సిద్దిపేట, జనవరి 12: కాంగ్రెస్ పాలకులు రైతులను నట్టేట ముంచి, నిస్సిగ్గుగా సంబురాలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. రైతులు కాంగ్రెస్ నేతలు గ్రామాలకు వస్తే నిలదీస్తారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వరకు ఎవరైనా ఒక హామీ అయినా నెరవేర్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు అందరినీ మోసం చేశారని, ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు.
సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ రైతుభరోసా హామీ మేరకు రూ.15 వేలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసగించిందని, వానకాలం రైతుభరోసాకు గుండుసున్నా పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నాయకులు ఊర్లలోకి వస్తే ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాల్సిందే అని రైతులు నిలదీయాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో 3 పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఒక పంటకు కూడా సరిగా ఇవ్వడంలేదని ఎద్దేవా చేశారు. కౌలు రైతులకు రైతుభరోసా ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.
ఎన్నికల ముందు నోరు పెంచి ఏటా ఎకరాకు రూ.15 వేలు ఇస్తానని చెప్పి, ఇప్పుడు ఏటా రూ.12 వేలు మాత్రమే ఇస్తామనడం సిగ్గుచేటని నిప్పులుచెరిగారు. కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉంటే కేవలం పది లక్షల మంది రైతు కూలీలకు మాత్రమే రూ.12 వేల చొప్పున ఇస్తామని అంటున్నారని తెలిపారు. 90 లక్షల మందికి పథకాన్ని ఎగ్గొట్టారని విమర్శించారు. వ్యవసాయ కూలీలందరికీ పథకం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. పథకంలో ప్రతిపాదనలు చేసేటప్పుడు పాలకులకు కనీస సోయి లేకుండా పోయిందని నిప్పులుచెరిగారు. మెడమీద తలకాయ ఉన్నోళ్లు ఇలా చేస్తారా అని ప్రశ్నించారు.
కనపడ్డ దేవుళ్లందరి మీద ఒట్టు పెట్టి రైతు రుణమాఫీ చేస్తానన్న రేవంత్‌రెడ్డి ఏడాది గడిచినా ఇంతవరకు పూర్తిగా చేయలేదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి బుకాయించకుండా ఇచ్చిన మాట ప్రకారం రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రశ్నించిన వారిని గూండాలతో కొట్టించుడో, చిల్లరగాళ్లతో తిట్టించుడో మానుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా రుణమాఫీ కాని కొందరు రైతులు వివరాలను ఆధారాలతో సహా హరీశ్‌రావు మీడియాకు చూపించారు. రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలు కూడా తప్పుతున్నారని, పది పంటలకు బీమా అని చెప్పి ఒక పంటకే ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన ప్రధానమైన 5 హామీలు రైతుభరోసా రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, పంటలబీమా, అన్ని పంటలకు బోనస్, కౌలు రైతులకు రైతుభరోసా అమలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
నారాయణఖేడ్‌కు చెందిన రైతు బీముని అంజయ్య రుణమాఫీ కానందుకు బాధపడుతూ తనకు ఫోన్ చేశాడని హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్ ఉన్నప్పుడు రూ.లక్ష రుణమాఫీ అయిందని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రుణమాఫీ కాలేదని చెప్పినట్టు వెల్లడించారు. తనకు చావే శరణ్యం అంటూ అంజయ్య ఆవేదన వ్యక్తంచేయగా ఆత్మహత్య వద్దని, ప్రభుత్వం రుణమాఫీ సంపూర్ణంగా చేసేవరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చానని హరీశ్‌రావు తెలిపారు.
08