నాశనం చేస్తున్నడు’ హరీశ్ నిప్పులు చెరిగారు. మళ్లీ వచ్చేది మన గవర్నమెంటే.. మోసం చేసిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలె.
దగా చేసిన కాంగ్రెస్‌ను చీరి చింతకు కట్టాలె.. కారుకు ఓటు గుద్దితే రేవంత్‌రెడ్డి గూబ గుయ్మనాలె.. అప్పుడే ఈ రేవంత్‌రెడ్డి సక్కగైతడు’ అని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గూడెం మధుసూదన్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, సోమిరెడ్డి, పాల సాయిరాం, వెంకటేశంగౌడ్, ప్రభాకర్, పాండురంగారెడ్డి, మంచిర్యాలలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య, విజిత్‌రావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, కలవేని శంకర్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.