హైదరాబాద్, జూన్ 30(నమస్తే తెలంగాణ) : తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో జూన్ 30 ఒక చీకటి రోజని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమలో కూలి కోసం వలస వచ్చిన 54మంది పేద కార్మికులు సజీవ దహనమైన ఘోర ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా మృతులకు ఆయన నివాళులర్పించారు. ప్రభుత్వం అమానవీయ వైఖరిపై మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ వైఫల్యం, సిగాచి యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. ఘటన జరిగిన రోజున సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లోనే ఉన్నా, 20 కిలోమీటర్ల దూరంలోని ఘటనా స్థలానికి రాకపోవడం, బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడువకపోవడం అత్యంత దారుణమని ఆగ్రహించారు.
విమర్శలు రావడంతో మరుసటి రోజు వచ్చిన ముఖ్యమంత్రి.. మృతదేహాల సాక్షిగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇస్తామని ఘనంగా ప్రకటించి కేవలం రూ.లక్ష మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, వైద్య ఖర్చుల డబ్బులను కూడా ప్రభుత్వం తాను ప్రకటించిన పరిహారంలో కలిపి చూపించడం దుర్మార్గమని నిప్పులుచెరిగారు. క్షతగాత్రులకు సహాయం చేయకపోవడం, డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పడం, బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం తగదని ధ్వజమెత్తారు.
ఈ ప్రమాదం కేవలం అనుకోకుండా జరిగింది కాదని యాజమాన్యం చేసిన సామూహిక హత్యేనని హరీశ్‌రావు ఆరోపించారు. 818 హెచ్‌పీకి అనుమతి తీసుకొని 1,777 హెచ్‌పీ నడుపడం, సేఫ్టీ గార్డ్స్, ఫైర్ శాఖ నుంచి ఎన్వోసీ తీసుకోకపోవడం వంటి నిర్లక్ష్యాల వల్లే దుర్ఘటన సంభవించినట్టు విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయని పేరొన్నారు. ఇంతటి ఘోర నిర్లక్ష్యం బయటపడినా ప్రభుత్వం యాజమాన్యంపై చర్యలు తీసుకోలేదని, హైకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప పోలీసులు కదల్లేదని విమర్శించారు.
కంపెనీ ఎండీని నామమాత్రంగా అరెస్ట్ చేసి, వెంటనే బెయిల్ వచ్చేలా ప్రభుత్వం పరోక్షంగా సహకరించిందని, దీని వెనుక పెద్ద లోపాయికారీ ఒప్పందం ఉన్నదని హరీశ్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి మాట తప్పడం అలవాటేనని, కనీసం చనిపోయిన పేద కార్మికుల కుటుంబాలను మోసం చేయవద్దని హితవు పలికారు. వందల కోట్ల టర్నోవర్ ఉన్న సిగాచి కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద తక్షణమే అటాచ్ చేయాలని, ఆ ఆస్తులను అమ్మైనా సరే, సీఎం ఇచ్చిన హామీ మేరకు పీఎఫ్, ఈఎస్ఐతో సంబంధం లేకుండా ప్రతి బాధిత కుటుంబానికీ బేషరతుగా రూ.కోటి వెంటనే విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.