హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాలను కనీసం 20 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్టు.. అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవడంపై అభ్యంతరం తెలిపాం. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం స్వయంగా స్పీకర్‌ను బుల్డోజ్ చేస్తున్నారు. ఇది సరికాదని బీఏసీలో అభ్యంతరం లేవనెత్తాం. సంఖ్యాబలాన్ని బట్టి బీఆర్ఎస్కు సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరాం. తాము చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారు. నియోజకవర్గాల అభివృద్ధి నిధులను స్పీకర్ ఇప్పించాలి’ అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, శాసనసభ వారికి భరోసాను కల్పించాల్సిన అవసరం ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘రైతుబంధు అందక, రుణమాఫీ కాక రైతులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలి. పెద్దవాగు కొట్టుకుపోవడం, సుంకిశాల రిటైనింగ్ వాల్, ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం, వట్టెం పంప్‌హౌజ్ మునిగిపోవడంపై అసెంబ్లీలో చర్చపెట్టాలని డిమాండ్ చేశాం. నదీజలాల వినియోగంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ విషయమై చర్చించాలని డిమాండ్ చేశాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయమై చర్చించాలని కోరాం. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నది. తక్షణమే ప్రాజెక్టును పునరుద్ధరించాలి’ అని డిమాండ్ చేశారు.
కృష్ణా నదీజలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనిపై సభలో చర్చించాలని బీఏసీలో కోరామని హరీశ్‌రావు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూసింది. దీనిపై సభలో చర్చించాలి. బిల్లులు చెల్లింపునకు 20 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానిపై చర్చించాలని కోరాం. బిల్లుల కోసం ఆందోళన బాటపట్టిన మాజీ సర్పంచ్‌లకు సభ భరోసా ఇవ్వాలని కోరాం. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి వందల రోజులు పూర్తయినా వాటి అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై కూడా సభలో చర్చించాలని డిమాండ్ చేశాం’ అని తెలిపారు.
ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ ఉచిత హామీపై చర్చ పెట్టాలని కోరామని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని విమర్శించారు. జర్నలిస్టులను సైతం తీవ్రవాదులుగా చిత్రీకరిస్తూ అరెస్టులు చేస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించాలని కోరినట్టు తెలిపారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అమలుపై చర్చించాలని కోరామని హరీశ్‌రావు వివరించారు.
‘ఎస్టిమేట్స్ కమిటీని ప్రకటించి ఏడాదవుతున్నది. చైర్మన్‌గా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిని నియమించారు. ఆమె కనీసం నామినేషన్ కూడా వేయలేదు. ఇప్పటివరకు చార్జ్ కూడా తీసుకోలేదు. మరోపక్క ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ)కి నామినేషన్ వేయనివాళ్లను చైర్మన్ చేస్తారు.. అదే పదవికి నా నామినేషన్‌ను ఎందుకు తిరస్కరించారో ఇప్పటి వరకు స్పీకర్ సభలో ప్రకటన చేయలేదు. ఇదేం పద్ధతి?’ అంటూ బీఏసీ సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. శాసనసభ స్పీకర్ దీనిపై స్పందించాలని కోరారు. నిబంధనల ప్రకారం తన నామినేషన్ తిరస్కరణకు గురైతే ఆ విషయాన్ని సభలోనే ప్రకటించాల్సి ఉంటుందని హరీశ్‌రావు చెప్పారు. శాసనసభలో హౌజ్ కమిటీలు ముఖ్యమైనవని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటి వరకు కమిటీలను ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. హరీశ్‌రావు ప్రశ్నలకు స్పీకర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సరైన సమాధానం చెప్పలేదు. శాసనసభలో సమయపాలన లేకుండా పోయిందని, దీనివల్ల శాసనసభపై దురాభిప్రాయం పెరుగుతుందని, సమయపాలన పాటించేలా చూడాలని స్పీకర్‌ను కోరారు.